కోరికే భయానికి హేతువు
🌹. కోరికే భయానికి హేతువు 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
దానివల్ల మీరు కోల్పోయేదేముండదు. మహా అయితే మీ సంకెళ్ళు. మీ చిరాకు, మీ విసుగు, ఎప్పుడూ మీలో ఉండే ఏదో కోల్పోయిన భావనలు పోతాయి. కోల్పోయేందుకు మీ దగ్గర అంతకన్నా ఏముంది? ఆ చెత్త నుంచి బయటపడి బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, మహావీరులను వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని మీరు అంగీకరించడం ప్రారంభించండి. మీరు మీ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి కానీ, బుద్ధుడు, కృష్ణుడు, నానక్, జీసస్, మహావీరుల పట్ల బాధ్యతాయుతంగా ఉండ వలసిన పనిలేదు.
ఇంతవరకు మిమ్మల్ని మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా కర్తవ్యం పేరు చెప్పి ఇతరులకు కావలసినవన్నీ చేసిపెడుతూ మీ పట్ల మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ జీవించారు. అందుకే మీతో విసిగిపోయిన మీరు నిస్సారమని తెలుసుకున్నారు. అలా తెలుసుకోవడం మంచిదే.
జైలు నుంచి బయటపడేందుకు అంతకన్నా ఏమి కావాలి? అందులోంచి బయటకు దూకి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళండి. ‘‘బాగా ఆలోచించి దూకు’’ అని అందరూ అంటుంటారు. అదే నేనైతే ‘‘ముందు దూకి, తరువాత బాగా ఆలోచించండి’’ అంటాను.
మనల్ని పైనుంచి గమనిస్తున్న వ్యక్తిగత దేవుడు కేవలం కల్పనే అయినప్పటికీ, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ, వాడిని వదలాలంటే నాకు చాలా భయంగానే ఉంది.
దేవుణ్ణి వదిలేందుకు నువ్వెందుకంత భయపడుతున్నావు?
ఎందుకంటే, కచ్చితంగా నీలో ఎక్కడో ఆ దేవుడు నిన్ను కాపాడుతున్నాడనే భావన దాగి వుంది. అందుకే వాడిని వదిలేందుకు నువ్వు అంతగా భయపడుతున్నావు. కాబట్టి, ‘దేవుడు’ అనే భావన నీ మనసుకు ఒకరకమైన రక్షణ కవచం లాంటిది.
తల్లి గర్భంలో వున్నపుడు ఏ మాత్రం భయపడని పసివాడు పుట్టిన వెంటనే భయపడతాడు. తల్లి గర్భంలో వున్న శిశువు ఏ చర్చికో, మసీదుకో, దేవాలయానికో వెళ్లి బైబిల్, ఖురాన్, భగవద్గీతలు చదవాలనుకున్నట్లు, ‘‘దేవుడున్నాడా, లేడా? దయ్యాలున్నాయా, లేవా? నరకమంటే ఏమిటి? స్వర్గమంటే ఏమిటి?’’ అని ఆలోచించినట్లు నేనెప్పుడూ వినలేదు. వాడు అలా దేని కోసం ఆలోచించాలి?
వాడు ఇప్పుడే తల్లిగర్భమనే స్వర్గంలో ఉన్నాడు. ‘‘నాకిది కావాలి, అది కావాలి’’ అని అడగవలసిన అవసరం వాడికి అక్కడ ఏ మాత్రముండదు. ఎందుకంటే, అక్కడ వాడికి కావలసినవన్నీ నిరంతరం సమకూరుతూనే ఉంటాయి. అంతకన్నా గొప్ప స్వర్గమేముంటుంది.
నిజానికి పసివాడు తల్లి గర్భంలో వున్న తొమ్మిది నెలల కాలంలో ఎదిగినంతగా తొంభై ఏళ్ళొచ్చినా ఎదగడు. ఆ తొమ్మిది నెలల కాలంలో వాడు అణువు నుంచి అనంతందాకా కొన్ని లక్షల సంవత్సరాలలో చోటుచేసుకున్న పరిణామక్రమంలోని అన్ని దశల గుండా ప్రయాణిస్తాడు.
అక్కడ వాడి జీవితానికి పూర్తి రక్షణ ఉంటుంది. ఉద్యోగానే్వషణలు, ఆకలిదప్పుల బాధల్లాంటివి అక్కడ ఉండవు. వాడికి కావలసినవన్నీ తల్లి శరీరమే సమకూరుస్తుంది. మీరు తల్లి గర్భంలో జీవించిన ఆ తొమ్మిది నెలలలో మీకు లభించిన రక్షణే ప్రస్తుతం చెలామణిలో వున్న అన్ని మతాలకు పురుడు పోసింది. అందుకే తల్లి గర్భం నుంచి బయటపడిన శిశువు వెంటనే భయపడతాడు. అది కచ్చితం.
ఎందుకంటే, పూర్తి రక్షణ, అన్ని సౌకర్యాలతో వున్న గృహం నుంచి ఏమీ తెలియని ఈ వింత ప్రపంచంలోకి ఆ శిశువు గెంటివేయబడ్డాడు. ఇక్కడ వాడు స్వయంగా ఊపిరి పీల్చడం ప్రారంభించాలి కానీ, వాడి తల్లి ఊపిరి పీల్చితే సరిపోదు. ఈ సత్యం తెలిసేందుకు ఆ పసికందుకు కొన్ని క్షణాలు పడుతుంది.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment