శ్రీ శివ మహా పురాణము - 280
🌹 . శ్రీ శివ మహా పురాణము - 280 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
67. అధ్యాయము - 22
🌻. సతీ శివుల విహారము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఒకనాడు వర్షర్తువు వచ్చినపుడు కైలాస పర్వతము యొక్క మైదానము నందు ఉన్న వృషభధ్వజునితో దాక్షాయణి ఇట్లు పలికె%ు (1).
సతి ఇట్లు పలికెను -
దేవ దేవా ! మహాదేవా ! శంభో! నా ప్రాణప్రియా! నాథా! నా అభిమానమును రక్షించువాడా! నామాటను విని, అట్లు చేయుము (2). మిక్కలి దుస్సహమగు వర్షర్తువు ఇదిగో ఆరంభ##మైనది. అనేక వర్ణముల మేఘముల గుంపులు గర్జనలతో దిక్కులను, ఆకాశమును నింపుచున్నవి (3). వేగము గల గాలులు కదంబ పుష్పముల రేణువులను ఎగుర గొట్టుచూ, నీటి బిందువులను ఆకర్షించుచూ, హృదయమునకు భయము కలుగునట్లు వీచు చున్నవి (4).
కుండపోతగా జలమును వర్షిస్తూ, మెరుపు తీగలే పతాకములుగా కలిగి, తీవ్రమగు గర్జనలము చేయు ఈ మేఘములను చూచినచో, ఎవని మనస్సు అధికముగా కంగారు పడదు?(5). సూర్య చంద్రులు మేఘములచే కప్పబడి కనబడుట లేదు. వియోగము గలవారికి దుఃఖమునిచ్చే ఈ కాలములో పగలు కూడ రాత్రి వలె ఉన్నది (6).
ఓ శంకరా! గాలిచే త్రోయబడే ఈ మేఘములు ఒకచోట స్థిరముగా నుండవు. గర్జించు ఈ మేఘములు మానవుల శిరస్సుపై పడునా యన్నట్లు కన్పట్టు చున్నవి (7). ఓ హరా! కాముకులచే కోరబడే మహావృక్షములు గాలిచే కొట్ట బడినవై ఆకాశముందు నాట్యము చేయుచున్నవా యన్నట్లు ఉన్నవి. భయస్వభావము గల వారికి భయమును గొల్పుచున్నవి (8).
దట్టని కాటుక వలె నల్లనైన మేఘ సమూహము వెనుక ఎత్తుతో కొంగల వరుస ఎగురుచూ, యమునా నదిలోని తెల్లని నురగ వలె ప్రకాశించుచున్నది (9). నల్లని ఆకాశమునందు తెల్ల వారగనే ఉదయించే సూర్యుడు సముద్రములో మండు చున్న బడబాగ్ని వలె కన్పట్టు చున్నాడు (10).
ఓ ముక్కంటీ! ఇంటి వాకిళ్ల యందు కూడా ధాన్యపు మొక్కలు మొలుచు చున్నవి. పంట చేలలో సస్యములు పెరుగు చున్నవని నేను చెప్పనేల ?(11). స్వచ్ఛమైన హిమవత్పర్వతముపై నల్లని, తెల్లని, ఎర్రని మేఘములు వాలు చుండగా, ఆ పర్వతము మందర పర్వతమునాశ్రయించిన మేఘముల గుంపులతో కూడియున్న పాల సముద్రము వలె భాసించెను (12).
సౌందర్యము చాల కుటిలమైనది. ఇతర పుష్పముల నన్నిటినీ వీడి కింశుక పుష్పముల నాశ్రయించినది. ఇది కలియందు లక్ష్మీదేవి సత్పురుషులను వీడి దుష్టుల నాశ్రయించి నట్లు న్నది (13). వనములన్నింటియందు నెమళ్లు మేఘగర్జన శబ్దమును విని, చాల ఆనందించినవై కేకాధ్వనులను నిరంతరముగా చేయుచూ పింఛమును పైకెత్తి నాట్యము చేయుచున్నవి (14).
మేఘములను చూచి ఉల్లాసమును పొందే చాతకపక్షులకు ఈ వర్షము మధురము. ఈ కాలము మనోహరము. కాని పథికులు కుండపోత వర్షము పడు చున్ననూ వియోగతాపమును అనుభవించెదరు (15). ఈ మేఘముల పొగరును పరికించుము. ఇవి వడగళ్లతో నా దేహమును కప్పివేయు చున్నవి. నా వెంట నడచిన నెమళ్లపై, మరియు చాతకములపై వడగళ్లను వర్షించుచున్నవి (16).
ఈ విషమకాలమునందు కాకులు, చకోరములు కూడ గూళ్లను కట్టుకొను చున్నవి. కాని నీవు ఇంటిని నిర్మించలేదు. నీకు శాంతి ఎట్లు లభించగలదు? (18). ఓ పినాక పాణీ! మేఘములు ఆకసములో నిండుచుండగా నాకు భయము అధికమగుచున్నది. కాన నీవు నా మాటను పాటించి ఆలస్యము లేకుండా ఇంటిని నిర్మించే ప్రయత్నమును చేయుము (19).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ దాక్షాయణి ఇట్లు అనేక పర్యాయములు చెప్పగా, శంభుడు శిరస్సుపై నున్న చంద్రుని కాంతులు చిరునవ్వు శోభను పెంచుచుండగా నవ్వెను (21). నవ్వుచే విడివడిన పెదవుల సంపుటము కలిగిన వాడు, మహాత్ముడు, సర్వతత్త్వముల నెరింగినవాడు అగు పరమేశ్వరుడు ఆమెను సంతోషపెట్టువాడై సతీదేవితో నిట్లనెను (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
24 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment