శ్రీ శివ మహా పురాణము - 275


🌹 . శ్రీ శివ మహా పురాణము - 275 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

65. అధ్యాయము - 20

🌻. సతి కైలాసమునకు పయనమగుట - 2 🌻


నీరేతస్సు నాల్గు బిందువులు భూమిపై పడినవి గాన, ఆకాశమునందు ప్రలయమును సృష్టించగల నాల్గు మేఘములు పుట్టును (22). వెంటనే అచట దేవతలు, ఋషులు చూచు చుండగా ఆ రేతస్సు నుండి నాల్గు మేఘములు పుట్టినవి (23).

వత్సా! సంవర్తకము, ఆవర్తము, పుష్పకము, ద్రోణము అనే ఈ నాల్గు మహామేఘములు ప్రలయమును కలిగించును (24). ఓ మహర్షీ! అమంగళ గర్జనను చేయు ఆ మేఘములు అపుడు శివుని ఇచ్ఛచే కొద్ది జలమును వర్షించుచూ, గర్జించుచూ ఆకాశమునందు విస్తరించినవి (25).

ఆకాశమంతయూ పెద్దగా గర్జించుచున్న ఆ మేఘములచే కప్పివేయబడెను. అపుడు దాక్షాయణీ దేవి, మరియు శంకరుడు శాసింసగా వెంటనే పూర్ణమగు శాంతి నెలకొనెను (26). అపుడు నేను తొలగిన భయము కలవాడనైతిని. ఓ మహర్షీ! నేను శంకరుని ఆజ్ఞచే అపుడు మిగిలిన వివాహకర్మను పూర్తి చేయించితిని (27).

సతీశివుల శిరస్సుపై, మరియు సర్వత్రా దేవగణములచే విడువ బడిన పుష్పవృష్టి కురిసెను. ఓ మహర్షీ! దేవతలందరు ఆనందించిరి (28). వారు వాద్యములను వాయించుచూ, పాటలను పాడిరి. భక్తితో కూడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు వేదములను పఠించిరి (29).

ఓ నారదా! రంభాద్యప్సరసలు శ్రద్ధతో నాట్యము చేయుచుండగా దేవతల భార్యలు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి (30). అపుడు యజ్ఞాది కర్మలకు ప్రభువగు పరమేశ్వరుడు ప్రసన్నుడై, లోకపు పోకడను ఆశ్రయించి ప్రీతితో అంజలి ఒగ్గి నాతో నిట్లనెను (31).

ఈశ్వరుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! వివాహకర్మను అంతనూ ఆచార్యుడవగు నీవు చక్కగా నిర్వహించితివి. నేను ప్రసన్నుడనైతిని. నేను నీకు ఏ దక్షిణను ఈయవలెను? (32). నీవు దేవతలలో జ్యేష్ఠుడవు. దక్షిణను కోరుకొనుము. మహాత్మా! వెంటనే చెప్పుము. మిక్కిలి దుర్లభమైమ దక్షిణనైననూ ఈయగలను. నేను ఈయలేనిది లేనే లేదు (33).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శంకరుని ఈ మాటలను విని, నేను దోసిలి యొగ్గి, అనేక పర్యాయములు ఈశునకు ప్రణమిల్లి, వినయముతో కూడిన మనస్సు గలవాడనై ఇట్లు పలికితిని (34). ఓ దేవదేవా! నీవు ప్రసన్నుడవైనచో, నేను వరమునకు అర్హుడనైన చో, ఓ మహేశ్వరా! నేను చెప్ప బోవు కార్యమును నీవు ప్రీతితో చేయుము (35).

మహేశ్వరా! నీవు ఇదే రూపముతో ఈ వేది యందు ఇక్కడ సర్వదా ఉన్నవాడవై మానవుల పాపములను పోగొట్టి పవిత్రులను చేయుము (36). ఓ చంద్రశేఖరా! నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమమును నిర్మించుకొని నేను చేసిన ఈ పాపమును నివారించు కొనుటకై తపస్సు చేసెదను (37).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




18 Nov 2020

No comments:

Post a Comment