భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 160
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 160 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 34 🌻
240. “తనకు క్రోధం వస్తే తప్పనిసరిగా అవతలి వాడు నశిస్తాడు. అలా అనుకున్నప్పుడు క్రోధాన్ని దగ్గరికి రానివ్వకూడదు. క్షమ తప్ప ఇంకొకటి ఉండకూడదు. లేకపోతే అందులోంచి కర్మ పుడుతుంది.
241. ఒకడు పాపం చేస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో పాపం చేసిన వాడికి ఏం జరగాలో అది శాసించబడే ఉంది, అలా జరగనే జరుగుతుంది. కనుక తాను శాంత స్వభావంతో ఉండాలి. జ్ఞానలక్షణం అదే.
242. లేకపోతే ఒక కార్యం ఆచరించి, ఒక క్రోధం చేత ఒక దుఃఖానికి హేతువై ఒక కర్మ పుట్టి, ఆ కర్మకు ఫలం అనుభవించవలసి వస్తుంది” అని బోధించాడు నారదుడు. మహర్షులు, జ్ఞానులు ఎవరిని శపించినా, శిక్షించినా, తిట్టినా కొట్టినా అది వాళ్ళకు కల్యాణ హేతువే అవుతుంది.
243. కృష్ణపరమాత్మ తన అవతారంలో 125 సంవత్సరములు జీవించి చేసిన పనులలో నూరోవంతు ఎవరైనా చేయాలంటే, నూరు జన్మలెత్తాలి. ఎన్ని పనులు చేసాడు! ఎన్ని పనులు ఎంత మందితో చేయించాడు! అదంతా కర్మకదా! కర్మకు ఫలం ఉండితీరాలి కదా ఎవరు చేసినా!
244. కృష్ణుడు ఎన్ని జన్మలెత్తాలి ఆ కర్మఫలం కోసమని? అన్న ప్రశ్నలు కలుగకమానవు. ఆయన ఎన్ని కర్మలు చేసినప్పటికీ, నిస్సంగబుద్ధితో శుద్ధబ్రహ్మవస్తువైనటువంటి – తన స్వస్థితియందే ఉన్నాడు.
245. బయట నిర్వర్తించిన కార్యములన్నీ కూడా మనసు, ఇంద్రియములు లోకకల్యాణం కోసమని చేసాయి. అంతేగాని, ఆయన యందు కర్తృత్వభావనే లేదు. కర్తృత్వభావన వల్ల కర్మ ఫలప్రదమవుతుంది.
246. కర్మ స్వతహాగా జడమయినటువంటిది. భావనచేతనే-నేను పనిచేస్తున్నాననే భావనచేతనే-కర్మలోంచి ఫలం పుడుతుంది.
247. పూర్వం గాలవుడు అనే ముని నారదుని దగ్గరికి వచ్చి, “స్వామీ! జ్ఞానప్రవృత్తి ఎలా కలుగుతుంది? ఆశ్రమాచారాలైన గృహస్థధర్మం, సన్యాసము అనే వాటిలో ఏది మేలయినది? అనేక శాస్త్రాలు అనేకమార్గాలు చూపిస్తవికదా! శ్రేష్ఠమయిన ఒక్కమార్గం నాకు చెప్పు” అని అడిగాడు.
248. అందుకు నారదుడు, “గాలవా! ఆశ్రమధర్మాలు నాలుగు ఉన్నాయని నువ్వు వినిఉన్నావు కదా! శాస్త్రాలలో ఆ ఆశ్రమధర్మాలు పైకి పరస్పరవిరుద్ధంగా కనబడతాయి. అందులోని ధర్మసూక్ష్మం సద్గురువును ఆశ్రయిస్తేనే తెలుస్తుంది.
249. స్థూలంగా చూస్తే ఒక ధర్మానికి, మరొక ధర్మానికి వ్యతిరేకలక్షణం కనబడుతుంది. “గృహస్థధర్మంలో, ‘జాగ్రత్తగా ధనం సంపాదించుకుని దాచుకుని భార్యాపిల్లలను బాగా చూచుకో, అతిథి అభ్యాగతులకు పెట్టు’ అని అంటారు. సన్యాసాశ్రమంలో, ‘ధనంమాట ఎత్తవద్దు, ఆ మాట అసలు మనసులోకి రానీయకు’ అంటారు.
250. అయితే ఈ ప్రకారంగా ఒకే వస్తువును గురించి వివిధ ధర్మాలు, ఆయా ఆశ్రమాల్నిబట్టి ఉంటాయి. అసలు ధర్మంయొక్క లక్షణం ఏమిటి? ఏది ఆచరిస్తే ఆ జీవాత్మకు క్షేమమో, ఆ జీవుడికి క్షేమకరమైన భవిష్యత్తు ఉంటుందో దాన్ని ధర్మము అంటాము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment