🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జాబాలిమహర్షి - 3 🌻
19. పిప్పలాదమహర్షి, బ్రహ్మజ్ఞానీయిన జాబాలిని పరతత్వరహస్యాన్ని బోధించమని అడిగినప్పుడు ఆయనతో జాబాలి ఇలా చెప్పెను:
పిప్పలాదుడు: నీవు ఎవరివలన తెలుసుకున్నావు?
జాబాలి: సుబ్రహ్మణ్యస్వామి వలన తెలుసుకున్నాను.
పిప్పలాదుడు: సుబ్రహ్మణ్యస్వామి ఎవరివలన తెలుసుకున్నాడు?
జాబాలి: ఈశ్వరుడు సర్వేశ్వరుడు అయిన ఈశానుడివలన తెలుసు కున్నాడు.
పిప్పలాదుడు: ఈశానుడి వలన ఏ విధంగా తెలుసుకున్నాడు?
జాబాలి: ఈశానోపాసనమువలన తెలుసుకున్నాడు.
పిప్పలాదుడు: భగవన్! దయతో నాకు ఆ విషయాన్నంతా చెప్పు. అంటే నీకు ఎవరు చెప్పారో అదొక్కటే కాదు. వాళ్ళకు ఎవరు చెప్పారో అతడిగురించి కూడా చెప్పు. ఈశానుడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా ఆరాధించాడో చెప్పు.
జాబాలి: అట్లాగే! నీవడిగిన సకల విషయాలూ నివేదిస్తాను. పశుపతి అయిన ఈశ్వరుడు అహంకారముచేత వ్యాపించబడి ఉన్నాప్పుడు, అతడిని సంసారియైన జీవుడంటారు. ఈ జీవుడే పశువు. ఈ జీవులకు అధిపతి కాబట్టి ఈశ్వరుడిని పశుపతి అని అంటారు.
సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనబడేవి ఆయనయొక్క పంచకృత్యములనబడతవి. ఆ సర్వేశ్వరుడియందే అవి అన్నీ ఉన్నవి. అతడే సృష్టికర్త, లయకర్త. సర్వేశ్వరుడయిన ఆ ఈశ్వరుడినే పశుపతి అంటారు. జీవులందరికీ, అతడితో పోల్చినపుడు, పశువులనే నామం సార్థకమవుతుంది.
పిప్పలాదుడు: జీవులు పశువులెల్లా అవుతాయి. వానికి ఈశ్వరుడు పతి ఎట్లా అవుతాడు?
జాబాలి: గడ్డి తింటూ వివేకం లేక ఇతరుల చేత పనికి ప్రేరేపింపబడి అనేకమయిన కష్టాలను సహిస్తూ యజమాని చేతుల్లో పశువులు కట్టబడి (పాశబద్దులై) ఉండటంచేత పశువులనబడతవి. జీవులు సర్వేశ్వరుని మాయాజాలంచేత అట్లా ఉన్నవి.
ఆ పశువుల యజమానివలె సర్వజ్ఞుడైన ఈశ్వరుడున్నాడు. జీవులకు ఆయనే పతి. పాబట్టే ఆయనను పశుపతి అంటారు. ఈ జీవులు పశువులనబడతవి.
పిప్పలాదుడు: విభూతి ఎట్లా ధరించాలి? అన్నీ వివరంగా తెలుపండి.
జాబాలి: ‘సద్యోజాతాది’ పంచబ్రహ్మ మంత్రములచేత భస్మమును గ్రహించి ‘అగినిరితి భస్మ’ అనే మంత్రం చేత భస్మమును అభిమంత్రించాలి. ‘మానస్తోకే తనయే’ అనే మంత్రంలో అందులో జలాన్ని కలపాలి.
తరవాత శిరస్సు, లలాటము, వక్షము, భుజములు వీటియందు ‘త్య్రాయుషం జమదగ్నేః’ ‘త్య్రంబకం యజామహే’ అనే మంత్రములచేత అడ్డంగా మూడురేఖలు వచ్చేటట్లు విభూతి ధరించాలి. దీనిని శాంభవవ్రతము అని అంటారు.
(శైవులందరూ కూడా జబాల్యుపనిషన్మార్గమును అనుసరిస్తారు. నిత్యమూ ఆయన చెప్పినట్లే చేస్తారు. వివిధ రుద్రాక్షధారణ అంతా కూడా అలాగే జరుగుతుంది. జాబాలి శైవ మతంలో ప్రమాణం.)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2020
No comments:
Post a Comment