✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 24
🍀. 22. బ్రహ్మ నిర్వాణము - అంతరంగమున బ్రహ్మము వసించి యున్నది. అది ఆధారముగ చైతన్యము, చైతన్యము ఆధారముగ త్రిగుణములు (త్రిశక్తులు), వాని నాధారము చేసుకొని పంచభూతములు ఏర్పడి యున్నవి. ఇట్లు పది అంశములతో కూడిన స్థూల సూక్ష్మములగు ఏడు పొరలతో ఏర్పడిన రూపమున జీవుడున్నాడు. అందువలననే అతడు దశరథుడు అని, సప్తపర్ణ అని సంబోధింప బడుచున్నాడు. యోగి అంతర్ముఖుడై అంతరంగము నందలి వెలుగుతో రమించుచు, అంతఃసుఖమును పొందుచు, ఆత్మజ్యోతియై ప్రకాశించుచు నుండును. అతడు బ్రహ్మ స్వరూపుడై బ్రహ్మము నందు నిర్వాణము చెందుచున్నాడు. బ్రహ్మమునందు యుక్తము చెందుట యోగమగును. తొమ్మిది ఆవరణలు దాటి పదియవ అంశమగు బ్రహ్మముతో భావపరమగు యోగము చెందుట ప్రధానము. అపుడు చైతన్యము పరిపూర్ణమై వెలుగును. 🍀
యోఽoతః సుఖోఽoతరారామః తథాంతర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ।। 24 ।।
యోగి అంతర్ముఖుడై అంతరంగము నందలి వెలుగుతో రమించుచు, అంతఃసుఖమును పొందుచు, ఆత్మజ్యోతియై ప్రకాశించుచు నుండును. అతడు బ్రహ్మ స్వరూపుడై బ్రహ్మము నందు నిర్వాణము చెందుచున్నాడు.
అంతరంగమున బ్రహ్మము వసించి యున్నది. అది ఆధారముగ చైతన్యము, చైతన్యము ఆధారముగ త్రిగుణములు (త్రిశక్తులు), వాని నాధారము చేసుకొని పంచభూతములు ఏర్పడి యున్నవి. ఇట్లు పది అంశములతో కూడిన స్థూల సూక్ష్మములగు ఏడు పొరలతో ఏర్పడిన రూపమున జీవుడున్నాడు. అందువలననే అతడు దశరథుడు అని, సప్తపర్ణ అని సంబోధింప బడుచున్నాడు.
ఈ మొత్తమునకు మూలము బ్రహ్మమే గదా! అట్టి బ్రహ్మమునందు యుక్తము చెందుట యోగమగును. తొమ్మిది ఆవరణలు దాటి పదియవ అంశమగు బ్రహ్మముతో భావపరమగు యోగము చెందుట ప్రధానము. అపుడు చైతన్యము పరిపూర్ణమై వెలుగును.
గుణములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు, పంచాంగములు అట్టి చైతన్యమునకు లోబడి యుండును. పై విధముగ భావన చెందినపుడు అంతరంగమున తన జ్యోతిస్వరూపము గోచరించును.
ఆ స్వరూపమునకు మూలమైన తత్త్వము అందలి సూక్ష్మ స్పందన బిందువుగ గోచరించును. అదియే పరమాత్మ స్థానము. దానియందు రమించుచున్న యోగికి, బుద్ధి మనో యింద్రియముల కతీతముగ సుఖము లభించు చుండును.
ఆ బిందు స్థానమున లగ్నమైన చైతన్యము కలవాడగుటచే అచ్చటి బ్రహ్మము యొక్క సాన్నిధ్యమును పొందును. క్రమముగ బ్రహ్మమే యగును. తానుండక బ్రహ్మ ముండును.
తాను బ్రహ్మమునందు నిర్వాణము చెందును. ఇట్లు యోగి అంతర్ముఖుడై బ్రహ్మ సాయుజ్యమును పొందగలడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Feb 2021
No comments:
Post a Comment