🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 147 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 21 🌻
150. దేవతలని సంతోషపెడతామని కొందరంటూంటారు. దేవతలు మంత్ర స్వరూపులు, వారికి వేరే కరచరణాదులు అవీ ఉండవు. అవయవాలు, కిరీటాలు ఇవన్నీ మనం కల్పించుకుంటాం. ఈ దేవతల్కు నిజస్వరూపంలేదు. మరి ఎందుకు వీళ్ళను పూజించడము అంటే, వాళ్ళరూపాలు, వాళ్ళశరీరాలు అన్నీ మంత్రాలే! అంటే మంత్రశరీరులు వాళ్ళు.
151. ఇంద్రుడు, వరుణ్డు, ప్రజాపతి, అగ్ని, వాయువు ఎవరు వీళ్ళంతా? పరమేశ్వరుడియొక్క సృష్టి అంతా, ఆయన శరీరమే! మన శరీరంలో ఎలాగయితే కన్ను, ముక్కు, చెవి, వెంట్రుకలు, శిఖ, గోళ్ళు ఇలాంటి అవయవాలన్నీ ఆయా పనులు చేయటానికి ఉన్నాయో; అలాగే, పరమేశ్వర్సృష్టిలో కూడా, ఈ సృష్టిరచనంతా చేసిన తర్వాత దానిని నడిపించటానికై ఆయన అవయవాలుగా ఈ శక్తులు ఏర్పడ్డాయి.
152. ‘పాదౌ పూజయామి, హస్తౌ పూజయామి, ఊరూపూజయామి, జంఘే పూజయామి, జానునీ పూజయామి…’ ఇవన్నీ అంటూ ఉంటాం కదా! దానినే వేదం మంత్ర స్వరూపంలో, ఆహుతుల రూపంలో అనేక కరచరణాది అవయవాలకు – ఈశ్వరుడికి ఉన్నటువంటివాటన్నిటికీ – అంగపూజ చేస్తుంది. ఒకే పరమేశ్వరుడి యొక్క అంగములను (అంటే దేవతలను) ఆరాధించటమనే కార్యంలో నిమగ్నమై, మనం అసలు పరమేశ్వరుడుని మరిచిపోకూడాదు. అదీ ఇక్కడ ఉద్భోధం. అదీ నారదుడి బోధలోని అంతరార్థం.
153. వేదవేదాంగములన్నీ నేర్చుకుని, యజ్ఞములు చేసికూడా పరమార్థం తెలియకపోతే నష్టపోతారు. అందుకని, ఈ దెవతలున్నారు అంటే అర్థం ఏమిటి? ముప్పయి మూడుకోట్ల ఈశ్వరలక్షణములున్నాయి. అవన్నీ సృష్టిలో వ్యాపించి ఉన్నాయి. ఈశ్వరలక్షణాలు అనంతకోటి. వాటినే దేవతలంటాము.
ఉదాహరణకు వాయువు ఉంది. వాయువు అంటే సరిపోయిందా! ఎంతోమంది మరుత్తులున్నారని వేదం చెపుతున్నది.
154. మనం పీల్చుకునేదీ గాలే, తుఫానుగా దేశాన్ని ఊడ్చిపెట్టేదికూడా గాలే. అయితే ఈ రెండూ ఒకటేనా! ఆ వాయువుకు వికారలక్షణం అవీ ఉన్నాయి. విభూతి, అభూతి, సుఖము, దుఃఖము అన్నిటికీ హేతువులుగా అనేక లక్షణాలు, కార్యాలు చేయగలశక్తి ఆ వాయువునందున్నాయి.
155. ఆ వాయువును ఉపాసించినప్పుడు అక్కడ దానికి ఎన్ని లక్షణాలున్నాయో అన్ని మంత్రాలతో, అన్ని పేర్లు పెట్టి వేరే వేరే దేవతలుగా కనబడేటట్లుగా వేదం చూపిస్తుంది. “బహిరంగంలో వ్యష్టి అంతా కలిపి, సమిష్టిగా ఏకస్వరూపంగా ఒక తత్త్వాన్ని అంతఃకరణలో భావనచేయాలి.
156. ఈ వ్యష్టిపూజ అంతా కూడా – ఇన్ని లక్షణములనూ ఆ పరమేశ్వరుని అంగములుగా ఆరాధించి – అలా భావన చేసినవాడికిమాత్రమే హరితత్త్వం బోధపడి, అది ముక్తికి మార్గమవుతుంది. అది అంతదాకా వచ్చి ఆగిపోతే, మీకొచ్చేది ఏమీ లేదు” అని చెప్పాడు నారదుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
29 Oct 2020
No comments:
Post a Comment