రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
91. అధ్యాయము - 03
🌻. దేవీస్తుతి - 1 🌻
నారదడిట్లు పలికెను-
ఓ బ్రహ్మా ! నీవు ప్రాజ్ఞుడువు, మహాధీమంతుడవు. వక్తలలో శ్రేష్ఠుడవు. విష్ణువు సద్గురువుగా గలవాడవు. తరువాత జరిగిన వృత్తాంతమును నాకు చెప్పుము(1) శుభకరము, అద్భుతము అగు ఈ మేనకా పూర్వచరిత్రను చెప్పి యుంటిని ఆమె వివామమును గురించి కూడ వింటిని. తరువాత చరితమును చెప్పుము(2) ఆ హిమవంతుడు మేనను వివాహమాడిన పిదప ఏమి చేసెను? ఆమె యందు జగన్మాత యగు పార్వతి జన్మించి వృత్తాంతమెట్టిది?(3) తరువాత ఆమె దుష్కరమగు తపస్సును చేసి శివుని పొందిన తీరు ఎట్టిది? శివుని యశస్సును వర్ణించే ఈ వృత్తాంము నంతనూ విస్తరముగా చెప్పుము(4)
బ్రహ్మ ఇట్లు పలికెను
ఓ మహర్షీ! శంకరుని శుభకరమగు పుణ్యకీర్తిని మిక్కిలి ప్రీతితో వినుము. ఈ కీర్తిని విన్నచో బ్రహ్మ హత్య చేసివాడైననూ పవిత్రుడై సమస్త కామనలను పొందును(5) ఓ నారదా! మేన హిమవంతుని వివాహమాడి ఆయన గృహమునకు వెళ్ళినప్పుడు ముల్లోకములలో గొప్ప ఉత్సవము జరిగెను(6). హిమవంతుడు కూడ మిక్కిలి ఆనందించి గొప్పవేడుకలను జరిపించి, బ్రాహ్మణులను బంధువులను మరియు ఇతరులను మంచి మనస్సుతో పూజించెను(7) బ్రాహ్మణులు, బంధువులు మరియు ఇతరులు అందదరు సంతసించి మహదాశీర్వచనములను ఆ హిమవంతునకు ఇచ్చి తమ తమ స్థానములకు మరలి వెళ్ళిరి(8)
హిమవంతుడు కూడ మిక్కిలి ఆనందించినవాడై మేనతో గూడి సకల సుఖములు గల గృహమునందు మాత్రమే గాక, నందనవనము ఇత్యాది సుందర ప్రదేశముల యందు గూడ రమించెను(9) ఆ సమయములో విష్ణువు మొదలగు గల సర్వదేవతలు, మరియు మహాత్ములగు మునులు హిమవంతుని వద్దకు వెళ్ళిరి(10). వచ్చినవారి నందరిని చూచి మహాత్ముడగుహిమవంతుడు తన భాగ్యమును కొనియాడి ఆనందముతో వారకి ప్రణమిల్లి భక్తితో వారిని సన్మానించెను(11). అతడు భక్తితో దోసిలి యొగ్గి శిరసు వంచి స్తుతించెను ఆ పర్వతునకు ఆనందముచే గొప్ప గగుర్పాటు కలుగటయే గాక, ఆనందబాష్పములు రాలెను(12) అపుడు ప్రసన్నమగు మనస్సు గల హిమవంతుడు గొప్ప ఆనందముతో ప్రణమిల్లెను. ఓ మహర్షీ! అతడు అపుడు ప్రణమిల్లిన పిదప, విష్ణువు మొదలుగా గల దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను(13)
హిమవంతుడిట్లు పలికెను-
ఈనాడు నా పుట్టుక సఫలమైనది నేను చేసిన గొప్ప తపస్సు ఫలించినది. ఈనాడు నా జ్ఞానము సార్థకమైనది. ఈనాడు నేను చేసిన పుణ్యకర్మలు ఫలమునిచ్చినవి(14) నేనీనాడు ధన్యుడనైతిని. నా భూభాగమంతయూ ధన్యమైనది మరియు కులము, భార్య మరియు సర్వము ధన్యమైనదనుటలో సందియుము లేదు(15) కారణమేమనగా, మీ సేవకునిగా తలంచి ప్రీతితో ఉచితమగు తీరున నన్ను కార్యమునందు నియోగించుడు(16)
బ్రహ్మ ఇట్లు పలికెను-
హిమవంతుని ఈ మాటను విని విష్ణువు మొదలగు ఆ దేవతలు అపుడు తమ కార్యము సిద్దించినదని తలంచి సంతసించినవారై, ఇట్లు పలికిరి(17)
దేవతలిట్లు పలికిరి-
ఓయీ హిమవంతా| మహాప్రాజ్ఞా| మేము చెప్పే హితకరమగు వచనమును వినుము మేమందరము ఏ పని కొరకు వచ్చితిమో, దానిని ప్రీతితో చెప్పెదము(18) ఓ పర్వతరాజా| జగన్మాతయగు ఉమ పూర్వము దక్షుని కుమార్తె యై జన్మించి, రుద్రనకు భార్యయై చిరకాలము భూమండలమునందు క్రీడించెను(19) ఆ సతీదేవి తండ్రిచే అవమానింపబడి తన ప్రతిజ్ఞను గుర్తునకు తెచ్చుకొనెను. అపుడా జగన్మాత ఆ దేహమును త్యజించి తన ధామమునకు వెళ్ళెను(20) ఓ హిమగిరీ! ఆ కథ లోకములో ప్రసిద్ధి గాంచినది. నీకు కూడా ఆ గాథ తెలియును. ఇట్లు అయినచో, దేవతలకందరికి గొప్ప లాభము ఒనగూరును(21) మరియు నీకు కూడ గొప్ప ప్రయోజనము చేకూరును దేవతలందరు నీకు వశవర్తులై ఉండగలరు(22)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2021
No comments:
Post a Comment