✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 16. కర్తవ్యము - సత్వగుణమున నిలచిన వానికే సంకల్పములు యుండవు, కోరికలు యుండవు. కర్తవ్యములు మాత్రమే యుండును. కర్తవ్యము మాత్రమే నిర్వర్తించువానికి, కర్మ దగ్ధమగు చుండును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 19 📚
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || 19
కర్మ నిర్వహణమునందు వ్యక్తిగతమైన సంకల్పము, కోరిక యుండుట సామాన్యము. తననుండి ఆరంభము కాకయే తన వరకు కొన్ని కర్తవ్య కర్మలు వచ్చుచుండును. అవికాక తనవైన కోరికలు కొన్ని యుండును. పండితుడు అనగా తెలిసిన వాడని యర్థము.
తెలిసినవాడు అనగా జ్ఞాని. అతనికి కోరికలుండవు. వ్యక్తిగతములైన సంకల్పము లుండవు. రెండునూ లేక ఆచరణయే యుండును. ఇట్టివారినే పెద్దలు పండితులుగా గుర్తింతురు. రజోగుణ ప్రేరితునకు, తమోగుణ ప్రేరితునకు కోరికలు మెండుగ నుండును. తదనుగుణముగ సంకల్పములు వచ్చు చుండును. సత్వగుణమున నిలచిన వానికే సంకల్పములు యుండవు, కోరికలు యుండవు. కర్తవ్యములు మాత్రమే యుండును.
కర్తవ్యము మాత్రమే నిర్వర్తించువానికి, కర్మ దగ్ధమగు చుండును. కోరికలున్నచోట ఫలాసక్తి యుండును. కర్మ ఫలానుభూతి మరల కర్మను కలిగించును. అవి సంకల్ప రూపమున జీవుని ప్రేరేపించును. సంకల్ప ప్రేరితుడై ఫలాసక్తితో మరల జీవుడు పనిచేయును.
ఇట్లు కోరికనుండి ఫలాసక్తి కారణముగా కర్మ పుట్టును. కర్మ కారణముగా కర్మఫలము కలుగును. కర్మఫలము నుండి నూతన సంకల్పము పుట్టును. జీవిత మంతయు “ఇది కావలెను, యిది వద్దు" అనుకొనుచు ఎడతెరపి లేక జీవించుట యుండును. అపుడు కర్మయందు చిక్కుపడును.
కర్మమంటక, అందు చిక్కుపడక, కర్మను నిర్వర్తించుటకు ఉపాయమే శ్లోకమున తెలుపబడినది. ఈ సుళువు తెలియుటకే శ్రీరాముని జీవితము, శ్రీకృష్ణుని జీవితము పఠించి, అవగాహన చేసుకొనవలెను. అందులకే రామాయణ, భారత, భాగవతములు.
ఉదాహరణకు శ్రీరాముని జీవితమును పరిశీలింపుడు. అతడు తన కోరిక కారణముగ పుట్టలేదు. దశరథుని ప్రార్థనకు ప్రతిస్పందించి, జన్మించినాడు. వశిష్ఠుని వద్ద తండ్రి ఆజ్ఞగ విద్య నేర్చినాడు. విశ్వామిత్రునితో తండ్రి ఆజ్ఞగనే చనినాడు. తాటక సంహారము విశ్వామిత్రుని యాజ్ఞ. మిథిలానగర ప్రవేశము కూడ మహర్షి ఆదేశమే. విల్లు నెక్కు పెట్టుట మహర్షి ఆదేశము. సీతా పరిణయము జనకుని ప్రార్థన. పట్టాభిషేకము తండ్రి సంకల్పము.
వనవాసము ప్రత్యక్షముగా సవతి తల్లి ఆజ్ఞ. పరోక్షముగా తండ్రిమాట. దండకవన ప్రవేశము ఋషుల కోరిక. ఖరదూషణ సంహారము రాక్షసుల ప్రేరణ. సుగ్రీవుని స్నేహము కబంధుని సూచన. రాక్షస సంహారము ఋషుల సూచన. సీతా లక్ష్మణులను రక్షించుకొనుట కర్తవ్యము. భరతుని అనుగ్రహించుట కర్తవ్యము. పట్టాభిషేకము భరతుని కోరిక.
ఇట్లు జీవితమంతయు కర్తవ్యపరముగనే సాగినది గాని వ్యక్తిగతమగు కోరిక ఒక్కటియునూ లేదు. బంగారు లేడిని గూడ సీత కోరినదే గాని, తనది కాదు. జ్ఞానులెట్లు నడువవలెనో రాముని జీవితము సూటిగ తెలియజెప్పును. అట్టివారికి ఉన్న కర్మ దగ్ధమగును. కొత్త కర్మ పుట్టదు.
దీనికి వలసిన సూత్రము కర్తవ్యాచరణము. అందు వ్యక్తిగతమగు కోరిక, సంకల్పము లేకుండుట. ఇట్లు జీవించుట అసామాన్యము. అట్లు జీవించి, యితరులకు మార్గదర్శకులై నిలచువారు ఆచార్యులు లేక సద్గురువులు లేక జ్ఞానులు. వారు జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2020
No comments:
Post a Comment