ఏకత్వమే జ్ఞానస్థితి


🌹. ఏకత్వమే జ్ఞానస్థితి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


‘‘మీకు తెలియదు తాతయ్యా ‘‘టైమ్ ఈజ్ కిల్లింగ్ యు.’’ ఒకవేళ మీరన్నదే నిజమైతే ‘‘మీరు చంపుతున్న ఆ కాలాన్ని తీసుకొచ్చి నాకు చూపించండి’’ అన్నాను ఆయనతో.

‘‘కాలం కరిగిపోతోంది, వెళ్ళిపోతోంది’’లాంటి వ్యక్తీకరణలన్నీ కేవలం ఒక రకమైన ఓదార్పు మాత్రమే. బతికున్నంత వరకు కాలం వెళ్ళిపోతున్నట్లుగా భావించే మనిషి మరణిస్తున్నప్పుడు మాత్రం తాను వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తాడు.

నిజానికి, ప్రతి క్షణం, మీ జీవితకాలాన్ని పోగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నది మీరే. కానీ, మీరే ఇక్కడ స్థిరంగా ఉంటున్నట్లు, కాలమే వెళ్ళిపోతున్నట్లు భావిస్తున్నారు. నిజానికి, కాలం స్థిరంగానే ఉంది. దానిని లెక్కించేందుకు మనిషి సృష్టించిన గడియారాలు కూడా ఇక్కడ స్థిరంగానే ఉన్నాయి.

మీరెప్పుడైనా భారతదేశంలోని పంజాబ్‌కు వెళ్తే, అక్కడ మీరు ఎవరినీ ‘‘టైమెంతైంది?’’ అని అడగకండి. ఎందుకంటే, ఒకవేళ అప్పుడు సమయం 12 గంటలైతే వాళ్ళు మిమ్మల్ని చితకబాదుతారు. అందుకు వేదాంత పరమైన కారణముంది. ఒకవేళ మీరు వారి బారినుంచి బతికి బయట పడితే ఏదో అద్భుతం జరిగినట్లే, మీరు అదృష్టవంతులైనట్లే. వేదాంత తత్వం మూర్ఖుల చేతుల్లో పడితే అలాగే జరుగుతుంది.

జ్ఞానోదయ, సమాధి స్థితుల గురించి, మరణిస్తున్న మనిషి మానసిక స్థితి గురించి సిక్కు మత స్థాపకుడైన ‘‘గురునానక్’’ వివరిస్తూ ‘‘12 గంటల సమయంలో గడియారంలోని రెండుముళ్ళు ఒకటైనట్లుగా, సమాధి స్థితిలోను, మరణిస్తున్నప్పుడు మీలోని ద్వంద్వం నశించి మీరు ఏకత్వాన్ని పొంది అస్తిత్వంలో లీనమవుతారు’’ అన్నారు. అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అయినా, అప్పటినుంచి ‘‘12 గంటల సమయం’’ పంజాబ్‌లో మృత్యు సంకేతంగా పరిగణించబడుతోంది.

అందుకే ఆ సమయంలో మీరు సర్ధార్జీని ‘‘టైమెంతైంది?’’ అని అడిగితే, ‘‘అతను చావాలని మీరు శపిస్తున్నట్లుగా భావించిన’’ అతడు వెంటనే మిమ్మల్ని చితకబాదుతాడు. ఎవరైనా ఏడుపు ముఖంతో దయనీయంగా కనిపిస్తే ‘వాడకి పన్నెండయ్యింది’ అనడం పంజాబ్‌లో ఒక అలవాటుగా మారింది.

ఎందుకంటే, గడియారంలోని రెండు ముల్లులు కలుసుకోవడం విపరీతమైన దుఃఖాలకు, అనేక మానసిక వేదనలకు కారణమే కాక, అది మృత్యువుతో సమానమని వారు భావిస్తారు. అందువల్ల ‘‘పనె్నండు గంటల సమయం’’ దగ్గర పడుతుంటే సర్ధార్జీలందరూ గబగబా వారి గడియారంలోని సమయాన్ని ‘‘పన్నెండు గంటల ఐదు నిముషాలకు’’ మార్చడం నేను చాలాసార్లు చూశాను. అంతేకానీ, గురునానక్ వివరించిన జ్ఞానోదయ, సమాధి స్థితుల గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే, ఆ విషయాన్ని వారు పూర్తిగా మరచిపోయారు.

మనిషి మరణిస్తున్నప్పుడు- అతనికి సమయంపన్నెండు ఆయినప్పుడు- గడచిన జీవితాన్నే పట్టుకుని వేలాడతాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండకపోగా, భరించలేని బాధ అతనిని చుట్టుముట్టడంతో, అతడు అపస్మారక స్థితి (కోమా)లోకి వెళ్ళి, గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోతాడు.

అతడు గత జీవితాన్ని ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేదు. ఒకవేళ ఎలాంటి కోరికలు లేకుండా, దేనికీ పట్టుకుని వేలాడకుండా జీవిస్తున్న సమయంలో మరణం ఆసన్నమైతే, మిమ్మల్ని బలవంతంగా అపస్మారక స్థితి (కోమా)లోకి నెట్టే అవసరం ప్రకృతికి ఉండదు కాబట్టి, మీరు పూర్తి ఎరుకతో సచేతనంగా మరణిస్తారు.

అప్పుడు గతంలో మీరు చేసిన వెధవ పనులన్నీ మీకు గుర్తొస్తాయి. కొన్ని కోరికలు తీరినా, తీరని కోరికలు తీర్చుకున్నా ఇంకా కొన్ని కోరికలు మిగిలే ఉంటాయి. అదొక వింత ఆట. ఆ ఆటలో మీరు ఎప్పుడూ కోల్పోవడమే జరుగుతుంది. ఆ ఆటలో మీరు నెగ్గినా, ఓడినా పెద్ద తేడా ఏమీ ఉండదు.

మీ ఆనందాలన్నీ నీటి కెరటాలపైన, మీ బాధలన్నీ రాతి పలకలపైన రాసిన రాతలు మాత్రమే.

అందుకు మీరు అనేక బాధలు పడ్డారు. కేవలం చిన్న చిన్న ఆనందాల కోసం మీ మొత్తం జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ, పూర్తి ఎరుకతో సచేతనంగా మరణించే అత్యున్నత స్థితిలో మీరు మీ జీవితాన్ని పరికిస్తున్నప్పుడు అవి మీకు చిన్న చిన్న ఆటబొమ్మలుగా కనిపిస్తాయి.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021

No comments:

Post a Comment