దేవాపి మహర్షి బోధనలు - 6


🌹. దేవాపి మహర్షి బోధనలు - 6 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 2. సుదర్శన చక్రము - 3 🌻


భూమి చుట్టునూ చంద్రుడు తిరుగు చక్రము మూడవది. ఈ చక్రభ్రమణము వలననే భూమిపై జీవుల జనన మరణాదులు కలుగచున్నవి. ఋతువులు మున్నగునవి తెలియ బడుచున్నవి. ఆత్మ, బుద్ధి, మనస్సు అను మూడు వృత్తములుగ శరీరముల రూపమెత్తు నడక ఇది. దీనినే పైథాగరస్ మహాశయుడు వృత్తమున త్రిభుజముగ సంకేతించి తన శిష్యులకు మాత్రము రహస్యముగ ఉపదేశించెడివాడు.

భిన్న వేగములు గల సూర్యుడు, చంద్రుడు ఒకే భాగ (డిగ్రీ) మీద నుండినట్లు భూమికి కనిపించుట ఈ చక్రమున (భ్రాంతి చక్రమున) ఇరువది నాలుగు తావులందు జరుగును. వీనినే పర్వము లందురు. ఈ ఇరవై నాలుగు పర్వముల అండమే గాయత్రీ ఛందస్సు. దీనికి సూర్యుడు కేంద్రము. దీనినాక గానముగ తాళ లయాత్మకముగ కనుగొనగల్గుట గాయత్రి, దాని నడకతో తన కర్తవ్యమును గుర్తెరుగుట దీని యర్థము.

దీని రహస్యమును ఉద్బోధ చేయు 24 అక్షరముల వరుసయే గాయత్రి మంత్రము. ఈ విధముగ ఈ చక్రమునకు 24 కణుపులు (12 పూర్ణిమలు, 12 అమావాస్యలు). 12 అంచులు (12 మాసములు). దీనినే సూర్యుని 12 భావములుగా గుప్తవిద్య

వర్ణించును. 12 భాగములలో ఒక్కొక్క దానిలో 30 చొప్పున 360 అరలు ఈ చక్రమున కట్టబడి వున్నవి.

ఇట్లు చక్రమునకు, అండమునకు గల సంబంధము చర్చించబడినది. ఈ సంబంధము కనిపెట్టుట లోనే సర్వసృష్టి యొక్క కర్మఫల మార్గమున్నది.

ఈ చక్రమును ఆరుగురు కుమారులు త్రిప్పుచుందురట. వారే ఋతువులు. అచ్చట ధాత, విధాత అను రెండు శక్తులు, నల్లని, తెల్లని నూలు పోగులను (వెలుగును, చీకటిని) నేయుచుందురట, ఆవియే రాత్రింబవళ్లు. ఈ చక్ర వర్ణమున ఖగోళ రహస్యములన్నియు వివరింపబడెను.

దానినే జోతిష్ణోమ యజ్ఞమందురు. భారతమున ఉదంకుడు నాగలోకమునకు పోయిన సందర్భమున ఈ చక్రము వర్ణింపబడినది.

దీనినే సుదర్శన చక్రమందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Jan 2021

No comments:

Post a Comment