శ్రీ శివ మహా పురాణము - 272


🌹 . శ్రీ శివ మహా పురాణము - 272 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

64. అధ్యాయము - 19

🌻. సతీకల్యాణము - శివలీల -4 🌻

విష్ణువు ఇట్లు పలికెను -

భూతనాథా! సృష్టికర్త, జగత్ర్పభువు అగు బ్రహ్మను సంహరించవద్దు. ఈతడీనాడు నిన్ను శరణు పొందుచున్నాడు. నీవు శరణాగత వత్సలుడవు (50). నేను నీకు మిక్కిలి ప్రియమగు భక్తుడను. నాకు భక్తరాజు అను కీర్తి గలదు. నీవు నా విన్నపమును మన్నించి నాపై దయను చూపుము (51).

హే నాథా! నేను యుక్తి యుక్త మగు మరియొక్క మాటను చెప్పెదను. వినుము. మహేశ్వరా! నీవు నాపై దయచేసి నా మాటను మన్నింపుము (52). హే శంభో! ఈ నాల్గు మోముల బ్రహ్మ ప్రజలను సృష్టించుటకే ఆవిర్భవించినాడు. ఈయనను సంహరించినచో మరియొక సృష్టికర్త ఉండడు. మరియొక సృష్టికర్తను నీవిదివరలో సృష్టించలేదు (53).

హే నాథా! శివరూపములో నున్న నీ ఆజ్ఞచే మనము త్రిమూర్తులము సృష్టిస్థితిలయ కర్మలను మరల మరల చేయు చుందుము (54).

హే శంభో! ఈ బ్రహ్మను సంహరించినచో, ఆ సృష్టికర్మను ఎవరు చేసెదరు? హే లయకర్తా! హే ప్రభో! కావున నీవు సృష్టి కర్త యగు ఈతనిని సంహరించవలదు (55). దక్షుని కుమార్తె యగు సతీదేవి రూపములో నున్న ఉమా దేవిని, హే ప్రభో! ఈతడే మంచి ఉపాయముతో నీకు భార్య అగునట్లు వ్యవస్థను చేసినాడు (56).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దృఢమగు వ్రతము గల మహేశ్వరుడు విష్ణువు చేసిన ఈ విన్నపమును విని, వారందరికి వినపడునట్లుగా, ప్రత్యుత్తరమును ఇట్లు చెప్పెను (57).

మహేశ్వరుడిట్లు పలికెను -

హే దేవదేవా ! రమాపతీ ! విష్ణూ! నీవు నాకు ప్రాణములవలె ప్రియుడవు. వత్సా! నేనీతనిని సంహరింపబోగా నీవు నన్ను నివారించవద్దు. ఈతడు దుష్టుడు (58). పూర్వము నీవు చేసిన విన్నపమును నేను అంగీకరించితిని. దానిని ఇప్పుడు పూర్తిచెసెదను మహాపాపమును చేసినవాడు, దుష్టుడు, నాల్గు ముఖములు గలవాడు అగు ఈ బ్రహ్మను నేను సంహరించెదను (59).

స్థావర జంగమాత్మకమగు సర్వప్రాణులను నేనే సృష్టించెదను. లేదా, నా శక్తిచే మరియొక సృష్టికర్తను నేను సృష్టించెదను (60). ఈ బ్రహ్మను సంహరించి, నేను చేసిన శపథమును పూర్తిచేసి, మరియొక సృష్టికర్తను సృజించెదను. ఓ లక్ష్మీ పతీ! నీవు నన్ను నివారించకుము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను -

గిరీశుని ఈ మాటను విని, చిరునవ్వుతో ప్రకటమైన కరుణాహృదయము గల అచ్యుతుడు 'వద్దు' అని మరల పలుకుచూ, ఇట్లనెను (62).

అచ్యుతుడు ఇట్లు పలికెను -

పరమ పురుషుడవగు నీవు ప్రతిజ్ఞను చెల్లించు కొనుట యోగ్యమైన విషయమే. కాని, నీవు విచారించుము. హే ప్రభూ! ఈశ్వరా! తనను తాను వధించు కొనుట తగదు (63).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


14 Nov 2020

No comments:

Post a Comment