గీతోపనిషత్తు -127
🌹. గీతోపనిషత్తు -127 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 12
🍀. 10. నైష్ఠికులు - యోగయుక్తుడై నిష్ఠగ కర్మము నాచరించువాడు శాంతిని పొందును. యోగయుక్తుడు కానివాడు కర్మఫలముల యందాసక్తు డగుటచే, కోరికల రూపమున బంధింపబడు చున్నాడు. కర్మ మనగ కర్తవ్యకర్మ. కర్తవ్యము నిర్వర్తించవలసినదే. నిర్వర్తింప బడకుండుట కుదరదు. కర్తవ్యములు నిర్వర్తించుట, కోరికలను తీర్చుకొనుట ఒకటి కాదు. నిర్వర్తించ వలసినది కర్తవ్యమే గాని కోరికలు కాదు. కర్తవ్యములు కాని కర్మ కేవలము ఫలము లందాసక్తి వలననే చేయవలె ననిపించును. ఫలాసక్తియే కామము. 🍀
12. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామకారేణ ఫలే సక్ నిబధ్యతే || 12
యోగయుక్తుడై నిష్ఠగ కర్మము నాచరించువాడు శాంతిని పొందును. యోగయుక్తుడు కానివాడు కర్మఫలముల యందాసక్తు డగుటచే, కోరికల రూపమున బంధింపబడు చున్నాడు. దైవము కర్మాచరణము విషయమున అనేక పర్యాయములు విసుగు, విరామము లేక ప్రేమతో, ఆదరణతో, కరుణతో ఒకే సూత్రమును తెలుపుచున్నాడు.
ఇన్నిమార్లు చెప్పిన విషయమునే చెప్పుటయందు అతడెంత ఆత్మీయుడో మన మెరుగవలెను.
ఆత్మ బంధువులనిన యిట్టి వారే. తెలిపినదే మరల మరల తెలుపుచు, శ్రేయోమార్గము గుర్తు చేయుచు నుందురు. కర్మ మనగ కర్తవ్యకర్మ. కర్తవ్యము నిర్వర్తించవలసినదే. నిర్వర్తింప బడకుండుట కుదరదు. దప్పిక కలిగినపుడు నీరు త్రాగవలసినదే, ఆకలి కలిగినపుడు ఆహారము భుజింపవలసినదే. మరియొక మార్గము లేదు.
కర్తవ్యములు నిర్వర్తించుట, కోరికలను తీర్చుకొనుట ఒకటి కాదు. దప్పిక గొన్నపుడు నీరు త్రాగుట. ఆకలి కలిగినపుడు తగు మాత్రము భుజించుట కర్తవ్యము లగును. అవి కోరికలు కావు.
కర్తవ్యము లేవియో, కోరిక లేవియో ఎవరికి వారుగ తెలుసుకొన వచ్చును. ఈ విషయమున పెద్ద విద్య లక్కరలేదు. విచక్షణ చాలును. విచక్షణ లేనివానికి కర్తవ్యములు, కోరికలు కలగాపులగమై కోరికలే కర్తవ్యములుగ భ్రమ గొల్పును. ఇట్టి వారికి ఉప్పు కప్పురము ఒక్క మాదిరిగనే గోచరించును. పేడ-బెల్లము తేడా కూడ తెలియదు.
నిర్వర్తించ వలసినది కర్తవ్యమే గాని కోరికలు కాదు. కర్తవ్యములు కాని కర్మ కేవలము ఫలము లందాసక్తి వలననే చేయవలె ననిపించును. ఫలాసక్తియే కామము. కామము వలన ఫలాసక్తి ఈ రెండును బలిమిగ అల్లుకొని యుండును. ఇట్టివారికి కర్తవ్యమేమో తెలియదు. కర్తవ్యమునకు సౌకర్యము అసౌకర్యము, లాభము నష్టము, జయము అపజయము అనునవి అప్రధానములు.
ఉదాహరణకు గృహము నందెవ్వరికైన తీవ్ర అస్వస్థత ఏర్పడినపుడు నిద్రాహారములు మాని సేవచేయుదురు. సౌకర్యము కాదని మానరు కదా! అట్లే వివాహాది సందర్భములలో రాత్రి పగలు శ్రమపడుదురు.
సౌకర్యము కాదని మానరు కదా! ఎంత ఖర్చెనను, అప్పులు చేసియైనను పిల్లలను చదివింతురు. నష్టమని భావింపరు కదా. బాధ్యతాయుత కార్యములను నిర్వర్తించునపుడు జయాప జయములను చూడరు గదా! వైద్యుడు ఔషధము నిచ్చుట కర్తవ్యము. శస్త్ర చికిత్స చేయుట కూడ కర్తవ్యము. వ్యాధి తగ్గునో తగ్గదో అని భావించుచు మీన మేషములు లెక్క పెట్టడుగదా!
వ్యాధి నివారణముతో సంబంధములేక, వ్యాధి నిర్మూలనమునకు తనకు తెలిసిన విద్యను వినియోగించుటయే కర్తవ్యము. ఇది నిష్ఠ. అర్జునుడు యుద్ధమున గెలుతుమో లేదో అని కూడ పలికినాడు. జయాపజయములతో సంబంధము లేక, క్షత్రియుడు ధర్మరక్షణమునకు యుద్ధము చేయవలెనని దైవము తెలుపుచున్నాడు.
ఇట్లు కర్తవ్యమును నిర్వర్తించువారు దైవముతో యుక్తులై నిర్వర్తించుట వలన శాంతిని బొందుచున్నారు. ఇట్లుకాక కోరికలను ఫలములం దాసక్తితో నిర్వర్తించువారు యోగయుక్తులు కాకపోవుట వలన బంధింపబడు చున్నారు. వారి కర్మలే వారిని బంధించుచున్నవి.
నైష్ఠికులు శాంతిని పొందుదురు. ఇతరులు పొందలేరు. అనగా ఫలాసక్తి యందు తగులుకొనక కర్తవ్య కర్మల నాచరించువారే శాంతిని పొందెదరు. వారు నిష్ఠగలవారగుటచే నైష్ఠికులని తెలుపబడిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment