✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -36 🌻
అధవా వివేకం ఇంకా కొద్దిగా స్థాయికి పడిపోయింది, అప్పుడేమి చేయాలట? ‘అధమాధమంచ తీర్ధాటనం’ - ఒక కాశీనో, ఒక రామేశ్వరమో. ప్రతి సంవత్సరము మానవులందరూ ఒక సంవత్సర చక్రభ్రమణం పెట్టుకోండి. ఆ సంవత్సర చక్రభ్రమణంలో ఎక్కడికో ఒక చోటుకి, దేవాలయ దర్శనం, లేదా ఒక క్షేత్ర దర్శనం, ఆరామ దర్శనం. మీరు ఏదైనా పెట్టుకోండి.
ఏ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయులను దర్శించేటటువంటి పనిగా పెట్టుకోండి. నిజానికి మహానుభావులను, మహనీయులను, మహర్షులను, సందర్శించుటం కొరకే ఈ తీర్ధాటనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న, రామకృష్ణ మిషనో, ఒక చిన్మయా మిషనో, ఒక బ్రహ్మకుమారీ ఆశ్రమమో ఇట్లాంటి ఆశ్రమాలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి కదా! ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి.
ఆయా ఆశ్రమ సందర్శనకు వెళ్ళి, అక్కడున్నటువంటి మహానుభావుల యొక్క పరిచర్య చేసి, వారికి సేవ చేసి, చతుర్విధ శుశ్రూషలను ఆశ్రయించి, వారికి ఆ సేవలను అందించి, వారు మనకు చెప్పేటటువంటి ఉత్తమమైనటువంటి బోధను గ్రహించి, కనుక మనము వచ్చామనుకోండి, అది కూడా తీర్ధాటనమే! కాని మనము ఏమి చేస్తున్నాము? చకాచకా రిజర్వేషన్స్ చేయించుకోవడం, చకచకా పరుగెత్తడం, చకచకా కొండపైకి వెళ్ళడం, చకచకా గుండుకొట్టించుకోవడం, చకచకా లడ్డూ తీసుకోవడం, చకచకా తిరిగి వచ్చేయడం. అంతా 24 గంటలలో అయిపోతుంది.
కానీ, ఈ చకచకాలో ఎక్కడైనా స్థిరత్వం వచ్చిందా? మానసిక స్థిరత్వం కలిగిందా? స్థిరమైన బుద్ధి కలిగిందా? ప్రవృత్తి నుండి నివృత్తికి మారామా? నివృత్తి నుంచి మనమేమైనా ఎదిగామా? నిర్వాణ స్థితికి ఎదిగామా? ఆ దర్శన కాలంలో నువ్వు నిర్వాణ స్థితిలో ఉండేటటువంటి స్థితిలో ఉండాలి. అది దేవాలయ దర్శనమైనా కావచ్చు, సద్గురు దర్శనమైనా కావచ్చు. ఆ దర్శనం వల్ల నీకు నిర్వాణ స్థితి ప్రాప్తించాలి.
అప్పుడు మాత్రమే నీతో ఆ దర్శనాన్ని తెచ్చుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే ఆ దర్శనం నీతో నిలబడి ఉంటుంది. అప్పుడు మాత్రమే నీకు సూక్ష్మమైనటువంటి ప్రత్యగాత్మ స్థితిలో మెలకువ కలిగేటటువంటి అవకాశం వస్తుంది.
ఇప్పుడు మనమందరము హృదయస్థానంలో నిద్రపోతున్నాము. అందువల్ల ఏమైంది? మనము బుద్ధిని అధిగమించి, మహతత్వాన్ని ఆశ్రయించి, ఆ మహతత్త్వం కంటే అవ్యక్తము, ఆ అవ్యక్తం కంటే పరుడైనటువంటి ప్రత్యగాత్మ స్థితికి ఎదగలేకపోతున్నాము.
ఎప్పుడు పనిముట్ల దగ్గరే ఆగిపోతున్నాము. ఎంత ప్రయత్నం చేసినా మన శక్తి మనస్సు వరకో, బుద్ధి వరకో వెళ్ళి ఆగిపోతుంది. కానీ, గుణాతీతమైనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మహతత్త్వాన్ని, అవ్యక్తాన్ని దాటగలుగుతున్నావు.
కాబట్టి మానవులందరూ తప్పక చేయవలసినటువంటి సాధన సాక్షీ సాధన. ఈ సాక్షి సాధన ఎవరైతే చేస్తారో, వాడు తత్వచింతనే చేయనీయండి, మంత్ర జపమే చేయనీయండి, శాస్త్ర చింతనే చేయనీయండి, తీర్ధాటనమే చేయనీయండి ఏ సాధనలు చేసినప్పటికీ కూడా నువ్వు దానిలో నుంచీ సాక్షిత్వాన్ని రాబట్టుకుంటావు.
ఆ సర్వ సాక్షిత్వం దిశగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆ సాక్షిత్వ బలం చేత మాత్రమే, నువ్వు ఆ మహతత్వాన్ని, అవ్యక్తాన్ని దాటగలుగుతావు. ‘అధిగచ్ఛతి’ - అధిగమించగలుగుతావు.
సాక్షిత్వం లేకుండా మహతత్వాన్ని, అవ్యక్తాన్ని ఎవరూ దాటలేరు. ప్రత్యగాత్మ స్థితిని తెలుసుకొనలేరు. కాబట్టి, సర్వాంతర్యామి, అందరి, సమస్త జీవుల హృదయాలలో ‘హృద్దేశోర్జునతిష్ఠతి’ - పరమాత్మను అడిగాడు అర్జునుడు, నాయనా! నువ్వు ఎక్కడ ఉంటావు నిన్ను పట్టుకోవాలంటే? నాయనా! నువ్వు అక్కడా ఇక్కడా వెతకమాక!-
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2020
No comments:
Post a Comment