కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 101


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 101 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -31 🌻

నీ శరీరంలో, నీకున్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ, విషయెంద్రియ సంఘాతం ఏదైతే ఉన్నదో, అంటే అర్థం ఏమిటి?

వాక్‌, పాణి, పాద, పాయు, ఉపస్థలు... అంటే మాట్లాడేది, చేతులు, కాళ్ళు, విసర్జక అవయవాలు, ఇది ఒక కర్మేంద్రియ వ్యవస్థ. అలాగే శ్రోత్ర, త్వక్‌, చక్షు, ఘ్రాణ, రసన... ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అంటే అర్థం ఏమిటి, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం(స్పర్శ), నోరు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు.

ఇవి కాక ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన ఈ ఐదు వాయువులు నీ లోపల పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఐదు వాయవులు కనుక సరిగ్గా సమతౌల్యంగా పనిచేయకపోయినట్లయితే, అనారోగ్యం వచ్చింది అంటున్నాము. కాబట్టి, మానవులందరూ తప్పక ప్రాణాయామాన్ని నిర్వహించాలి.

రోజూ ఉదయం లేవగానే, తెల్లవారు ఝామున బ్రహ్మముహూర్తంలో లేవగానే మొట్టమొదట చేయవలసిన పని ప్రతీ ఒక్కరూ ఏమిటయ్యా అంటే ముఖ ప్రక్షాళనం అవ్వగానే ప్రాణాయామం చేయాలి. ఎంత సేపు చేయాలి?

మీకు ప్రాణ శుద్ధి జరిగేంత వరకూ, ఆసన శుద్ధి జరిగేంత వరకూ, నియమితమైనటువంటి శరీర శుద్ధి జరిగేంత వరకూ, మీలో రక్త ప్రసరణ వ్యవస్థ పునరుత్తేజితం అయ్యేంత వరకు. నీవు ఎప్పుడైతే రోజు వారి విధిలో, ఎట్లా అయితే మిగిలిన కార్యక్రమాలు పెట్టుకున్నావో, అట్లాగే ఈ అనులోమ, విలోమ సమ ప్రాణాయామాన్ని మానవులందరూ తప్పక సులభంగా ఆచరించవచ్చు. ఏ ఇబ్బందీ లేదు.

అయితే మొదట్లో చేతులు పెట్టి అలవాటు చేసుకొనే ప్రక్రియ అందరికీ అలవాటు. కొద్ది కాలము అలా ప్రయత్నించిన, తరువాత మనసుతోనే నియంత్రించి, నియమించ గలిగేటటువంటి శక్తిని సముపార్జించాలి. దీంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందీ లేదు. ఏ రకమైనటువంటి శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు కానీ, సాధనా పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడవు.

కాబట్టి, ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించ వలసినటువంటి సాధనలు ఏమిటంటే, ‘స్థిర సుఖ మాసనం’ - మంచి ఆసన సిద్ధిని ఏర్పాటు చేసుకోవడం. పూజావిధికి తక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. అది బాహ్యం కదా! అనేక పనిముట్లను ఉపయోగించి మనము పూజావిధులను నిర్వహిస్తాము.

ఇంట్లో ఉన్న అర్చామూర్తులకు ఈ పూజావిధులను నిర్వహించడం తప్పక అవసరం. ప్రతి ఒక్కరూ కూడా ఐదు నిమిషాలో, పది నిమిషాలో, పదిహేను నిమిషాలో... మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి, పూజా మందిరానికి, పూజా మందిరంలో ఉన్నటువంటి అర్చామూర్తులకు తప్పక, అర్చనా విధిని అనుసరించాలి.

ఇది ప్రతి ఒక్కరూ నిత్యకార్యక్రమంలో, నిత్య పూజా విధానంలో, రోజువారీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు తప్పక ఏర్పాటు చేసుకోవాలి. కారణమేమిటంటే, అందులో దీపారాధాన - అది కూడా ఒక పనిముట్టే! - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2020

No comments:

Post a Comment