శ్రీ శివ మహా పురాణము - 259



🌹 . శ్రీ శివ మహా పురాణము - 259 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

61. అధ్యాయము - 16

🌻.విష్ణువు, బ్రహ్మ శివుని స్తుతించుట - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలు చేసిన ఈ స్తోత్రమును విని సర్వకారణ కారణుడగు శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై మందహాసమును చేసెను (1). బ్రహ్మ, విష్ణువులను భార్యలతో సహా చూచి శివుడు వారిని యథా యోగ్యముగా పలకరించి వారి రాకకు కారణమును అడిగెను (2).

రుద్రుడిట్లు పలికెన -

హే విష్ణో! బ్రహ్మన్‌! దేవతలారా! మునులారా! మీరిపుడు భయమును వీడి మీ రాకకు గల కారణమును సుస్పష్టముగా చెప్పుడు (3). మీరు దేని కొరకు విచ్చేసితిరి? ఇచట మీకు గల పని యేమి? ఈ విషయమునంతనూ నేను వినగోరుచున్నాను. మీ స్తోత్రముచే నా మనస్సు ప్రసన్నమై నది (4).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శివుడు ఇట్లు ప్రశ్నించగా విష్ణువు నన్ను ప్రేరేపించెను. సర్వలోక పితామహుడనగు నేను మహాదేవునితో నిట్లంటిని (5). దేవదేవా!మహాదేవా!కరుణా సముద్రా! ప్రభో! మేము దేవతలతో, ఋషులతో కలిసి ఇచటకు వచ్చుటకు గల కారణము వినుము (6). హే వృషభధ్వజా! మేమిద్దరము ప్రత్యేకించి నీ కొరకు మాత్రమే వచ్చితిమి. మనము ముగ్గురము కలిసి ఉండుట శ్రేష్ఠము. అట్లు గానిచో, ఈ జగత్తు మనజాలదు (7). హే మహేశ్వరా! కొందరు రాక్షసులు నాచే, మరికొందరు విష్ణువుచే, ఇంకొందరు నీచే సంహరింపబడెదరు (8).

ఓ మహాప్రభో! కొందరు నీనుండి జన్మించిన కుమారునిచే వధింపబడెదరు. హే ప్రభో! మరికొందరు రాక్షసులను శక్తి వధించగలదు (9). హే శంభో! నీ కృప చేతనే భయంకరులగు రాక్షసులందరు నశించగా, దేవతలకు ఉత్తమ సుఖము, నిత్యము అభయము, జగత్తునకు స్వస్థత లభించినది (10).

నీవు నిత్యము యోగపరాయణుడవై, రాగ ద్వేషములను విడనాడి, దయాసముద్రుడవు అయినచో వారిని నీవు సంహరించవు (11). హే ఈశ! వారిని ఈ విధముగా అనుగ్రహించినచో, సృష్టి స్థితులు ఎట్లు కొనసాగును? కావున, హే వృషధ్వజా! నీవి నిత్యము జగత్కార్యమునకు సహకరించుటయే యుక్తముగనుండును (12).

మనము సృష్టిస్థితి లయ కర్మలను చేయని నాడు మనకు మాయా ప్రభావముచే లభించిన శరీర భేదము ప్రయోజన రహితమగును (13). మన స్వరూపము ఒక్కటియే అయినా, కార్య భేదముచే మనలో భేదము కలిగినది. ఈ కార్య భేదము సిద్ధించనిచో, రూపభేదము నిష్ప్రయోజనమగును (14). మహేశ్వర పరమాత్ముడొక్కడే ముగ్గురిగా భేదమును పొందినాడు. స్వతంత్రుడగు ఆ ప్రభువు తన మాయాశక్తిచే ఈ లీలను నెరపినాడు (15). ఆయన ఎడమ భాగము నుండి విష్ణువు, కుడి భాగమునుండి నేను, హృదయము నుండి నీవు జన్మించినాము. పూర్ణ స్వరూపుడవగు శివుడవు నీవే కదా ! (16).

మనము ఈ విధముగా త్రిమూర్తులు గా ఉన్ననూ చైతన్య స్వరూపములో మనకు భేదము లేదు. మనము పార్వతీ పరమేశ్వరుల పుత్రులము. హే సనాతనా! నీవీ సత్యమును నీ మనస్సులో నెరుంగుము (17). నేను, మరియు విష్ణువు కర్తవ్యములో భాగముగా వివాహమాడితిమి. హే ప్రభూ! మేము నీ ఆజ్ఞచే జగత్కార్యమును ప్రీతితో నిర్వహించుచున్నాము (18).

కాన, జగత్కల్యాణము కొరకు, దేవతలకు సుఖమును కలిగించుట కొరకు ఒక అందమైన యువతిని భార్యగా గైకొనుము (19). ఓ మహేశ్వరా! ఇంతకు ముందు జరిగిన వృత్తాంతమొకటి నాకు స్మృతికి వచ్చినది. వినుము. పూర్వము శివరూపములో నున్న నీవు మా ఇద్దరికీ ఒక విషయమును చెప్పియుంటివి (20).

ఓ బ్రహ్మా!ఇటువంటి నా శ్రేష్ఠ రూపము నీ దేహము నుండి ప్రకటమై లోకములో రుద్రనామముతో ప్రసిద్ధిని గాంచగలదు (21). బ్రహ్మ సృష్టిని చేసెను. విష్ణువు స్థితిని చేయుచున్నాడు. నేను గుణ సంబంధముచే రుద్రరూపమును స్వీకరించి లయమును చేయగలను (22). నేను ఒక స్త్రీని వివాహమాడి ఉత్తమమగు లోకకల్యాణమును చేసెదను. నీవిట్లు చెప్పియుంటివి. నీవీ సత్యమును గుర్తునకు తెచ్చుకొని, నీవు ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టుకొనుము (23).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


29 Oct 2020

No comments:

Post a Comment