✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 5
🍀 5 - 2. ఆత్మోద్ధరణ - దేవుడు, జీవుడు, బుద్ధి, చిత్తము ఈ నాలుగు ప్రజ్ఞలుగ నున్నవాడు మానవుడు. సామన్య మానవుని చిత్తము బాహ్య ప్రపంచముతో ముడిపడి యుండును. బాహ్యమును దర్శించుటకు, అనుభూతి చెందుటకు పాంచభౌతిక శరీరమున్నది. స్వభావము బాహ్య ప్రపంచమందలి అనుభవముల ఆధారముగ గట్టిపడు చుండును. ఇష్టము, అయిష్టము, అభిప్రాయములు ఏర్పడి అవి సత్య మనిపించు చుండును. తాను, తన స్వభావము కాదని తెలియుటకు వలసిన బుద్ధి కూడ తన యందే యున్నది. బుద్ధిని వినియోగించినచో స్వభావము నుండి తాను విడిపడ వచ్చును. విచక్షణ బుద్ధి లక్షణమే. ఇట్లు అంతయు వ్యాపించిన ఒకే తత్త్వము గుణముల ద్వారా ప్రత్యేకమై, బుద్ధిని, స్వభావమును కలిగి యుండును. ఇట్లు ప్రజ్ఞ నాలుగు స్థితులలో మానవుని యందున్నది. అవి వరుసగా తనయందలి దైవము, తాను, తన బుద్ధి, తన స్వభావము. ఈ నాలుగు స్థితులలో నున్న ప్రజ్ఞనే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని కూడ తెలుపుదురు. 🍀
ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5
ఈ స్వభావము బాహ్య ప్రపంచమందలి అనుభవముల ఆధారముగ గట్టిపడు చుండును. ఇష్టము, అయిష్టము, అభిప్రాయములు ఏర్పడి అవి సత్య మనిపించు చుండును. తానేర్పరచుకున్న స్వభావములు కొన్ని సన్నివేశముల కారణముగ మారుచుండును. కొన్ని నమ్మకములు, కొన్ని సిద్ధాంతములు, కొంత మంచి చెడు అవగాహన కొంత అనుభవము అంతయును కలిపి తనదైన తెలివి యొకటి స్వభావము రూపమున ఏర్పడుచుండును.
తాను, తన స్వభావము కాదని తెలియుటకు వలసిన బుద్ధి కూడ తనయందే యున్నది. బుద్ధిని వినియోగించినచో స్వభావము నుండి తాను విడిపడ వచ్చును. విచక్షణ బుద్ధి లక్షణమే. ఇట్లు అంతయు వ్యాపించిన ఒకే తత్త్వము గుణముల ద్వారా ప్రత్యేకమై, బుద్ధిని, స్వభావమును కలిగి యుండును. ఇట్లు ప్రజ్ఞ నాలుగు స్థితులలో మానవుని యందున్నది. అవి వరుసగా తనయందలి దైవము, తాను, తన బుద్ధి, తన స్వభావము. ఈ నాలుగు స్థితులలో నున్న ప్రజ్ఞనే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని కూడ తెలుపుదురు.
ఈ నాలుగు స్థితులు చెందిన ప్రజ్ఞలో స్వభావమునందు యిమిడియున్న ప్రజ్ఞ బంధముల నేర్పరచుకొనును. పై తెలిపిన నాలుగు ప్రజ్ఞలు ఒకే ప్రజ్ఞ యొక్క స్థితి భేదములని తెలియవలెను. ఈ నాలుగు ప్రజ్ఞలనే రామాయణమున రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని కూడ వివరింతురు.
ఈ నాలుగు ప్రజ్ఞలనే సనక సనందనాది నలుగురు కుమారులుగ తెలుపుదురు. ఈ నాలుగు ప్రజ్ఞల ప్రభావమే నాలుగు యుగములలో పనిచేయు చుండును. వీనిని బట్టి జ్ఞానము నాలుగు రకములని, వర్ణాశ్రమములు నాలుగు రకములని, వేదములు నాలుగని కూడ తెలియజేయు చుందురు. ఈ నాలుగే సృష్టికి పునాది.
ఈ నాలుగును నాలుగు భుజములుగ కూడ కీర్తించినారు. నాలుగు భుజములుగల దేవత లందరును, ప్రజ్ఞయొక్క నాలుగు స్థితులు తెలిసినవారని అర్థము. మన దేవత లందరికిని నాలుగు భుజములు చిత్రీకరింతురు. మానవులకు రెండు భుజములే యున్నవి. అనగా అహంకారము, చిత్త ప్రవృత్తి మాత్రమే వారికి తెలియును. మానవులు మహాత్ములైనపుడు వారును చతుర్భుజులే. మానవుడు మహాత్ముడగుటకే యోగవిద్య. యోగవిద్యా వాజ్మయమునకు శ్రీ మద్భగవద్గీతయే మకుటము.
దేవుడు, జీవుడు, బుద్ధి, చిత్తము ఈ నాలుగు ప్రజ్ఞలుగ నున్నవాడు మానవుడు. సామన్య మానవుని చిత్తము బాహ్య ప్రపంచముతో ముడిపడి యుండును. బాహ్యమును దర్శించుటకు, అనుభూతి చెందుటకు పాంచభౌతిక శరీరమున్నది. అందు పంచ భూతములు (పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము), పంచ కర్మేంద్రియములు (చేతులు, కాళ్ళు, వాక్కు, గుదము, జననేంద్రియము), పంచ జ్ఞానేంద్రియములు (చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు), పంచతన్మాత్రలు (వినుట, స్పర్శ తెలియుట, చూచుట, రుచి తెలియుట, వాసన తెలియుట), పంచ ప్రాణములు (ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము).
ప్రజ్ఞ పరముగ మానవుడు నాలుగు స్థితులుగ ఉన్నాడు. అతని దేహము ఐదు స్థితులలో నున్నది. దేహమునకు, జీవునకు సంబంధము, ప్రజ్ఞ నాలుగవ స్థితిలో నేర్పడును (చిత్తము). చిత్తము నాలుగవది. అదియే ప్రవృత్తిలోనికి అనగా బాహ్య ప్రపంచము లోనికి జీవుడు ప్రవేశించుటకు వీలు కలిగించును. అంతరంగమున నున్న దైవప్రజ్ఞ జీవప్రజ్ఞ, బుద్ధి, చిత్తముల ద్వారా వ్యక్తమగు చుండును. ఈ నాలుగింటిని అంతఃకరణము లందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2021
No comments:
Post a Comment