దేవాపి మహర్షి బోధనలు - 37
🌹. దేవాపి మహర్షి బోధనలు - 37 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 27. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻
అది 1895 వ సంవత్సరం జూన్ 30 తేదీ, నా జీవితమున అది మరపురాని రోజు. జన్మజన్మలకూ గుర్తుండేడి రోజు. నా కపుడు 15 సంవత్సరాలు. యవ్వనము తికమక పెట్టు సమయమది. ఎందరో పిల్లలు జీవితమున ఉత్సాహముతో పరుగులెత్తు చుండగా, పగలూ రాత్రి తేడా తెలియని చిలిపితనముతో, పిల్లచేష్టలతో జీవించు వయస్సు. కానీ, నా కప్పటికీ జీవితముపై విరక్తి పూర్తిగా ఉండెడిది.
నా జీవితము వృధా యను భావన అనునిత్యమూ వేధిస్తూ వుండేది. ఆ వయస్సునకే నాకు తలమునకలు వేయు సమస్యలు, ఎటు చూచిననూ దుఃఖము ఆవరించి యుండేది. నేనీ ప్రపంచములోనికి రావాలని ఎప్పుడూ కోరుకొనలేదని, అయిననూ కొనిరాబడితినని భావించేదానను. నన్నెవరూ ప్రేమించేవారు కారు. నేను కూడా అంతే.
అందరి యందూ తెలియని కోపము, ద్వేషము, చిరాకు వుండేవి. నాకుగా నేను చిక్కులు వేసుకొనుటలో ఉత్తమశ్రేణి నిపుణత కలిగినదానను నేను. భావి జీవితమును భావించినపుడల్లా భయమావరించెడిది. పెళ్ళి, పిల్లలూ, సంఘమున పరపతి, గౌరవము, వాని కొరకై జీవించుట నాకు యాంత్రికముగా తోచెడివి.
క్రైస్తవమతము కూడా సంకుచితమైన బోధలు కలిగి నా హృదయావేదనకు పరిష్కారము చూపలేక పోయినది. నరకమును తెలిపి బెదిరించుటయే ప్రధానముగా వారి బోధన సాగుచుండెడిది. క్రతువులు- మతబోధనలు చెవులలో గింగిరు లెత్తుచుండెడివి.
నాకు జీవితమంతయూ అయోమయముగ నుండెడిది. నా చుట్టునూ దట్టమైన పొగమంచు ఏర్పడి, ఏమీ కనపడని, ఏమీ వినపడని ఒంటరినై జీవించుచుండెడి దానను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment