భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జడమహర్షి - 2 🌻

7. అయితే, ఆ జీవుడు ఇతరులకు అన్నోదకములు భక్తితో పెట్టిన వాడయితే ఎటువంటి మరణవేదనా అనుభవించడు. తెలివిగా శరీరంలో ఉండగానే, జ్ఞానమార్గాన్ని, పుణ్యమార్గాన్ని అవలంబించినవాడయితే; అసూయారహితుడు, ధర్మం తప్పనివాడు, అధర్మంలో ఉన్నటువంటి కామాది వికారములు లేనివాడు, క్రోధం లేకుండా జీవించిన వాడు అయితే;

8. మాత్సర్య రహితుడైతే, మరణవేదన అనుభవించకుండానే పోతాడు. సుఖమయిన మృతిని పొందుతాడు. అన్నదానం చేయనివాడు, కూటసాక్షి, వేదదూషకుడు మొదలైన వాళ్ళకు భయంకరమైన యమకింకరులు దర్శనమిస్తారు. దాంతో విపరీతమయిన భయం కలుగుతుంది.

9. తనకు భయమేస్తోంది అని చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే జిహ్వ వెనక్కు వెళ్ళిపోతుంది. మాటరాదు. చూస్తూఉంటాడుకాని మాట్లాడలేడు. అటువంటి స్థితిలో వెళ్ళిపోతాడు. జీవులిలా యాతనాశరీరాలను పొంది చాలా బాధలు పడతారు అని ఇవన్నీ చెప్పి మరణవేదననూ వర్ణించాడు.

10. “మృత్యువుయొక్క స్థితి అల్ల ఉంటుంది. మృత్యువును గురించి ఎందుకు చెపుతున్నానంటే, జన్మ అంటే భయపడాల్సిన కారణాలున్నాయి. చనిపోయిన తరువాత, చావు అనేది ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకుని కూడా ప్రయోజనంలేదు. ఎందుకంటే అప్పుడు తెలుసుకున్నా తనకు పనికిరాదు. మళ్ళీ జన్మించేటప్పటికి ఈ మృత్యువేదన అనే కష్టాన్ని గురించి మరిచిపోతాడు.

11. ఇక వాడికేమి జ్ఞాపకం ఉంటుంది? వాడికి బోధ ఎలా కలుగుతుంది? మృత్యువాత పడ్డప్పుడు, ‘అయిపోయింది! ఇంకేప్పుడూ ఈ జన్మకు రాను, ఇక నాకు పునర్జన్మ వద్దు!’ అని అప్పుడు అనిపిస్తుంది. కాని అది స్మృతిపథంలోంచి మరుగైపోతుంది. మళ్ళీ జన్మించేటప్పటికి చావుని గురించి ఎరుగని వాడివలెనే ఉంటాడు” అని చెప్పాడు జడమహర్షి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

No comments:

Post a Comment