*🍀 14. సదాచరణ - సదాచరణమే అత్యుత్తమ బోధ. జ్ఞానబోధ చేయుటకన్నా జ్ఞానులు తామాచరించుచు, నేర్పుతో ఇతరులతో ఆచరింప చేయవలెను. 🍀*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. కర్మయోగము - 26 📚*
న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్ |
జోషయే త్సర్వకర్మాణి విద్వా న్యుక్త సమాచరన్ II 26
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ :
సదాచరణమే అత్యుత్తమ బోధ. సామాన్యముగా జీవులు అజ్ఞానముచే కర్మ లాచరించు చుందురు. వారు ఫలాసక్తి గలవారు. చంచలబుద్ధి కలవారు. వారికనేకానేక సద్విషయములను బోధించినచో బుద్ధియందు తికమక కలుగును.
అజ్ఞానులకు జ్ఞానబోధ చేయుటకన్నా జ్ఞానులు తామాచరించుచు, వారలచే నేర్పుతో ఆచరింపచేయవలెను.
ఆచరించిన దానిని చూచి అట్లే ఆచరించుట అల్పబుద్ధులకు సులభము. తామాచరింపక చేయు సద్బోధలను అల్పజ్ఞానులగు శ్రోతలు తమకు తోచిన విధముగా నాచరింతురు.
సామాన్యముగా చేసిన బోధ వినువారలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగ వినిపించును, అనిపించును. ఒకే విషయము వైవిధ్యముగ ప్రకాశించును.
పాత్ర పవిత్రతను బట్టి పదార్థము రుచి మారునట్లు శ్రోత చిత్తశుద్ధిని బట్టి, విషయములవగాహన యగును. అందుచేత విని యాచరించుట కష్టము. ఆచరించిన దానిని చూచి, అట్లే ఆచరించుట సులభము. సాధన లేని బోధన బాధను మిగుల్చును.
కావున సిద్ధుడు తానాచరించుచు, ఇతరులచే అట్లాచరింపచేయుట శ్రేష్ఠము. అనుయాయులు కూడ, ఆచరించు వారిని అనుసరించుట క్షేమము. (3-26)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment