మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే? ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో )


🌹. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే? 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀

📚. ప్రసాద్‌ భరద్వాజ.


ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.

అలాగే మీరు తక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా అనుభూతి చెందుతూ మరింత స్వతంత్రులుగా ఉండేందుకు ప్రయత్నించండి.

గులాబీని చూసినప్పుడు, చందమామని చూసినప్పుడు అందరూ చెప్పినట్లుగానే మీరు కూడా ‘‘ఆహా! ఎంత చక్కగా ఉందో’’అనే చిలక పలుకులు ఎప్పుడూ చెప్పకండి. నిజంగా అలాంటి భావన మీ అంతరంగంలో కలిగితేనే చెప్పండి. లేకపోతే, అలా ఎప్పుడూ చెప్పకండి. ఎందుకంటే, మీరు మీ చిన్నప్పటి నుంచి ఇతరులు గులాబీ గురించి చెప్పిన అభిప్రాయాన్ని మాత్రమే వింటున్నారు.

ఇతరుల నుంచి ఎరువు తెచ్చుకున్న ఎందుకూ పనికిరాని పరమ చెత్త భావాలతో మీ మనసు తొంభైతొమ్మిది శాతం నిండిపోయిందని, మిగిలిన ఆ ఒక్క శాతం ఆ చెట్టులో కూరుకుపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ చెత్తను వదిలించుకుని, పోగొట్టుకున్న ఆ ఒక్క శాతం అంతరంగాన్ని తిరిగి రాబట్టుకోండి. ఎందుకంటే, దాని ద్వారానే మీకు ‘దేవుడు’ తెలుస్తాడు.

ఇంద్రియాలు ఆరు. వాటిలో పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం బాహ్యప్రపంచాన్ని తెలిపేవి కాగా, అంతర్వాణిని తెలిపే ఆరవ ఇంద్రియం (సిక్స్త్ సెన్స్) ‘జ్ఞానేంద్రియం’. అది మీ గురించి, అనంత దిగంతాల గురించి మీకు చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి, దానిని మీరు కనుక్కోవాలి. దానిని కనుక్కొనే సాధనమే ‘‘ధ్యానం’’.

ఇతరుల అభిప్రాయాలే ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనవి. మీరు గుంపుకు భయపడని వారైతే గొర్రె కానట్లే, సింహమైనట్లే. అప్పుడు మీరు చాలా గట్టిగా గాండ్రిస్తారు. అది మీరు పొందిన స్వేచ్ఛకు చిహ్నం. దానినే బుద్ధుడు ‘సింహగర్జన’ అన్నాడు.

పరమ నిశ్శబ్దస్థితికి చేరుకున్న వ్యక్తి ఎప్పుడూ సింహంలా గర్జిస్తాడు. ఎందుకంటే, ‘స్వేచ్ఛ’ అంటే ఏమిటో అతడు తొలిసారిగా తెలుసుకున్నాడు. అందుకే అతనిని ఇతరులు ఏమన్నా- సన్యాసి అన్నా, పాపి అన్నా- ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం భయపడకుండా గట్టిగా గర్జిస్తాడు.

దేవుడే మీకున్న ఏకైక న్యాయమూర్తి. అంతమాత్రాన మీకు ఒక వ్యక్తి ఎదురైనట్లు కాదు. దేవుడు ఒక వ్యక్తికాదు. ఈ మొత్తం విశ్వమే దేవుడు.

చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు- ఇలా మొత్తం విశ్వమంతా మీకు ఎదురవుతుంది. ఈ విశ్వమంతా మనదే. అందులోని భాగమే మనం. దానికి భయపడి మీరు దాక్కోవలసిన పనిలేదు. నిజానికి, ఎంత ప్రయత్నించినా మీరు ఆ పని చెయ్యలేరు. ఎందుకంటే, మీరు ఎక్కడ దాక్కున్నా విశ్వానికి తెలిసి పోతుంది. కాబట్టి, మీ గురించి మీకు తెలిసిన దానికన్నా ఈ విశ్వానికి చాలా తెలుసని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి.

గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్య విషయం ‘‘మీ మరణ శాసనాన్ని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడని. కాబట్టి, అది ఎప్పుడో భవిష్యత్తులో నిర్ణయించే విషయం కాదు. దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడే ఆ నిర్ణయం జరిగిపోయింది. అందుకే మృత్యుభయం తన తాజాదనాన్ని కోల్పోయింది.

కాబట్టి, మరణ శాసనం చివరి క్షణంలో జరుగుతుందనేది ఒక విషయమే కాదు. అందువల్ల దాని గురించి ఆలోచించ వలసిన, భయపడవలసిన పని లేదు. దేవుడికి మీరేమిటో తెలుసు. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. కాబట్టి, మీవల్ల ఏ తప్పు జరిగినా, మీరు దారి తప్పినా దానికి ఆయనే బాధ్యుడు కానీ, మీరు కాదు. ఎందుకంటే, మిమ్మల్ని మీరు సృష్టించుకోలేదు.

🌹 🌹 🌹 🌹 🌹


18 Jan 2021

No comments:

Post a Comment