శ్రీ శివ మహా పురాణము - 324


🌹 . శ్రీ శివ మహా పురాణము - 324 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

81. అధ్యాయము - 36

🌻. విష్ణు వీర భద్ర సంవాదము - 4 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను

ఆవీరభద్రుని ఆ మాటను విని బుద్దిమంతుడు, దేవ నాయకుడు అగు విష్ణువు ఆ యజ్ఞశాలయెదుట చిరునవ్వుతో ప్రేమతో ఇట్లు పలికెను.

విష్ణువు ఇట్లు పలికెను

వీరభద్రా! నీ ఎదుట నేను ఇపుడు చెప్పబోవు మాటను నీవు వినుము. శంకరుని సేవకుడునగు నన్ను గురించి నీవు రుద్రవిరోధియని పలుకవద్దు(56) తత్త్వము నెరుంగని వాడు, అజ్ఞానము వలన కర్మయందు మాత్రమే నిష్ఠగలవాడునగు ఈ దక్షుడు పూర్వము నన్ను యజ్ఞమునకు రమ్మని అనేక పర్యాములు గోరియుండెను(57) నేను భక్తులకు వశములో నుందును. మహేశ్వరుడు కూడ అట్టివాడే వత్సా! దక్షుడు నాభక్తుడు. అందువలననే నేనీ యజ్ఞమునకు వచ్చితిని(58)

రుద్రుని కోపమునుండి పుట్టిన ఓవీరా! నా ప్రతిజ్ఞను వినుము హే ప్రభో! రుద్ర తేజస్సు స్వరూపముగా గల నీవు గొప్పపరాక్రమశాలివి (59) నీవు నన్ను అడ్డుకొనుము నేను నిన్ను అడ్డెదను. ఏది జరుగవలెనో, అదియే జరుగును. నేను పరాక్రమమును చూపెదను(60).

బ్రహ్మ ఇట్లు పలికెను

గోవిందుడిట్లు పలుకగా, మహాబాహుడు అగు ఆ వీరభద్రడు చిరునవ్వు నవ్వి, 'నీవు మా ప్రభుడగు రుద్రునకు ప్రియుడవని తెలిసి నేను మిక్కిలి సంతసించితిని అని పలికెను(61) అపుడు గణాధ్యక్షుడగు వీరభద్రుడు మిక్కిలి సంతసించి, వినయముతో విష్ణుదేవునకు యథార్థముగా నమస్కరించి ఇట్లు పలికెను(62)

వీరభద్రుడిట్లు పలిను-

హే మహాప్రభో! నీ మనస్సును పరీక్షించుటకైనేను అట్లు పలికితిని. ఇప్పుడు యథార్థమును చెప్పుచున్నాను. నీవు సావధానముగా వినము(63)

శివుడు ఎట్లో, నీవు అట్లే ఓ హరీ! శివుని శాసనముచే వేదములు ఇట్లు వర్ణించుచున్నవి (64) మేము అందరము శివుని ఆజ్ఞచే ఆయనను సేవించువారము. హే రమానాథా! నేను ఈ ఘర్షణకు అనురూపముగా మాత్రమే పలికియుంటిని, అయిననూ, నాయందు ఆదరమును చూపుము(65)

బ్రహ్మ వాచ|

ఆ అచ్యుతుడు ఆ వీరభద్రుని ఆ మాటను విని, చిరునవ్వు నవ్వి, వీరభద్రునితో ఈ మాటను పలికెను(66)

విష్ణువు ఇట్లు పలికెను

ఓమహావీరా! నీవు శంకను వీడి నాతో యుద్ధమును చేయుము. నేను నీ అస్త్రములచే శరీరమునిండిన తరువాత నీస్థానమునకు వెళ్లెదను(67)

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు ఇట్లు పలికి విరమించి యుద్ధమునకు సంసిద్ధుడు కాగా, మహాబలుడగు వీరభద్రుడు కూడ తన గణములతో గూడి యుద్దమునకు సన్నద్ధుడాయెను(68)

శ్రీ శివమహాపురాణములో రెండవది యగు రుద్ర సంహింతయందలి సతీఖండలో విష్ణు వీరభద్ర సంవాదమను ముప్పదిఆరవ అధ్యాయము ముగిసినది(36).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


15 Jan 2021

No comments:

Post a Comment