🌹 . శ్రీ శివ మహా పురాణము - 270 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
64. అధ్యాయము - 19
🌻. సతీకల్యాణము - శివలీల -2 🌻
ఇతరులకు ఎవరు అపకారమును తలబెట్టెదరో, అది వారికే జరుగుట నిశ్చయము. ఈ సత్యము నెరింగి మానవుడు ఇతరులకు అపకారమును చేయరాదు (16). ఓమహర్షీ! సతీదేవి అగ్నికి ప్రదక్షిమమును చేయు చుండగా చీర తొలగి ఆమె పాదములు రెండు కనబడ జొచ్చివని. నేను వాటిని చూచితిని (17).
ఓ ద్విజ శ్రేష్ఠా! శివమాయచే విమోహితుడనైన నేను మన్మథునిచే ఆవేశింపబడిన మనస్సు గలవాడనై సతీదేవి యొక్క అంగములను చూచితిని (18). నేను సతీదేవి యొక్క అంగములను హర్షముతో ఉత్కంఠతో చూచు చుండగా, నాలోని కామవేదన అధికము కొజొచ్చెను (19).
ఓ మహర్షీ! పతివ్రతయగు దాక్షాయణిని నేను ఈ తీరున చూచి మన్మథునిచే ఆవేశింపబడిన మనస్సు గలవాడనై ఆమె ముఖమును చూడగోరితిని (20). నేను సిగ్గుచే శంభుని ముఖమును ప్రత్యక్షముగా చూడలేదు. ఆమె సిగ్గుచే తన ముఖమును కనబడ కుండునట్లు కప్పుకొని యుండెను (21).
ఆమె ముఖమును చూచే మంచి ఉపాయమును గూర్చి నేను ఆలోచించితిని. ఘోరమగు పాపప్రభావముచే నేను కామ పీడితుడనై అపుడొక పనిని చేసితిని (22). అచట అగ్ని యందు పచ్చి కర్రలను అధికముగను, ఆజ్యాహుతిని అల్పముగను వేసి తడి ద్రవ్యము అధికముగ నుండునట్లు చేసితిని (23).
అపుడు అచట అంతటా పొగ అధికముగా వ్యాపించి, వేది సమీప భూమి అంతయూ చీకటి నిండినట్లు ఆయెను (24). అపుడు పరమేశ్వరుడగు మహేశ్వరుడు పొగతో నిండిన కళ్లను రెండు చేతులతో ముసుకొనెను. ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును గదా!(25).
ఓ మహర్షీ! అపుడు నేను వస్త్రమును పైకి తీసి సతీ దేవి ముఖమును సంతోషముతో నిండిన మనస్సు గలవాడనై చూచి కామ పీడితుడనైతిని (26). వత్సా! నేను సతీదేవి ముఖమును అనేక పర్యాయములు చూచి ఇంద్రియ వికారమును పొందితిని. నా ముస్సు నా వశములో లేకుండెను (27).
ఆమెను చూచుట వలన మంచు ముద్దవలె నున్న నాల్గు బిందువుల పరిమాణము గల నా రేతస్సు భూమిపై జారిపడెను (28). ఓ మహర్షీ! నేను ఆ క్షణములో విస్మయమును చెంది భయపడినవాడనై ఏమియూ మాటలాడకుండగా, ఆ రేతస్సును ఇతరులకు కానరాకుండునట్లు కప్పివేసితిని (29).
అపుడు భగవాన్ శంభుడు దివ్యదృష్టిచే ఆ విషయమును తెలుసుకొనెను. రేతస్సేకము జరుగుటచే ఆయనకు చాల కోపము వచ్చెను. ఆయన ఇట్లు పలికెను (30).
ఓరీ పాపీ! నీవిట్టి జుగుప్సితమగు కర్మను ఏల చేసితివి ?నీవు వివాహములో నా భార్య యొక్క ముఖమును అనురాగముతో చూడలేదు (31). శంకరునకు తెలియనిది ఏదియూ ఉండదని నీవు ఎరుంగుదువు. ముల్లోకములలో నైననూ నాకు తెలియని రహస్యము లేదు. హే విధే! ఇట్లు ఏల చేసితివి?(32).
హేమూఢా! ఈ ముల్లోకములలో సమస్త చరాచర ప్రాణి సమూహములోపల నేను తిలలయందు తైలము వలె వ్యాపించి యున్నాను (33).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 Nov 2020
No comments:
Post a Comment