✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 90 🌻
అంటే, ముందు విచారణ. తదుపరి ఆలోచన. తదుపరి ఆచరణ, ఆ తదుపరి ఫలము. ఇలా ఉండాలి ఎప్పుడూ కూడ. కానీ, ఎప్పుడైతే మనో వేగానికి లోనవుతావో, ఎప్పుడైతే భ్రాంతికి లొంగుతావో, ఎప్పుడైతే భ్రమాజన్యమైనటువంటి అజ్ఞానానికి లొంగుతావో, అప్పుడు ఏమౌతామంటే, ముందు ఆచరణ, తదుపరి ఆలోచన, ఆ తదుపరి విచారణ. వ్యతిరేకమైపోతుంది. అప్పుడు ఎంత ప్రయత్నించినా దీనిని జ్ఞాన స్థాయికి తీసుకొని వెళ్ళలేము.
కాబట్టి, ఒక నిర్ణయము తీసుకునే ముందే, ఒక ఆలోచనని చేసే ముందే, ఒక ఆకాంక్షని అమలు పరిచేముందే, విచారణ చేయి. వస్తువును ఆశ్రయిస్తుందా? అసత్తును ఆశ్రయించిం ఉందా? బ్రహత్వానికి చేరుస్తోందా? ప్రపంచానికి చేరుస్తోందా? పంచీకరించబడినదంతా... నానాత్వముగా ఉన్నటువంటి, అనేకత్వముతో ఉన్నటువంటిది కదా! మరది మిథ్యాభూతము కదా! అది లేనిది కదా! మరి అటువంటి లేని దానిని నేను ఆశ్రయించడం సమంజసం కాదు కదా! అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహనను కలిగియుండాలి.
ఈ రీత్యానే మనం ధర్మశాస్త్రాలన్ని, మానవులకు ఏయే సమయాలలో ఎలా జీవించాలి అనేటటువంటి దానిని నిర్ణయంజేశాయి. బ్రహ్మచారి తప్పక బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావల్సిన విద్యను సంగ్రహించాలి. ఇప్పుడు ఆ బ్రహ్మచర్య ఆశ్రమము కాస్తా పోయింది. ఇప్పుడు ఏం చేశాడు? బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి బదులుగా, ముక్తివిద్యను సాధించడానికి బదులుగా, భుక్తి విద్యయందు మునిగిపోయాడు.
తర్వాత ఏమైపోయింది? పాతికేళ్ళు అయిపోయింది. అయిపోయినప్పటికి ఏమైపోయింది? బ్రహ్మజ్ఞానం రాలేదు. ఇంకేం చేస్తాం బాబోయ్? ఇప్పటికే లేట్ అయిపోయింది, వివాహం చేసేయండి, వివాహం చేసేయండి. బ్రహ్మజ్ఞానం లేకుండా ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, అవసరార్థం చేసుకున్నదే కదా అది.
అట్టి అవసరార్థం చేయబడినటువంటి వివాహం వలన జీవితం అంతా, దేనిని తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు అంటే, అట్టి అవసరార్థమైనవి తీర్చుకునే పనిలోనే ఉంటాడు. అప్పటికికప్పుడు ఆ అవసరం వస్తూఉంటుంది. ఆయా అవసరాల చేత కొట్టుకుని పోతూ ఉంటాడు.
ఆ కొట్టుకు పోయినటువంటి ప్రవాహ వేగంలో, జీవితం క్షణభంగురంగా అయిపోతుంది. చేసి ఇక అంతా చేసి కళ్ళు తెరిచి చూసే సరికి, పిల్లలు సంసారం అన్నీ ఏర్పడుతాయి. ఆహా ఇల్లు ఏర్పరచుకున్నాను, ఆహా భార్యను ఏర్పరచుకున్నాను, ఆహా పిల్లలను ఏర్పరచుకున్నాను, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు.
ఆహా! ఇల్లు బాగుంది. ఆహా పిల్లలు బాగున్నారు, ఆహా భార్య బాగుంది, ఆహా సంసారం బాగుంది. వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నాను అనేటటువంటి సాపేక్ష పద్ధతిగా వస్తూపలబ్ధి చేత, నేను ఇంత బంగారం కొన్నాను. నేను ఇన్ని వస్తువులు కొన్నాను, నేను ఇంత విలువైన వస్తువులు కొన్నాను, నేను అంత విలువైన వస్తువులు కొన్నాను.
నేను ఇంత విలువైనటువంటి వాటిని దాచకున్నాను. నేను ఇంత విలువైనటువంటి వాటిని వ్యయం చేశాను. నేను ఇన్ని దేశాలు తిరిగాను. నేను ఇంత గొప్ప కులంలో పుట్టాను. నేను ఇంత గొప్ప క్షేత్రంలో పుట్టాను. నేను ఇంత వంశ వారసత్వాన్ని కలిగియున్నాను. నేను ఇంత కులగోత్రాలు కలిగియున్నాను.
నేను ఇంత ఉత్తమమైన మతంలో పుట్టాను లేదా ఉత్తమమైన ధర్మంలో పుట్టాను లేదా ఉత్తమమైనటువంటి అపేక్షలో పుట్టాను లేదా విలువైన రత్నాది ఆభరణాలను సంగ్రహించాను. ఈ రకంగా తనను తాను ఉద్గడింప చేసుకొనేటటుంవంటి అనాత్మ వస్తూపలబ్ధిని ఆశ్రయించి, తన గురించి తాను చెబుతూఉంటాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jan 2021
No comments:
Post a Comment