శ్రీ శివ మహా పురాణము - 367


🌹 . శ్రీ శివ మహా పురాణము - 367 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

96. అధ్యాయము - 08

🌻. నారద హిమాలయ సంవాదము - 2 🌻

కాన నీవు వివేకము గలవాడవై నీ కుమార్తె యగు శివాదేవిని శివునకు ఇచ్చి వివాహమును చేయుము. సర్వేశ్వరుడు, వికార రహితుడు, అవినాశి యగు శివప్రభుడు సేవించదగినవాడు (21). అ శివుడు తొందరగా ప్రసన్నుడగును. ఆయన ఈమెను తప్పక స్వీకరించగలడు. ఈ శివాదేవి తపస్సును చేసినచో, ఆయన విశేషించి అట్టి తపస్సుచే పొందదగిన వాడు అగును (22). ఆ శివుడు సర్వవిధములా అత్యంత సమర్థుడు, సర్వేశ్వరుడు, చెడు రాతను గూడ తుడచి పెట్టగలవాడు, బ్రహ్మ అధీనమునందు గలవాడు, మరియు ఆనందము నిచ్చువాడు (23).


బ్రహ్మ ఇట్లు పలికెను -

హే వత్సా !మహర్షీ !ఉత్కంఠను కలిగించువాడు, బ్రహ్మవేత్త అగు నీవు ఇట్లు పలికి, ఆ పర్వత రాజును శుభవచనములతో ఆనందింపజేయుచూ, మరల నిట్లంటివి (24).ఈమె శంభునకు పత్నియై, ఆయనకు సర్వదా అనుకూలవతియై, మహాపతివ్రతయై, గొప్ప నిష్ఠగలదియై తల్లిదండ్రుల సుఖమును వృద్ధిచేయగలదు (25).

ఈ తపస్విని శంభుని చిత్తమును తన వశము చేసుకొనగలదు. ఆయన కూడా ఈమెను తక్క మరియొక స్త్రీని వివాహమాడడు (26). వీరిద్దరు ప్రేమతో తుల్యమగు ప్రేమ ఏ ఇద్దరి మధ్యనైననూ భూతకాలములో లేదు ; వర్తమానకాలములో లేదు; భవిష్యత్తులో ఉండబోదు (27).

వీరిద్దరు చేయ దగిన దేవకార్యములు గలవు. ఓ పర్వత రాజా! వీరు మృతులనెందరినో జీపింప చేయవలసి యున్నది (28). ఓ పర్వతరాజా! శివుడు ఈ కన్యకు తన శరీరములోని అర్థభాగము నిచ్చి అర్ధనారీశ్వరుడు కాగలడు. మరియు వీరిద్దరి కలయిక మరల సర్వత్ర ఆనందమును కలిగించును (29).

ఈ నీ కుమార్తె శివుని శరీరము యొక్క అర్థ భాగమును తన అధీనము చేసుకొనగలదు. ఈమె తన తపశ్శక్తిచే సకలేశ్వరుడగు మహేశ్వరుని సంతోష పెట్ట గలదు (30). తపస్సుచే ఆ శివుని సంతోష పెట్టి ఈ నీ కుమార్తె బంగారము వలె, మెరుపు తీగవలె పచ్చని కాంతులతో శోభిల్ల గలదు (31). ఈ కన్య గౌరి యను పేరుతో ఖ్యాతిని గాంచగలదు. ఈమెను విష్ణువు, బ్రహ్మ మొదలగు వారితో గూడి దేవతా గణములన్నియూ పూజించగలరు (32).


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారద! దేవర్షీ! ఈ నీ మాటను విని, వాక్కులో నైపుణ్యముగల ఆ హిమవంతుడు నీతో నిట్లనెను (34).


హిమవంతుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! నారదా! నీవు ప్రజ్ఞా శాలివి. నేనొక విన్నపమును చేసెదను. దానిని నీవు ప్రీతితో విని, ఆపైన నాకు ఆనందమును కలుగు జేయుము (35). ఆ మహాదేవుడు సర్వ సంగపరిత్యాగి అనియు, ఆత్మ నిగ్రహము గలవాడనియు, నిత్యము తపస్సు చేయుచుండుననియు, దేవతలకు కూడా కానరాడనియు విని యుంటిని (36). ఓ దేవర్షీ! పరబ్రహ్మ యందు అర్పితమైన మనస్సు గల ఆ శివుడు ధ్యాన మార్గము నుండి చ్యుతుడగుట యెట్లు? ఈ విషయములో నాకు పెద్ద సంశయము గలదు (37).

వినాశము లేనిది, హృదయములో దీపశిఖవలె ప్రకాశించునది, సదాశివ నామధేయమము గలది, వికారములు లేనిది, పుట్టుక మరణము లేనది, నిర్గుణము గుణములకు అధిష్టానము, విశేషరహితము కామనాసంబంధము లేనిది అగు పరబ్రహ్మను ఆయన స్వస్వరూపముగా దర్శించును. ఆయన సర్వత్ర బ్రహ్మమునే దర్శించును గాన, ఆయనకు బాహ్య దృష్టి లేదు (38,39).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

No comments:

Post a Comment