కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 111


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 111 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -41 🌻


ఎందుకంటే అవతార్ మెహెర్ బాబా ఏమంటున్నారు? నీవు నాలుగు దివ్యయానాల ద్వారా పరిణామం చెందాలి అంటున్నాడు. నీవు మానవుడు అవడం ద్వారా, ఒకటవ దివ్యయానం పూర్తి అయ్యింది.

మనవోపాధిని ధరించడం ద్వారా రెండవ దివ్యయానంలో ప్రవేశించి, ఎవరైతే ఈ ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గం లోకి ప్రయాణం చేసి నిర్వాణ స్థితిని అనుభవిస్తారో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు రెండవ దివ్యయానం పూర్తి చేసినట్లు అన్నమాట. వాళ్ళు బ్రహ్మానుసంధానానికి అర్హులు. బ్రహ్మ నిష్ఠ కు అర్హులు. ఆ బ్రహ్మ నిష్ఠ పొందడం ద్వారా తృతీయ దివ్యయానాన్ని పూర్తి చేస్తారు. తద్వారా జీవన్ముక్తులు అవుతారు.

ఆ స్థితి నుంచి చిట్టచివరిదైనటువంటి చతుర్ధ దివ్యయానం జన్మరాహిత్య స్థితికి దేశికేంద్రుల యొక్క కృప చేత చిట్టచివరిదైనటువంటి బట్టబయలు స్థితికి చేరుతారు. ఈ రకంగా నాలుగు దివ్యయానాలు పూర్తి చేయాలి మానవుడు. అట్లా పూర్తి చేసినవాడే జన్మ రాహిత్య స్థితికి చేరుతాడు.

మరి శ్రవణ, మనన నిధి ధ్యాసలు ఒకదాని యందు ఒకటి అంతర్భూతములై వున్నవి కదా! ఒక దాని మీద ఒకటి ఆధారపడి వున్నాయి కదా! ఈ శ్రవణం అన్నది చతుర్విధ శుశ్రూషలలో భాగం కదా!

మనన నిధి ధ్యాసలు ఇంకా అంతకంటే చాలా ముఖ్యమైనవి కదా! ఇట్లా ఒకదాని పరిణామ ఫలముగా మరొకటి లభిస్తున్నది. శ్రవణం బాగా చేసినటువంటి వాడికి మననం బాగా తొందరగా కుదురుతుంది. మననం బాగా స్థిరమైనటువంటి బుద్ధితో చేసినటువంటి వాడికి నిధి తొందరగా లభిస్తుంది. ఆ నిధి స్థితిలో సహజంగా ఉన్నటువంటి వాడు సమాధి నిష్ఠలో తొందరగా చేరగలుగుతాడు.

అప్పుడు 24 గంటలూ ఇంద్రియములు ఒకవేళ బయటకు బహిర్ముఖములై వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ వాటి యొక్క అంతర్ముఖమైనటు వంటి మనో బుద్ధులు మాత్రము సదా ఆత్మ నిష్ఠలోనే వుంటాయి. వాడికి మనో బుద్ధులు బయటకు రావు. ఇంద్రియములు విడిపోతాయి అప్పుడు. గోళకములు విడిపోతాయి అప్పుడు. అవి బయటకు బహిర్ముఖముగా వ్యవహరిస్తూ ఉండవు.

సామాన్య వ్యవహారం చేస్తూ వుంటాడు. కానీ చేశాడనేటటువంటి జ్ఞప్తిలో లేకుండా చేస్తాడు. ఆ జ్ఞానం లేకుండా చేస్తాడు. అంటకుండా చేస్తాడు. సాక్షిగా వుండి చేస్తాడు. స్థిరంగా వుండి చేస్తాడు. అసలు మనోబుద్ధులు వాడికి తోచనే తోచవు. గుణత్రయాలు తోచనే తోచవు. ‘ఉన్నాడు అంటే ఉన్నాడు’ అంతే లేక్కేసుకోవడానికి.

వాస్తవానికి సామాజికంగా లెక్కేస్తే, కుటుంబంగా లెక్కేస్తే, సంసారంలో లెక్కేస్తే వాడిని ఒక శాల్తీ క్రింద లేక్కేయాలే తప్ప వాడి వల్ల ఏమి ప్రయోజనం లేదు. ఎందుకని అంటే వ్యవహారశీలి కాదు. కాని సమాధి నిష్టలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటాడు. మరి ఇప్పుడు వాడిని పరిగణ లోనుంచి తీసేద్దామా? ఎందుకని అంటే మానవ జన్మ ధన్యత చెందాలి అంటే వాడిలాగానే అవ్వాలి.

జగత్తంత నిత్య వ్యవహార శీలి అయిపోయి వ్యవహారంలో బలవత్తరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటివాడు మరి జనన మరణ చక్రంలో పడిపోతున్నాడుగా! కర్మబంధంలో పడిపోతున్నాడు గా! కర్మ బంధం తొలగాలి అంటే నిధి ధ్యాసలు చాలా అవసరం కదా మరి! అ కర్మ బంధం తొలగదు కదా లేకపోతె! కర్మలు రద్దు కావు కదా!

కాబట్టి శ్రవణ మననాలకంటే నిధిధ్యాసలకు చాల విలువ ఉంది. జ్ఞానాగ్నిని రగిలింప చేయగలిగేటటు వంటి శక్తి నిధి ధ్యాసలకు వుంది. శ్రవణ మననాదులు బాహ్య సాధనాలు. నిధి ధ్యాసలు ఆంతరిక సాధనాలు. మనో బుద్ధులవరకే పని చేస్తాయి శ్రవణ మననాలు. దాని అవతల అంతా నిధి ధ్యాసలె ఉన్నది.

మహాత్తత్వాన్ని అవ్యక్తాన్ని ప్రత్యగాత్మ స్థితులకు చిట్ట చివరి స్థితులకు చేరాలి అంటే మరి నీవు ఆ స్థితిలో వుండాలిగా! నిధి ధ్యాసలు లేకుండా వాటిని ఎవరు సాధించలేరు. సాక్షిత్వాన్ని సాధించలేరు. కాబట్టి లక్ష్య సిద్ధి కొరకు నాలుగు అవసరమే. ఈ స్థితిలో ఏది వాడాలో తెలుసుకొని వాడాలి. - విద్యా సాగర్ స్వామి

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Nov 2020

No comments:

Post a Comment