గీతోపనిషత్తు - 83


🌹. గీతోపనిషత్తు - 83 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 21. బ్రహ్మ యజ్ఞము - బ్రహ్మమే యిన్ని రూపములుగా ఏర్పడి, యిన్ని రకములుగా నిర్వర్తించు కొనుచున్నాడు. మొదలున్నది బ్రహ్మమే. సంకల్పము బ్రహ్మమే. కర్మనిర్వహణము బ్రహ్మమే. అది బ్రహ్మమునకే సమర్పణము. చివరకు మిగులునది బ్రహ్మము. ఇది ఒక బ్రహ్మ ఉపాసనా మార్గము. ఇట్లు భావించుచూ జీవించుటయే ఈ ఉపాసన.🍀


📚. 4. జ్ఞానయోగము - 24 📚


బ్రహ్మార్పణం బ్రహ్మహవి ర్ర్బహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా || 24



సమస్తమును బ్రహ్మమే అని తెలుపు శ్లోకము ఇది. ప్రతినిత్యము పఠింపవలసిన శ్లోకము. నిర్వర్తించు సర్వమును బ్రహ్మమున కర్పణము చేయుము అని యీ శ్లోక నిర్దేశము. నిర్వర్తించుటకు వినియోగించు సర్వ శక్తులు, వనరులు, శరీరము, మేధస్సు, ధనము అంతయూ బ్రహ్మమే.

వానినట్లు వినియోగించుట దినచర్యయందలి హోమము. కార్యము నందు సమర్పింప బడిన వన్నియు (అనగా వనరులు, శక్తులు మొదలగునవి) హోమ ద్రవ్యములు. సమర్పణము కర్తవ్య నిర్వహణమున గనుక అది బ్రహ్మాగ్ని. నిర్వర్తించు యజమాని బ్రహ్మ. ఎవరి కొరకు నిర్వర్తించు చున్నాడో వారునూ బ్రహ్మమే. చేయువాడు, చేయబడు పని, అందు వినియోగింపబడినవి, దాని నుండి ఫలము పొందినవారు, అంతయూ బ్రహ్మమే.

బ్రహ్మమే యిన్ని రూపములుగా ఏర్పడి, యిన్ని రకములుగా నిర్వర్తించు కొనుచున్నాడు. మొదలున్నది బ్రహ్మమే. సంకల్పము బ్రహ్మమే. కర్మనిర్వహణము బ్రహ్మమే. అది బ్రహ్మమునకే సమర్పణము. చివరకు మిగులునది బ్రహ్మము. ఇది ఒక బ్రహ్మ ఉపాసనా మార్గము.

ఇట్లు భావించుచూ జీవించుటయే ఈ ఉపాసన. ఇట్టివారు సమముగా, ఇందలి సత్యమును రుచి చూడగలరు. దీనిని బ్రహ్మయజ్ఞము అందురు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



24 Nov 2020

No comments:

Post a Comment