శ్రీ శివ మహా పురాణము - 249


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 249 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
57. అధ్యాయము - 12

*🌻. దక్షునకు వరము - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! నీకు శివతత్త్వము బాగుగా తెలియును. హే పుణ్యాత్మా! నీవు ఉమాశివుల హితకరమగు చరితమును చక్కగా చెప్పి, నా జన్మను పవిత్రము చేసితివి (1). 

దృఢముగా వ్రతనియమములను పాలించే దక్షుడు తపస్సును చేసి, దేవి నుండి ఏ వరమును పొందెను? ఆమె దక్షుని కుమార్తె ఎట్లు ఆయెను? ఈగాధను ఇప్పుడు చెప్పుము (2).

ఓ నారదా! మునులందరితో గూడి భక్తితో వినుము. నీవు ధన్యుడవు. దృఢవ్రతుడగు దక్షుడు తపమాచరించిన విధమును చెప్పెదను (3). 

బుద్ధిశాలి, గొప్ప సమర్థుడు అగు దక్షుడు నాచే ఆజ్ఞాపింపబడిన వాడై జగదంబయగు ఆ ఉమాదేవిని కుమార్తెగా పొందగోరి (4), 

క్షీర సముద్రము యొక్క ఉత్తర తీరమునందు ఉన్నవాడై, ఆ తల్లిని ప్రత్యక్షముగా దర్శించగోరి, ఆమెను హృదయములో నిశ్చలముగా భావన చేసి, తపస్సును చేయుటకు ఆరంభించెను (5). 

వ్రతమును దృఢముగా పాలించే దక్షుడు విజితేంద్రియుడై మూడు వేల దివ్య సంవత్సరములు నియమముతో తపస్సును చేసెను (6).

ఆతడు గాలిని భక్షించి ఇతర ఆహారము లేనివాడై, ఒకప్పుడు నీటిని మాత్రమే త్రాగి, మరియొకప్పుడు ఆకులను భక్షించి జగద్రూపిణియగు ఆ తల్లిని ధ్యానిస్తూ అన్ని సంవత్సరముల కాలమును గడిపెను (7). 

మంచి వ్రతనిష్ఠ గల ఆతడు అనేక నియమములతో తపోనిష్ఠుడై ప్రతిదినము చిరకాలము దుర్గను ధ్యానించుచూ, ఆ దేవిని ఆరాధించెను (8). 

ఓ మహర్షీ! అపుడు యమనియమాదులతో గూడి జగన్మాతను పూజించుచున్న దక్షునకు ఆ ఉమాదేవి ప్రత్యక్షమయ్యెను (9). 

దక్ష ప్రజాపతి జగద్రూపిణియగు జగదంబను ప్రత్యక్షముగా చూసి తన జన్మ చరితార్థమైనదని తలంచెను (10).

సింహమునధిష్ఠించినది, నల్లని వర్ణము గలది, సుందరమగు ముఖము గలది, నాల్గు చేతులు గలది, వరముద్ర అభయముద్ర నల్లని కలువ మరియు ఖడ్గము అను వాటిని నాల్గు హస్తములలో ధరించి రమ్మయముగా నున్నది (11). 

ఎర్రని నేత్రములు గలది, వ్రేలాడుచున్న అందమగు శిరోజములు గలది, గొప్ప కాంతి గలది అగు ఆ జగన్మాతను నమస్కరించి ఆతుడు చిత్రములగు వాక్కులతో స్తుతించెను (12).దక్షుడిట్లు పలికెను -

ఓ జగన్మాతా! మహామాయా! జగత్పాలనీ! మహేశ్వరీ! నీకు నమస్కారము. నీవు నాపైదయచూపి నాకు ప్రత్యక్షమైతివి (13). 

ఓ ఆదిభగవతీ! దయ చూపుము. శివస్వరూపిణీ! ప్రసన్నురాలవు కమ్ము. భక్తులకు వరములనిచ్చు ఓ తల్లీ! అనుగ్రహించుము ఓ జగన్మాయా! నీకు నమస్కారమగు గాక! (14).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దక్షుడు దేవియందు లగ్నమైన మనస్సు గలవాడై ఇట్లు ప్రార్ధించగా, ఆ మహేశ్వరి ఆతని కోరిక తెలిసి ఉండియూ, దక్షునితో నిట్లనెను (15).

దేవి ఇట్లు పలికెను -

హే దక్షా! నీ మంచి భక్తిచే నేను మిక్కిలి సంతసించితిని. నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నీకు ఈయదగని వరము లేదు (16).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్ష ప్రజాపతి జగన్మాత యొక్క పలుకులను విని, మిక్కిలి సంతసించిన వాడై, ఆ ఉమాదేవికి అనేక పర్యాయములు నమస్కరించి ఇట్లు పలికెను (17).

దక్షుడు ఇట్లు పలికెను -

హే జగన్మాతా! మహామాయవునీవే. నీవు నాకు వరమీయ దలచినచో, ప్రీతితో నా మాటను విని, నా కోరిన వరమును ఇమ్ము (18). 

నా ప్రభువగు శివ పరమాత్మ పూర్ణావతారుడై రుద్రుడు అను పేరుతో బ్రహ్మకు కుమారుడై జన్మించెను (19). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment