గీతోపనిషత్తు - 63

🌹. గీతోపనిషత్తు - 63 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



🍀 24. అగ్నికార్యము -సృష్టియంతయు ఒక అగ్నికార్యము. అగ్నికార్యమున పొగ, మసి తప్పవు. వాటిని నిత్యము శుభ్రపరచు కొనవలెను. లేనిచో మసి తప్పదు. మసికి మరొక పేరే పాపము. కావున దైవధ్యానము, ఆరాధనము అను నిత్యము చేసుకొనుచు జీవించుట శరణ్యమని దైవము తెలిపెను. 🍀


📚. కర్మయోగము
📚


సామాన్య మానవుడు కావలెనని పాపము చేయడు. కాని స్వభావము బలముగ ఆకర్షించి అతనిచే పాపములను నిర్వర్తించు చుండును. పాపము చేయుచుంటిని అని తెలిసియు అందుండి బయట పడలేడు. దీనికి కారణమేమి? అని అర్జునుడు ప్రశ్నించినాడు.

నిజమునకు భగవంతుడు సమాధానము యిచ్చియే యున్నాడు. తెలిపినను మరచుట మానవ సహజము. మరల తెలుపుట ఉపాధ్యాయుల ధర్మము. సద్గురువు ధర్మము. గుణములు గుణములతో ప్రవర్తించుననియు, ప్రకృతి గుణములచే మోహపడుట సహజమనియు, జ్ఞానులు సైతము గుణాకర్షణము కారణముగ నిగ్రహమును కోల్పోవుదురనియు తెలిపి యున్నాడు. మరల ప్రశ్నించుటచే భగవంతు డిట్లనుచున్నాడు.

గుణములలో మొదటిది రజస్సు. అది యిచ్ఛను కలిగించును. ఆకర్షణను కలిగించును. కోరిక కలిగించును. దీని మరియొక నామమే కామము. కామమును విచక్షణతో నిర్వర్తించు కొనవలెను. విచక్షణకు బుద్ధి యాధారము. మనుష్యుని బుద్ధి కర్మాధీనమై యుండును. కావున అది అక్కరకు రాదు. అందు వలన దైవము బుద్ధి తనయందు స్థిరపడవలెను. దానికి దైవమే శరణ్యము. సరియగు దైవారాధనము మనయందలి దైవబుద్ధి కేంద్రమును మేల్కొల్పును. అది ధర్మమునకై మొగ్గి యుండును. అపుడాకర్షణలు పనిచేయవు.

కావున దైవారాధనమునకు ఫలశ్రుతి బుద్ధి ప్రచోదనము. బుద్ధియందు స్థిరపడినవాడు పూర్ణ విచక్షణ దైవానుగ్రహముగ పొందియుండును. అపుడు రజోగుణ మతనిని స్పృశింపదు. కామము ధర్మయుక్తమై వర్తింపబడుచుండును. మనసు, యింద్రియములు బుద్ధియందు సంయమము చెందగ, బుద్ధి దైవముతో అనుసంధానము చెందుటచే గుణాతీతుడై గుణముల యందు ప్రవర్తించుట జరుగును.

ఇట్లు బుద్ధియందు స్థిరపడుటకు బుద్ధి ప్రచోదనమునకై దైవారాధనమును ప్రతినిత్యము నిర్వర్తించవలెను. అనునిత్యము సాగవలెను. అద్దమును ప్రతినిత్యము శుభ్రపరచుకొననిచో దాని పై దుమ్ము చేరును గదా. దీపము వెలిగించినచో కొండె ఏర్పడుచున్నది గదా. అన్నము వండినచో పాత్రకు మసి యగుచున్నది గదా. దంతధావనము, స్నానము చేసినను మరునాటికి శరీరము మలినములను కలిగి యుండును కదా.

సృష్టియంతయు ఒక అగ్నికార్యము. అగ్నికార్యమున పొగ, మసి తప్పవు. వాటిని నిత్యము శుభ్రపరచుకొనవలెను. లేనిచో మసి తప్పదు. మసికి మరొక పేరే పాపము. కావున దైవధ్యానము, ఆరాధనము అను నిత్యము చేసుకొనుచు జీవించుట శరణ్యమని దైవము తెలిపెను. జ్ఞానులకైనను మరియొక మార్గము లేదని తెలిపెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


29 Oct 2020

No comments:

Post a Comment