శ్రీ శివ మహా పురాణము - 327


🌹 . శ్రీ శివ మహా పురాణము - 327 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

82. అధ్యాయము - 37

🌻. యజ్ఞ విధ్వంసము - 3 🌻


ఓ మహర్షీ! వత్సా! విష్ణువు యొక్క శార్‌ఙ్గ ధనస్సును ఆ వీరభద్రుడు మూడు బాణములతో కొట్టగా, అది క్షణములో మూడు ముక్కలాయెను(39) అపుడు విష్ణువును నేను, సరస్వతి దేవి హెచ్చిరించితిమి. మహా గణాధీశుడగు వీరభద్రుని పరాక్రమమును సహింపశక్యముకాదని ఎరింగి విష్ణువు అంతర్ధానమగుటకు నిశ్చయించు కొనెను(40)

సతి దేహమును త్యజించుట శివగణములకు సహింప శక్యము కాని ఘటన అనియు, ఈ సర్వనాశనము జరుగబోవుననియు ఎరింగిన దేవగణనాయకులు సర్వలోక ప్రభుడు, స్వతంత్రడునగు శివుని స్మరించి తమ గటనములతో గూడి తమతమలోకములకు వెళ్ళిరి(41).

నేను పుత్రశోకముతో పీడింపబడుతూ సత్యలోకమునకు వెళ్ళి మిక్కిలి దుఃఖముతో కూడినవాడనై 'ఇపుడు నాకర్తవ్యమేమి?' అని చింతిల్లితిని(42) విష్ణువు, నేను మరలిపోగానే మిగిలిన దేవతలను అందరిని, మరుయు యజ్ఞమే జీవనాధారముగాగల మునులను శివగణములు జయించినవి(43).

యజ్ఞపురుషుడు సంప్రాప్తమైన మహావిపత్తును ఎరింగి, మహా యజ్ఞము నాశనమగుటగాంచి, మిక్కిలి భీతిల్లి, మృగరూపముతో పరుగిడెను(44). మృగరూపముతో ఆకసము వైపునకు పరుగిడుతున్న ఆ యజ్ఞపురుషుని వీరభద్రుడు పట్టుకొని తలను నరికి వేసెను(45)

అపుడా వీరుడగు వీరభద్రుడు ధర్మ, కశ్యప్రజాపతులను, అనేక పుత్రులతో అసమర్ధుడై యున్న అరినేమిని(46) అంగిరస మహర్షిని, కృశాశ్వుని, దత్త మహర్షిని పట్టుకొని శిరస్సుపై పాదముతో తన్నెను(47) మహాగణాధ్యక్షడు, ప్రతాపశీలియగు వీరభద్రుడు దేవతలకు తల్లియగు సరస్వతి యొక్క ముక్కుకొనను చేతిలోని కత్తికొనతో కోసివేసెను(48)

ఆ వీరభద్రుడు క్రోథముచే ఎర్రనైన నేత్రములు గలవాడై, దేవతలు మొదలగు ఇతరులను చీల్చి నేల గూల్చెను(49) పగబట్టిన త్రాచుపాము వలె మిక్కిలి కోపమును పొందియున్న వీరభద్రుడు ముఖ్యులగు దేవతలను , మహర్షులను చీల్చి చెండాడిన తరువాతనైననూ శాంతించలేదు(50)

సింహము ఏనుగులను వలె శత్రువులను తరిమివేసిన వీరభద్రుడు 'ఎవడు ఎక్కడ దాగియున్నాడో!' అని ప్రతిక్షణము దిక్కులను పరికించు చుండెను(51) ఇంతలో ప్రతిపశీలియగు మణి భద్రుడు భృగువును నేలపై బడవేసి, కాలితో గండెలపై తొక్కిపెట్టి గెడ్డమును , మీసములను ఊడబెరికెను(52) దక్షుడు శివుని నిందించిన సమయములో పళ్ళుకనబడునట్లు బిగ్గరగా నవ్విన పూషన్‌ యొక్క దంతములను చండుడు వేగముగా పెరికివేసెను(53)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


18 Jan 2021

No comments:

Post a Comment