గీతోపనిషత్తు -122


🌹. గీతోపనిషత్తు -122 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 6

🍀. 5. ముని - మననము - బ్రహ్మము - శ్వాసయందు స్మరణ సాగుచుండగ, కర్తవ్యము లన్నిటిని ఉదాసీన తతో నిర్వర్తించుచు నుండుట. చిత్తము శివుని పైన, చేతులు ప్రపంచములో నుంచుట కూడ సన్న్యాసమే అని కృష్ణుని మతము.. సన్న్యాస మనగ సమ్యక్ న్యాసము. అనగ ఒడుదొడుకులు లేని స్మరణ, హృదయ మందు “సో హం' శబ్ద రూపమున వసించి యున్న దైవమునందు బుద్ధిని నిలిపి దైనందిన కార్య క్రమములను యథాలాపముగ నిర్వర్తించువాడు కూడ సన్న్యాసియే. అనన్య మననము వలననే జీవుడు బ్రహ్మమును పొందగలడు. “దైవమే నేనుగ నున్నానని” చేయవలెను. అదియే "సో హం” అను మంత్రము. 'సహ' అనగ అతడు. 'అహం' అనగ నేను. “ 🍀

6. సన్న్యాసస్తు మహాబాహో దుఃఖ మాప్తు మయోగతః |
యోగయుక్త ముని ధృహ్మ న చిరేణాధిగచ్ఛతి |


గొప్ప బాహువులుగల ఓ అర్జునా! కర్మ సన్న్యాసము కర్మ యోగము లేకుండ పొందుట దుఃఖము కలిగించును. కర్మ యోగముతో కూడిన మననశీలుడు శీఘ్రముగ బ్రహ్మమును చేరుచున్నాడు.

నిజమగు సన్న్యాసులు సతతము దైవస్మరణము చేయుచు నుందురు. వారి ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలయందు దివ్యస్మరణమే సాగుచునుండును. ట్టివారు దేహమునకు ప్రాధాన్యమీయక దైవమే ప్రధానముగ, ఆధారముగ మననము చేయుచు మునివలె జీవించుచుందురు.

వారి సంస్కారమున ప్రాపంచిక ఆకర్షణలు జారిపోవుటచే వారు కేవలము దైవస్మరణ చేయుచు, దొరికినది భుజించుచు, నిదురవచ్చినపుడు నేలపై నిద్రించుచు, నదీ తటాకముల స్నానములు గావించుచు, గృహములందు కాక ప్రకృతి యందే జీవించుచు నుందురు. ప్రపంచమున సన్న్యసించి జీవించుట సులభము కాదు.

దేహభ్రాంతి, దేహావసరములు లేనివారే అట్లు జీవింతురు. అట్టివారు గౌరవింప

దగినవారు. కాని అట్లు జీవించుట కష్టము అని దైవము తెలుపుచున్నాడు. కష్ట మనగ అసాధ్యమని కాదు. కాని అది సాధ్యపడినవారు కొందరే యుందురు.

కష్టతరమగు ఆ మార్గముకన్న ముందు తెలుపబడిన కర్మ జ్ఞాన యోగముల ద్వారా శీఘ్రముగ దైవమును చేరవచ్చునని దైవమే తెలుపుచున్నాడు. బుద్ధియోగముతో కర్తవ్యములను నిర్వర్తించుచు దివ్యస్మరణ యందుండుట మేలని తెలుపు చున్నాడు.

అనగా శ్వాసయందు స్మరణ సాగుచుండగ, కర్తవ్యము లన్నిటిని ఉదాసీన తతో నిర్వర్తించుచు నుండుట. చిత్తము శివుని పైన, చేతులు ప్రపంచములో నుంచుట కూడ సన్న్యాసమే అని కృష్ణుని మతము. వశిష్టాది. బ్రహ్మర్షులు అట్లాచరించినవారే. జనకాది రాజర్షులు కూడ అట్లాచరించిన వారే. సన్న్యాస మనగ సమ్యక్ న్యాసము.

అనగ ఒడుదొడుకులు లేని స్మరణ, హృదయమందు “సో హం' శబ్ద రూపమున వసించి యున్న దైవమునందు బుద్ధిని నిలిపి దైనందిన కార్య క్రమములను యథాలాపముగ నిర్వర్తించువాడు కూడ సన్న్యాసియే. సరళమగు మార్గముండగ దుఃఖపూరితమగు మార్గమేల?

జీవులలోని రజస్తమస్సులు వారి నెప్పుడును ప్రపంచములోనికి నెట్టుచునే యుండును. లభించినది భుజించుట, ఏ ప్రదేశమున నైనను నిద్రించ గలుగుట, ఎప్పుడును హృదయమున స్మరణయందే యుండుట, దేహాభిమానము లేకుండుట, దేహియైన జీవునకు దుఃఖకరము.

దేహముతో పని చేయించుచు, బుద్ధితో దైవస్మరణ యందుండుట సులభము. ఇట్లుండువారు దేహముతో చేయు పనుల ద్వారా ప్రపంచమున చిక్కుపడియుండక యుండుటకు కర్మజ్ఞాన రహస్యములను తెలిపినాడు.

ఇచ్చటొక ముఖ్య సూత్రమున్నది. బుద్ధియోగమున చేరి, కర్మ జ్ఞాన యోగ సూత్రముల సహాయముతో చిక్కుపడక యుండుట మాత్రమే పరమావధి కాదని, మననము జరుగవలెనని దైవము బోధించు చున్నాడు.

అనన్య మననము వలననే జీవుడు బ్రహ్మమును పొందగలడు. మననము ఎట్లు చేయవలెను ? “దైవమే నేనుగ నున్నానని” చేయవలెను. అదియే "సో హం” అను మంత్రము. 'సహ' అనగ అతడు. 'అహం' అనగ నేను. “అతడే నేను” అని హృదయము ఘోషించుచున్నది. దానియందు స్థిరపడుట సన్న్యాసము. అట్లు నిరంతరము న్యాసపూర్వక మననము ఎవని యందు జరుగునో అతడే ముని. అతడు బ్రహ్మమును అచిరకాలమున చేరగలడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2021

No comments:

Post a Comment