శ్రీ శివ మహా పురాణము - 340
🌹 . శ్రీ శివ మహా పురాణము - 340 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
86. అధ్యాయము - 41
🌻. దేవతలు శివుని స్తుతించుట -1 🌻
విష్ణువు మొదలగు దేవతలు ఇట్లు పలికిరి -
దేవదేవా! మహాదేవా! హే ప్రభో! నీవు పరబ్రహ్మ అగు శంభుడవని నీ కృపచే ఎరుంగుదుము (1). తండ్రీ! పరమేశ్వరా! మానవులను మోహింపచేయునది, తెలియ శక్యము కానిది, సర్వోత్కృష్టమైనది అగు నీ మాయచే మమ్ములను ఏల మోహింపజేయుచున్నావు? (2) జగత్తునకు యోని అగు ప్రకృతి కంటె, బీజమగు పురుషుని కంటె ఉత్కృష్టము అగు పరబ్రహ్మ నీవు. నీవు మనస్సునకు, వాక్కునకు అందవు (3). నీవు స్వేచ్ఛచే నీ స్వరూపమైన శివ శక్తిని వశము చేసుకొని, సాలెపురుగు గూటిని వలె, ఈ జగత్తును సృష్టించి పాలించి లయము చేయుచున్నావు. ఇది నీలీల (4).
ఓ ఈశ్వరా! దయానిధివగు నీవే యజ్ఞమును సృష్టించితివి. ఋగ్యజుస్సామ రూపము అగు వేదమును లోకములో ప్రవర్తింపజేయుటకై సృష్టింపబడిన ఆ యజ్ఞమును దక్షిణయను సూత్రముతో దృఢము చేసితివి (5). స్వీకరింపబడిన వ్రతము గలవారు, వేదమార్గములో నిష్ణీతులునగు వేతవేత్తలు లోకమునందు నీ చేతనే నిర్మింపబడిన శుద్ధములగు ధార్మిక నిలయములను శ్రద్ధతో ఆచరించుచున్నారు (6). మంగలములను గాని, అమంగళ కర్మలను గాని ఆచరించువారికి నీవు స్వపర భేదము లేకుండగా హితకరములగు ఫలములను, అహిత ఫలములను, మరియు మిశ్రమ ఫలములను కర్మానురూపముగా ఇచ్చెదవు (7). ప్రాణులకు కర్మ ఫలముల నన్నిటినీ ఇచ్చే దాతవు నీవే. సర్వమానవులు చేయు కీర్తి గానములన్నియు ఆయా వ్యక్తులకు గాక నీకు మాత్రమే చెందునని వేదములు ఉద్ఘాటించుచున్నవి (8).
వేర్పాటు బుధ్ధి గలవారు, దుర్బుద్ధి గలవారు, అసూయతో నిండినవారు, ఇతరుల మనస్సును గాయపరచువారు, కేవల కర్మఠులు అగు మూర్ఖులు పరుష వచనములతో ఇతరులను బాధించెదరు (9). హే విభో! అట్టిదైవద్రోహుల ఆగడములు మితిమీరినపుడు వారిని సంహరించవలసినదే. కాని హేభగవాన్ ! పరమేశ్వరా!పరమాత్మా! ప్రభూ! దయను చూపుము (10). శాంతుడు, పరబ్రహ్మ, పరమాత్మ, జటాజూటధారి, మహేశ్వరుడు, మహాజ్యోతి స్స్వరూపుడునగు రుద్రునకు నమస్కారము (11).
జగత్తును సృష్టించు ప్రజాపతులను నీవే సృజించితివి. సృష్టికర్తవు నీవే. సృష్టికర్తకు తండ్రివి నీవే. త్రిగుణ స్వరూపుడవు నీవే. నిర్గుణుడవు నీవే. నీవు ప్రకృతికంటె పురుషుని కంటె ఉత్కృష్టమైనవాడవు (12). నల్లని కంఠము గలవాడు, జగత్సృష్టి కర్త, పరమాత్మ, జగత్స్వరూపుడు, జగత్తునకు బీజమైనవాడు, జగత్తునకు ఆనందమును కలిగించువాడు అగు నీ కొరకు నమస్కారము (13).
ఓం వషట్, హంత, స్వధా అను యజ్ఞోపయోగి వేదశబ్దములు నీ స్వరూపమే. సర్వక్రతువులను ప్రవర్తిల్ల జేయువాడువు నీవే. హవ్యము (దేవతలకు అర్పింపబడిన అన్నము) ను, కవ్యము (పితురుల కర్పింపబడిన అన్నము) ను భుజించునది నీవే (14). ధర్మపరాయణుడవగు నీవు యజ్ఞమును ఎట్లు భంగపరచ గల్గితివి ? ఓ మహాదేవా!వేదస్వరూపుడవు నీవు యజ్ఞమును ఎట్లు ధ్వంసమొనర్చితివి? హే విభో! (15) బ్రాహ్మణులను గోవులను, మరియు ధర్మమును రక్షించునది నీవే. హే ప్రభో !సత్స్వరూపుడు, అనంతుడు అగు నీవు సర్వప్రాణులకు శరణు పొంద దగినవాడవు (16).
హే భగవాన్! రుద్రా! సూర్యుని కంటె అధికమగు తేజస్సు గలవాడు జగద్రూపుడు, ప్రకాశ స్వరూపుడు, జలములలోని రసతన్మాత్ర స్వరూపుడు నగు నీ కొరకు నమస్కారము (17).
గంధము నిత్యగుణముగా గల పృథివి స్వరూపమైన శర్వునకు నమస్కారము. మహాతేజశ్శాలి, అగ్ని స్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము (18). హే ఈశా! స్పర్శ గుణము గల వాయువు నీ స్వరూపము. నీకు అనేక నమస్కారములు. సర్వప్రాణులకు ప్రభువు, యజమాన స్వరూపుడు, సృష్టికర్త అగు నీకు నమస్కారము (19). శబ్ద గుణకమగు ఆకాశము స్వరూపముగా గల భీమునకు నమస్కారము. ఉమాదేవితో గూడి జగత్తును రక్షించే మహాదేవుడవగు నీకు నమస్కారము (20).
భయంకరమైనవాడు, సూర్య రూపుడు, కర్మయోగి అగు నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువు అగు నీకు నమస్కారము. హే రుద్రా! నీకోపమునకు నమస్కారము (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment