కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 76

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 76 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ


*🌻. ఆత్మను తెలుసుకొను విధము -06 🌻*

‘స ఆత్మ’ - ‘ఆత్మా అపరిచ్ఛిన్నః’ - అపరిచ్ఛిన్నః - ఏకముగా ఉన్నది. ఇదంతా అనేకముగా నీకు కనబడుతు వున్నదే తప్ప, వాస్తవమునకు తాత్వికముగా ఏకముగానే ఉన్నది. ఇంత మంది లేరు. ఇంత సృష్టి లేదు. ఇన్ని నక్షత్రాలు లేవు. ఇన్ని గెలాక్సీలు లేవు. ఇంత విశ్వకుటుంబం లేదు. ఇదంతా కలిపి ఒకే ఒక ఆత్మ. స ఆత్మ. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మకు, కదలడానికి అవకాశం ఉందా? అంటే లేదట. అంతటా ఉన్నది అన్నప్పుడు ఇక కదలడానికి ఎట్లా ఉంటుంది?

        మీ ఇంటి యందు అంతటా గాలి ఉన్నదా? లేదా? ఉన్నది. మరి గాలి కదలడానికి అవకాశమున్నదా? గాలి ఆల్రెడీ కదులుతూనే ఉందిగా అంటావు, కానీ ఆ గాలి ఆకాశమనే ప్రదేశములో కదులుతుంది. మరి ఆకాశం కదలటానికి ఉందా అంటే, ఆకాశానికి కదిలే అవకాశం లేదు. ఎందుకని? 

అంతటా ఉన్నది కాబట్టి అనేటటుంటి సాదృశ్యంగా చెబుతున్నారే కానీ, ఆకాశమును ‘ఆత్మ’ అనుటకు వీలులేదు. కారణం ఏమిటంటే, వాతావరణం ఎంత మేరకు భూమి చుట్టూతా వ్యాపించి ఉన్నదో, అంతమేరకే ఆకాశం అంటున్నాం మనం. దాని అవతల ఉన్నదానిని అంతరిక్షం అంటున్నారు. మరి అదంతా కూడా విశ్వవ్యాపకంగా ఉన్నదిగా! కాబట్టి, ఆకాశమును ‘ఆత్మ’ అనరాదు.

         కానీ ‘తద్దూరే గతి, తన్నైజతి’ - ఎంత దూరం వెళ్ళగలదయ్యా అంటే, అనంత విశ్వం వ్యాపకం ఎంత దూరం అయితే ఉందో, అన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకూ కూడా వ్యాపించి ఉన్నది. ‘తన్నైజతి’ - ఎక్కడికి కదలదయ్యా! ఎంతగా కదలదయ్యా అంటే, కదలడానికి అవకాశమే లేనంతగా, లేనటువంటి స్థాణువుగా ఉన్నది. ఈ రెండు లక్షణాలు ఒకచోటే ఉన్నయట. అది ఆత్మను వివరించేటటువంటి విధానము. అది అపరిచ్ఛిన్నము, అచలము. కదులుటకు అవకాశం వున్నది, కదలనిది. ఆత్మ దూరము పోతున్నట్లుగా కనబడుతున్నది. 

అత్యంత దూరముగా, విశాలంగా, ఎంతో దూరంగా ఉన్నట్లు కనబడుతోంది కానీ, అసలే కదలనిది కూడా అదే! ఈ రకంగా ఆత్మ ఆనందము, ఏక కాలంలో ఆనంద రహిత్యము కూడా అయివున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటిడి. ఆనంద అభావము, ఆనంద భావము. ఆనంద అభావము కూడా అయివున్నది. ఏకకాలంలో భావాభావ వివర్జితమై ఉన్నది. ఏకకాలంలో భావ అభావ వివర్జితమై ఉన్నది. ఈ రకమైనటువంటి స్థితి భేదములతో ఆత్మలక్షణాలను వివరించడం జరుగుతున్నది.

        ఏమండీ, ఇట్లా మాటగా చెప్తే తెలిసిపోతుందా? తెలియదు. నీవు ఈ స్థితులన్నీ అనుభూతి పూర్వకంగా నిర్ణయింప చేసుకోవాలి. ‘ఆనంద భావం’ - అంటే ఏమిటో తెలియాలి. ‘ఆనంద అభావం’ - అంటే ఏమిటో తెలియాలి. ‘భావ అభావ వర్జితం’ - అంటే ఏమిటో తెలియాలి. ఈ రకంగా ఆత్మ నాకంటే వేరైనవాడెవడు తెలుసుకొనగలడు. అంటే, అంతటా ఉన్నది, నీ లోపల కూడా ఉన్నది కదా, నీ బయటకూడా ఉన్నది కదా!

        కాబట్టి, అన్ని జీవుల కంటే, బుద్ధి వికాసము కలిగిన మానవుడు తప్ప, ఈ ఆత్మను మరొకరు గ్రహించలేరు. బుద్ధి వికాసము లేనటువంటి జీవులు, అసలే తెలుసుకోలేవు. బుద్ధి వికాసము కలిగిన మానవుడు ఒక్కడు మాత్రమే బుద్ధి యొక్క గుహయందు, హృదయాకాశ స్థితుడై, ఆనంద స్థితుడై, ఫలాపేక్ష రహితుడై నిష్కామకర్మ సహితుడై, ఆంతరిక యజ్ఞాన్ని చేసేవాడై, ఈ ఆనంద భావమును, ఈ ఆత్మానంద స్థితిని తెలుసుకొన గలుగుతున్నాడు. కాబట్టి, దీనిని ఏమన్నారు? అంతర్ముఖుడు. 

సదా అంతర్ముఖుడు, తన లోపలికి తాను తిరిగి ఉన్నవాడు. అందుకుని, తాబేలు ముడుచుకున్నప్పుడు, ఎట్లా అయితే డిప్పమాత్రమే కనబడి, తాబేలు కనబడదో, అట్లాంటివాడన్నమాట ‘అంతర్ముఖుడు’ అంటే! - విద్యా సాగర్ స్వామి  

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment