కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 88



🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 88 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -18 🌻

మనోజయము ముఖ్యమైనటువంటి సాధన. ఏవండీ? జ్ఞానం ముఖ్యమా? యోగం ముఖ్యమా? ఏవండీ ప్రాణాయామము ముఖ్యమా? యోగాసనాలు ముఖ్యమా? ఏవండీ, సరిగ్గా కూర్చోవడం ముఖ్యమా? శరీరం నిటారుగా పెట్టడం ముఖ్యమా? కనులు మూసుకోవడం ముఖ్యమా? శరీర జపం చేయడం ముఖ్యమా? జపమాలతో జపం చేయడము ముఖ్యమా? పైకి చదువుతూ జపం చేయడం ముఖ్యమా? మానసిక జపం ముఖ్యమా? ఇట్లా అనేక రకాల ప్రశ్నలు మానవులు సాధనల గురించి, ఎన్నో ప్రశ్నలు అన్నీ ఇన్నీ కాదు, ఎన్నో, ఎన్నో సందేహాలు.

ఇవన్నీ కూడా ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పరచబడ్డాయి. ఏమిటంటే ‘మనోజయం’. నీ మనస్సును జయించడం అనేటటువంటి పనిని పెట్టుకున్నట్లయితే నువ్వు ఇవన్నీ అందులోనే ఒనగూడిపోతాయి. ఈ సందేహాలు ఏవీ ఉండవు. ఈ సందేహాలు అన్నింటిని ఒకే ఒక ప్రశ్నతో పరిమారుస్తారు. ఏమిటి? మనసు అనే కళ్ళెం నీ స్వాధీనంలో ఉండాలి.

తద్వారా దశేంద్రియములు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేన్ద్రియ, అంతరేంద్రియ సంఘాతం అంతా కూడా ఐదు ఐదుల ఇరవై ఐదు పిండాండములో ఉన్న ఐదు ఐదుల ఇరవై ఐదు జ్ఞాత స్వాధీనమై ఉండాలి. జ్ఞాత యొక్క ప్రభావం చేతనే, మిగిలిన 24 పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి జ్ఞాతే సత్యస్వరూపుడు. జ్ఞాతే నిత్యస్వరూపుడు, యధార్థ నేను.

నేను తెలుసుకునేవాడను, అన్యము లేదు. అనేటటువంటి, సరైయైనటువంటి నిశ్చయాన్ని, నిర్ణయాన్ని పొందేటట్లుగా, తన గమ్యస్థానమైనటువంటి పరమాత్మ కూటస్థ స్థితికి చేర్చడానికి, ఈ రధాన్ని ఉపయోగించుకోవాలి అనేది, సుస్పష్టముగా రధమును ఉపమానంగా పెట్టి, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములను, ప్రాణాన్ని మనస్సుని బుద్ధిని ఉపమానంగా చెప్పి ఇక్కడ శరీరము రధము, ఆత్మ రధికుడు - అనేటటువంటి పద్ధతిని, స్థిరమైనటువంటి నిర్ణయపద్ధతిగా బోధిస్తూ వున్నారు.

గుర్రపు కళ్ళెములను దృఢముగా చేతిలో నుంచుకొన జాలని సారధి, రధమును సరిగా గమ్యస్థానమును చేర్చజాలడు. రధమును మిట్టపల్లములలో పోనిచ్చి, కష్టముల పాలగును. అటులనే మనస్సును స్వాధీనములో ఉంచుకొనని వాని ఇంద్రియములు విషయములందు చిక్కుబడి సుఖదుఃఖములు అనుభవించుచు, జనన మరణ రూప సంసారమున మునిగి తేలుచుండును. ఇంద్రియాతీతమైన బ్రహ్మను పొందజాలరు.

ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనోజయము ఎందుకు ముఖ్యమో మరలా స్పష్టముగా చెబుతున్నారన్నమాట. ఎవరికైతే మనసు స్వాధీనములో ఉండదో, వారి మనస్సు పరి పరి విధములుగా పోతూ ఉంటుంది. కాసేపు ఫలానావి చూద్దామని, ఫలానావి తిందామని, కాసేపు ఫలానావి విందామని, కాసేపు ఫలానా వాటిని ముట్టుకుంటానని, ఫలానా వాటని ఆఘ్రాణిస్తానని... ఈ రకముగా శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాది విషయముల యందు, ఇంద్రియములను పోనిస్తూ, మిట్టపల్లములలో రధం పోతూ ఉందనుకోండి, ఎట్లా పైకి క్రిందకి లేచి పడుతూ ఉంటాడు రధికుడు, ఏ రకంగా ఒత్తిడులకు లోనౌతూ ఉంటాడు, ఏ రకంగా ఎగిరెగిరి పడుతూ ఉంటాడో, ప్రయాణం సరిగ్గా సాగదో ఆ రకంగా ఇంద్రియములు అన్నీ కూడా వాటి యొక్క విషయార్థములందు ప్రవేశించి, సుఖదుఃఖానుభవమును పొందేటప్పుడు, ఈ మిట్టపల్లాలలో రధం వెళుతున్నప్పుడు ఎట్లాగైతే ఎగిరెగిరి పడుతూ ఉన్నాడో, ఆ రకంగా మానవుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు.

కారణం ఏమిటంటే, పగ్గములను స్వాధీనంలో ఉంచుకొనలేదు కాబట్టి. రధం దాని ఇష్టం వచ్చినట్లు పోతూ ఉంది కాబట్టి. సరియైన మార్గంలో పోవడం లేదు కాబట్టి. సరియైన లక్ష్యం దిశగా పోవడం లేదు కాబట్టి. సరియైనటువంటి ప్రతిభా పాటవములతో రధమును నడపడం లేదు కాబట్టి. కాబట్టి, తద్వారా జనన మరణ రూప సంసారమునందు చిక్కుకుంటున్నాడు.

ఆ రకంగా అసంతృప్తి, సంతృప్తి అనేటటువంటి మూటలను ప్రతినిత్యమూ తయారు చేసుకుని, నిరంతరాయంగా అవస్థాత్రయంలో, ఆ రకమైనటువంటి వాటిని అనుభవిస్తూ, అవస్థాత్రయము, గుణత్రయము, శరీరత్రయము, దేహత్రయము... ఇటువంటి మూడు మూడుగా ఉన్నటువంటి, అనేక త్రిపుటలయందు చరిస్తూ, ఆ రకంగా త్రిపుటులే సత్యమనుకొని, త్రిపుటుల యందు ఉన్న భేద బుద్ధిని పొందుతూ, ఆ భేద బుద్ధి అనేటటువంటి జీవాత్మ ప్రభావములకు కుంగుతూ జనన మరణ సంసార రూపమున పరిభ్రమిస్తూ ఉన్నాడు.

ఇటువంటి వాడు సరిగ్గా మనస్సు అనేటటువంటి కళ్ళెమును చేతిలో వుంచుకొనక పోవడం వలన ఇలా అయ్యాడు. ఎవరైతే ఈ మనోజయాన్ని సాధించి, పరమాత్మ పద్ధతిగా లక్ష్యస్థానమునకు సరిగా రధమును నడుపుతారో, వారు మాత్రమే చేర్చగలుగుతారు. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


29 Oct 2020

No comments:

Post a Comment