దేవాపి మహర్షి బోధనలు - 3


🌹. దేవాపి మహర్షి బోధనలు - 3 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 1. కర్తవ్యము - 3 🌻


సాధకులు సాధనకన్న మిక్కుటముగ అనారోగ్య చింతన చేయుట, ఆరోగ్యపరమైన విధానమును అలవరచుకొన కుండుట సోమరితనము. “ఇప్పటికే చాలా శ్రమ పడుచున్నాను” అను భావన చేయుట కూడ సోమరితనము. తన గురించి తాను జాలిపడుట సోమరితనమునకు మరింత దారి తీయగలదు.

తన భావన, తను భావన పురోభివృద్ధికి అడ్డుగోడలు. ప్రత్యేకించి నలభై సంవత్సరములు దాటిన వారి కివి గట్టి అవరోధములు కాగలవు. ఇందు జీవించువారు సాకులతో సాధనను మరతురు. దేహము నందలి భ్రాంతిని వదలుట, ఉత్సాహముతో పరహిత కార్యమును ఒనర్చుట ఒక్కటియే పరిష్కారము.

ప్రపంచమున కోట్లాది జనులు తమ శరీరమును తాము సంరక్షించుకొనుటకై జీవించుచున్నారు. వారిలో నొకరిగ నుండుట లోకహితుని ధర్మము కాదు.

ఇట్లే సాధకులు తమ వ్యక్తిగత జీవితమునకు వలసిన సదుపాయమును అమర్చుకొను సుడిగుండమున ప్రవేశించుట కూడ జరుగు చుండును. భగవానుడు బోధించిన కర్తవ్య మార్గమునే ఎన్నుకొని ఫలితములను ఆశించని స్థితి సాధకునకు అత్యవసరము.

జీవితమున అన్ని విషయముల యందు కర్తవ్యాచరణ మొక్కటియే సత్యమై నిలచును. ఫలితముల నాశించు మార్గమున సాధన కొరవడుటయే కాక ఆరాటముతో జీవితమున చిక్కులు వేసుకొనుట జరుగును.

కర్తవ్యోన్ముఖునికి అప్రయత్నముగ సమస్తము జీవిత మార్గమున లభించు చుండును. అప్రయత్నముగ లభించువాని కొరకు ఆశించుచు కర్తవ్యమును వదలుట సోమరితనము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jan 2021

No comments:

Post a Comment