గీతోపనిషత్తు - 73

🌹. గీతోపనిషత్తు - 73 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 11. దేవతారాధన - కర్మఫల సిద్ధికొరకు దేవతలను ఆరాధించుట ఆర్య సంప్రదాయము. యోగము, ధ్యానము, తపస్సు చేయువారు కూడ దేవతార్చన సలిపినచో మార్గము సుగమమగును. ప్రతికూలతలు, విఘ్నములు, అంతరాయములు నివారింపబడును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 12 📚

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి ర్భవతి కర్మజా || 12

దేవతల రూపమున దైవమే వ్యాప్తి చెందియున్నాడు. ఒకే అంతర్యామి దైవమునుండి అనేకానేక దైవశక్తులు దేవతా ప్రజ్ఞలుగా వ్యక్తమై వివిధములగు కార్యములను సృష్టిలో నిర్వహించు చున్నవి. ఆయా దేవతలు, ఆయా లోకములలో లోకపాలురుగను, గురువులుగను, యితర శక్తులుగను వెలసి యున్నారు. ఇందరియందు అంతర్యామిగా తానై దైవమున్నాడు.

ఇన్ని దేవతా ప్రజ్ఞలుగా జీవులకు సమీపముగా తానున్నాడు. కర్మఫల సిద్ధి కొరకు దేవతలను ఆరాధించుట ఆర్య సంప్రదాయము. దేవతలను ఆరాధించుట అనగా వారి యనుగ్రహము కోరి తదనుగుణమైన దీక్షను వహించుట, పూజించుట.

దీక్షాయుత జీవనము జీవులను సంస్కారవంతులుగా తీర్చిదిద్ద గలదు. తదనుగుణమైన ఫలమునుగూడ నీయగలదు. ఈ లోకమున శీఘ్రముగా ఫలసిద్ధి కలుగుటకు ఋషులనేకానేక దేవతా ఆరాధనములను అందించి యున్నారు. శ్రీరాముడు, ధర్మరాజు, అర్జునుడు, లీలామానుష రూపుడగు శ్రీ కృష్ణుడు కూడ ఆరాధనములు సలిపినట్లు మన గ్రంథములు తెలుపుచున్నవి.

భగవద్గీతయందు దేవతారాధన సంప్రదాయమున్నట్లు దైవము తెలుపుచున్నాడు. ముందు శ్లోకమున తన నెవరెవరు ఏయే విధముగా ఆరాధించిన వారికి ఆ విధముగనే అనుగ్రహింతునని తెలిపిన వైనము ఈ శ్లోకమున దేవతలను ఆరాధించుటచే కర్మఫల సిద్ధి శీఘ్రముగ కలుగునని వివరించుటలో అందరియందు తననే దర్శించమని కూడ సూచన లభించుచున్నది.

ఇట్లారాధించుటచే మనుష్యులు త్వరితగతిని మానవ లోకమున పురోగమించగలరని గీత బోధించుచున్నది. అగస్త్య మహర్షితో సహా సమస్త ఋషులును దేవతారాధనము ప్రతి నిత్యము గావించు చుందురని పురాణములు తెలుపుచున్నవి.

కావున బుద్ధిమంతులగు వారు నిత్యదేవతార్చనము కావించు కొనుట శ్రేయోదాయకము. యోగము, ధ్యానము, తపస్సు చేయువారు కూడ దేవతార్చన సలిపినచో మార్గము సుగమమగును. ప్రతికూలతలు, విఘ్నములు, అంతరాయములు నివారింపబడును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2020

No comments:

Post a Comment