భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 209


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 209 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. వ్యాసమహర్షి - 1 🌻

జ్ఞానం:


1. జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ అవతారవిశేషాలను, గురుస్వరూప మహత్యాన్ని లోకానికి తేటతెల్లంచేసిన శ్రీ వ్యాసమహర్షి పవిత్ర జన్మదినాన్ని, ఐదువేల సంవత్సరాలనుండి ‘గురుపౌర్ణమి’గా ప్రతి సంవత్సరం జరుపు కుంటున్నాము. భారతచరిత్ర; వేద, ఇతిహాస, పురాణ, వ్రత, పూజాది సర్వ సంప్రదాయాలు, ధర్మనిర్ణయాలు మనకు వ్యాసమహర్షి ప్రసాదమే.

2. బ్రహ్మసృష్టిలో, ఆయన ముఖంనుండి వ్యక్తమైన వేదముల జ్ఞానంకలిగిన మరొకడు బ్రహ్మకు సహాయభూతుడు కావాలి అనుకొని అట్లాంటి వాడిని శ్రీహరి సృష్టించాడట. ‘అపాంతరతముడు’ అని అతడికిపేరు.

3. తనలో ఉన్న శృతులన్నీ అతడికిచ్చి, ఆయనతో, “నేను నాలోంచి నీకిచ్చినటువంటి వేదములు, శ్రుతినంతా కూడా గ్రహించి నువ్వు దానిని వ్యాప్తిచెయ్యి” అన్నాడు. వీదవ్యాసుడు అలా జన్మించాడు. ‘వ్యాసము’ అంటే వ్యాప్తి చేయడము. వేదవ్యాసుడు అంటే ‘వేదములను వ్యాప్తిచేసినవాడు’ అని అర్థం.

4. బ్రహ్మ తనకు ‘పరా’స్థితిలో ఇచ్చినటువంటి వేదములను అతడు సక్రమంగా విశ్లేషణచేసి, దానికి వాగ్రూపం ఇచ్చి, తనలోంచి దానిని బహిర్గతం చేసి ఇతరులకు శ్రుతమయే విధంగా చేసాడు.

5. అందుకని శ్రీహరి సంతోషించి, అతనిని “నా సంకల్పం నెరవేర్చావు. కాబట్టి నీకు వేదవ్యాసుడనే పేరు పెడుతున్నాను” అన్నాడు. వేదవ్యాసుడు మనకు భారతం నుంచే పరిచయం అయినా ఆయన అంతకంటే పూర్వంవాడే, సనాతనుడు! అప్పటినుంచీ కూడా వస్తున్నాడని చెపుతున్నారు.

6. శ్రీహరి, “నువ్వు నా సంకల్పాన్ని నెరవేర్చావు కాబట్టి, అన్ని మన్వంతరాలలో కూడా నీవు ఈ వేద్వ్యాసక్రియలో నన్ను సంతోష పెడుతూ ఉంటావు. ఈ రాబోయే మన్వంతరంలో నీవు వసిష్ఠపౌత్రుడైన పరాశరుడనే మునికి జన్మిస్తావు. నీవలనే పుట్టిన కురువంశపురాజులు పరస్పరవైరంతో యుద్దంలో నశించగా, అట్టి సంక్షోభకాలంలో – ఏ వేదము ఉన్నదో, అదికూడా సంక్షోభం పొందుతుంది.

7. నీ సంతానం సక్రమంగా నిలబడక పరస్పరవైరంతో పోవటము అనే ఈ సంక్షోభం ఎప్పుడు జరుగుతుందో, అప్పుడు ఒక యుగాంతం సంభవించిన వేదాలుకూడా సంక్షోభం చెందుతాయి. అప్పుడు నువ్వు ఆ వేదములను సముద్ధరణచేసి, భవిష్యత్తులో ఆ వేదములను ఏరూపంలో అనుష్టించాలో, అలాగ వ్యవస్థచేయగలవు నీ వల్లనే వేదోద్ధరణ జరుగుతుంది” అని చెప్పాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




15 Jan 2021

No comments:

Post a Comment