కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 166


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 166 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 96 🌻


ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో,

ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్‌ ఈశ్వరత్వం అంటున్నారు.

ఈశ్వరత్వం స్యాత్‌.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము.

ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.

కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు.

సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో,

ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును. ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటువంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము. చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనలనుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము.

మనోనిగ్రహోపాయము. మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి.- విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Jan 2021

No comments:

Post a Comment