✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 8, 9
🍀. 7. గమనిక, సాక్షిత్వము - పరతత్వముతో యోగయుక్తుడైన తత్వవేత్త చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తిను చున్నను, నడచుచున్నను, నిదురించుచున్నను, శ్వాసను నిర్వర్తించు చున్నపుడును, మాట్లాడుచున్నను, విషయములు గ్రహించు చున్నపుడును, కళ్ళను తెరచినను, మూసినను, ఈ సమస్తమును సాక్షీభూతుడుగ గమనించుచునే యుండును గాని, తానే చేయు చున్నాడని భావింపడు. అతనికి మనసు, యింద్రియములు, శరీరము ఒక వాహనము వంటివి. బాహ్య ప్రపంచమున పనిచేయునపుడు శరీరము నతడు వాహనముగ వాడును. ఆవశ్యకత లేనపుడు దాని యందుండక, తన యందు తానుండును. ఇట్టి వారిని కర్తృత్వ భావనను దాటిన వారని తెలుపుదురు. ఇట్టివారే సన్న్యాసులు. 🍀
8. నైవ కించి త్కరోమితి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ జిఋ న్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ || 8
9. ప్రలపన్ విసృజన్ గృహ న్నున్మిష నిమిష న్నపి |
ఇంద్రియాణీంద్రియార్డేషు వర్తంత ఇతి ధారయన్ || 9
పరతత్వముతో యోగయుక్తుడైన తత్వవేత్త చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తిను చున్నను, నడచుచున్నను, నిదురించుచున్నను, శ్వాసను నిర్వర్తించు చున్నపుడును, మాట్లాడుచున్నను, విషయములు గ్రహించు చున్నపుడును, కళ్ళను తెరచినను, మూసినను, ఈ సమస్తమును సాక్షీభూతుడుగ గమనించుచునే యుండును గాని, తానే చేయు చున్నాడని భావింపడు.
పై విధముగ నుండుట నొక విచిత్రము. కాని పరతత్వము నాశ్రయించిన వానికి, యోగయుక్తుడైన వానికి యిది సత్యము. యోగయుక్తుడైనవాడు తన శరీరమును, యింద్రియములను, మనసును తనకన్న వేరుగ గమనించును. అతనికి మనసు, యింద్రియములు, శరీరము ఒక వాహనము వంటివి. బాహ్య ప్రపంచమున పనిచేయునపుడు శరీరము నతడు వాహనముగ వాడును.
ఆవశ్యకత లేనపుడు దాని యందుండక, తన యందు తానుండును. తనయందు తానున్న యోగికి తన శరీరావసరము లన్నియు తనవనిపించవు. అవి ప్రకృతి గుణముల వలన ఏర్పడినవని, ఆ గుణములే పంభూతములతో రూపుగట్టుకొని యున్నవని తెలిసి యుండును. అది క్షరమని, తా నక్షరుడని తెలిసి యుండును.
తాను ఆత్మయని, తన ఎరుక బుద్ధియని, ఆత్మ-బుద్ధిగ తానున్నాడని, మనస్సు, ఇంద్రియములు, దేహము ద్వారా బహిర్గతు డగుచున్నాడని, తన దేహము రక్త మాంసాదులు కలిగి యున్నదని తెలిసియుండును. అట్టివానికి దేహాత్మ భావముండదు. ఆత్మ భావనయే యుండును.
ఉదాహరణకు, మన కొక గుఱ్ఱము (ఎక్కి తిరుగుటకు) ఉన్నదనుకొనుడు. గుఱ్ఱము నెక్కి సమస్త కార్యములు నిర్వహించి, అటు పైన గుఱ్ఱమును దిగి మనము మన గృహమున నుందుము.
గుఱ్ఱము చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తినుచున్నను, కదలుచున్నను, ఊపిరి పీల్చి విడచుచున్నను, కండ్లు తెరయుచు మూయుచున్నను సాక్షీభూతులమై చూతుము గాని అవి యన్నియు మనము చేయుచున్నా మనుకొనము గదా! మన వాహనము మనకన్న వేరని మనకు తెలియును. వాహనపు చేష్టలు మన చేష్టలు కాదని మనకు తెలియును.
అదే విధముగ యోగయుక్తుడు తా నక్షరుడగు ఆత్మ యని; మనసు, యింద్రియములు, శరీరము తన వాహనమని, వాహనపు మనో యింద్రియపు వ్యాపారములు తనవి కావని తెలిసి యుండును.
ఇట్టి వారిని కర్తృత్వ భావనను దాటిన వారని తెలుపుదురు. ఇట్టివారే సన్న్యాసులు. వారు సాక్షితనమున నుందురు. సమస్త కర్మలు తమనుండి జరుగుచున్నపుడు కూడ సాక్షిగనే యుందురు. తాము బ్రహ్మమునందే మనన మార్గమున యందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Jan 2021
No comments:
Post a Comment