✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 34. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2🌻
భౌగోళికముగా జాతి శ్రేయస్సునకై నిర్విరామముగా కృషి చేయుచున్న ఒక మహాత్ముని పిలుచుటయనగా అది ఎంతయో అవసరమున్న సన్నివేశమై యుండవలెనే గానీ, మరొకటి కారాదు.
వ్యక్తిగతముగ నా జీవిత సమస్యలను గూర్చి నేనెన్నడూ నా గురుదేవుని ఆవాహనము చేయలేదు. సంఘ శ్రేయస్సు కార్యక్రమము నందు అత్యంత క్లిష్ట పరిస్థితి యేర్పడి నప్పుడు మాత్రమే చాలా అరుదుగా ఆయనను నేను ఆవాహనము చేయు చుండెడి దానను. ప్రస్తుతము నేనున్నది నా దృష్టిలో క్లిష్ట పరిస్థితే.
ఒక అపరిచిత వ్యక్తి అశరీరుడై నాతో సంభాషించు చుండెను. సనాతన వాజ్మయమును ప్రపంచమున కందించుటకు సహకార మర్ధించు చుండెను. అతడు అందించిన మొదటి గ్రంథము అద్భుతముగా నున్నదని కొందరు మిత్రులు ప్రశంసించినారు.
మరికొందరు నా స్థితిని ఒక పూనకపు స్థితిగా, ఏదియో భూతము నన్నావరించి వాడుకొనుచున్నదనియూ, అనతి కాలములో నాకు పిచ్చిపట్టుట కాని, లేదా తీవ్రమైన అనారోగ్యము కలుగుటకాని స్పష్టముగా తెలుపుచున్నారు. రెండవ తరగతివారి అభిప్రాయము నన్ను కలవర పెట్టుచున్నది.
అశరీర మహాపురుషుడు నన్ను బలవంతపెట్టక నిర్ణయమును నాకే వదలినాడు. అతడు నా కిచ్చుచున్నది. ఒక సువర్ణావకాశమో లేక నేనొక బ్రాంతి దర్శనమునకు లోబడి నన్ను నేను పతనము గావించుకొనుచుంటినో నా కవగాహన యగుటలేదు.
అట్టి తీవ్రమైన మనో సంక్షోభమున నా గురుదేవుని ఆవాహనము చేయుటకు నిర్ణయించుకొంటిని. భక్తిపూర్వకముగా వారి దర్శనమునకై ప్రార్థన చేసితిని. నా గురుదేవులు అనతికాలముననే తమ సాన్నిధ్యము ననుగ్రహించి యిట్లనిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Mar 2021
No comments:
Post a Comment