శ్రీ శివ మహా పురాణము - 322


🌹 . శ్రీ శివ మహా పురాణము - 322 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

81. అధ్యాయము - 36

🌻. విష్ణు వీర భద్ర సంవాదము - 2 🌻


లోకపాలకులిట్లు పలికిరి -

హే గురో! బృహస్పతీ! నీవు గొప్ప బుద్ధిశాలివి. కరుణా మయుడవు. మా ప్రశ్నకు తొందరగా సమాధానము నిమ్ము. మాకు జయము లభించు ఉపాయమేది? (18).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటను వివిన బృహస్పతి ప్రయత్న పూర్వకముగా శంభుని స్మరించి, ఆజ్ఞాని యగు మహేంద్రునితో నిట్లనెను (19).

బృహస్పతి ఇట్లు పలికెను -

పూర్వము విష్ణువు చెప్పిన దంతయూ ఇపుడు మన ఎదుట జరుగుచున్నది. ఓ ఇంద్రా ! ఆ వివరములను చెప్పెదను, సావధానముగా వినుము (20). ఓయీ! కర్మలన్నిటికీ ఫలము నిచ్చు ఈశ్వరుడొకడు గలడు. ఆయన కూడ ఫలము నిచ్చుటలో కర్త యొక్క కర్మలపై ఆధారపడును. కర్మలేని సందర్భములో ఈశ్వరుడైననూ ఫలము నీయలేడు (21).

సర్వమంత్రములు, ఓషధులు, అభిచార కర్మలు, లౌకిక కర్మలు, వేదోక్త కర్మలు, వేదములు, పూర్వోత్తర మీమాంసలు (22), ఇతర శాస్త్రములు, మరియు నాల్గు వేదములు కూడా ఈశ్వరుని తెలుపలేవని పూర్వర్షులు చెప్పిరి (23). వేదములనన్నిటినీ పదివేలసార్లు పారాయణము చేసిననూ మహేశ్వరుడు జీవునకు సాక్షాత్కరించడు. నీవే తప్ప మరియొక గతి లేదు. అని శరణు పొందిన భక్తులకు ఆయన దర్శనమిచ్చును. మరియొక మార్గము లేదని వేదము చెప్పు వచనము గొప్ప వచనము (24).

సదాశివుని అనుగ్రహముచే శాంతము, సర్వశ్రేష్ఠము, సర్వవికార నిర్ముక్తము అగు దృష్టి లభించును. ఆ దృష్టి చేత మాత్రమే సదా శివుడు నిశ్చయముగా తెలియబడును (25). కాని, ఓ ఇంద్రా ! ఏది చేయదగిన పని, ఏది కాదు అను విషయమును చెప్పెదను. ఇది కార్యసిద్ధికి ఆవశ్యకమగు అంశము. నీవు స్వీయహితమును గోరి వినుము (6). ఓ ఇంద్రా!నీవు మూర్ఖుడవై ఈనాడు లోకపాలకులతో గూడి దక్షుని యజ్ఞమునకు విచ్చేసితివి. ఇచట ఏమి పరాక్రమమును చూపగలవు? (27).

రుద్రుని సేవకులగు ఈ గణములు గొప్ప కోపము గలవారు. యజ్ఞమును పాడుచేయుటకై వచ్చినారు. ఆపనిని చేయుదురనుటలో సందేహము లేదు (28). సత్యమును విచారించి చెప్పుచున్నాను. ఈయజ్ఞమును రక్షించే ఉపాయము లేనే లేదు. ఈ యజ్ఞమునకు వచ్చిన విఘ్నమును తొలగించ గల సమర్థత ఎవ్వరికీ లేదు. నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (29).

బ్రహ్మ ఇట్లు పలికెను -

బృహస్పతి యొక్క ఈ మాటలను విని ఆ దేవతలు అందరు, లోకపాలకులు, ఇంద్రుడు చింతాగ్రస్తులైరి (30). అపుడు మహావీరులగు గణములతో కూడియున్న వీరభద్రుడు మనస్సులో శంకరుని స్మరించి ఇంద్రుడు మొదలగు లోకపాలకులతో నిట్లునెను (31).

వీరభద్రుడిట్లు పలికెను -

మీరందరు మూర్ఖులగుటచే యజ్ఞ భాగముల కొరకు వచ్చి యున్నారు. నేను యజ్ఞ భాగములనిచ్చెదను. నా వద్దకు రండు (32).

హే శుక్రా! హే అగ్నీ! హేసూర్యా! ఓయీ చంద్రా! ఓయీ కబేరా! ఓయీ వరుణా! ఓయీ వాయూ! ఓయీ నిర్‌ ఋతీ! ఓయీ యమా! ఓయీ శేషా! (33)ఓదేవగణములారా! ఓ రాక్షస గణములారా! ఓ విద్వాంసులారా! మీరిక్కడకు రండు. మీకు తృప్తి కలుగు వరకు యజ్ఞ భాగములనిచ్చెదను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు (34).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2021

No comments:

Post a Comment