బాహ్య పరస్పరాధీనత తప్పదు


🌹. బాహ్య పరస్పరాధీనత తప్పదు 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి, భారతదేశంలో మీరు ఏమైనా చెయ్యొచ్చు. మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ, అది ఇతరులకు సమస్యగా మారకూడదు. అలాగే మీరు ఇతరుల జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. అవగాహన కలిగిన వ్యక్తి ఇతరుల స్వేచ్ఛను ఎంత గౌరవిస్తాడో తన స్వేచ్ఛను కూడా అంతగానే గౌరవిస్తాడు.

ఎందుకంటే, ఇతరులు మీ స్వేచ్ఛను గౌరవించకపోతే మీ స్వేచ్ఛ నాశనమైనట్లేకదా! కాబట్టి, అది పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ‘‘నేను మీ స్వేచ్ఛను గౌరవిస్తాను, మీరు నా స్వేచ్ఛను గౌరవించండి. అప్పుడు ఇద్దరమూ స్వేచ్ఛగా ఉంటాం’’అనేది ఎవరూ హద్దులు మీరని రాజీవ్యవహారం. ఉదాహరణకు, మీ సొంత ఇంట్లో మీరు అర్థరాత్రి గట్టిగా పాడాలనుకున్నా పాడలేరు. ఎందుకంటే, అది పొరుగువారికి నిద్రాభంగం కలిగిస్తుంది. కాబట్టి, మీరు రాజీపడక తప్పదు.

బాహ్య ప్రపంచంలో మనం మనుషులతో మాత్రమే కాదు, అన్ని విషయాలలోనూ పరస్పరాధీనులమే. చెట్లు మీరు వదిలిన కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని మీకు కావలసిన ఆక్సిజన్‌ను అందిస్తాయి. వాటిని నరికేస్తే మీరు చనిపోతారు. ధూమపానం ద్వారా మీరు చెట్లకు కావలసిన కార్బన్ డైయాక్సైడ్‌ను అందించినప్పుడు అవి చాలా సంతోష పడతాయి. అందుకు మూలకారణం తెలుసుకోమని నేను మీకు చెప్తే వెంటనే మీరు ధూమపానం మానేస్తారు. అప్పుడు చెట్లు చాలా బాధపడతాయి.

కాబట్టి, మన పరస్పరాధీనత కేవలం చెట్లతో మాత్రమే కాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో కూడా ఉంది. నిజానికి, అన్నీ పరస్పరాధీనమైనవే. ఆ పరస్పరాధీనతను ఆనందించండి. అంతేకానీ, దానిని బానిసత్వంగా భావించకండి. పరస్పరాధీనత బానిసత్వంకాదు. మీరు ఇతరులపై, ఇతరులు మీపై ఆధారపడి ఉన్నారు. అది సోదరభావ సంబంధం. చిన్న గడ్డిపరకకు కూడా నక్షత్రాలతో సంబంధముంది.

కానీ, మీ అంతర్గత ప్రపంచంలో, మీ అంతర్గత సామ్రాజ్యంలో మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండగలరు. అక్కడ మీరు దేనికోసమో బాధపడవలసిన, దేనిపైనో తిరుగుబాటు చెయ్యవలసిన అవసరముండదు. బాహ్య పరస్పరాధీనత తప్పదని, అనివార్యమని తెలుసుకోండి. జరిగే వాటిలో అది ఒక భాగం. దానిని ఏమీ చెయ్యలేము. ఏమీ చెయ్యలేని దానిని అంగీకరించడమొక్కటే మార్గం.

కాబట్టి, ఏదో ఇష్టం లేని రాజీనామా ఇచ్చినట్లు కాకుండా, మనస్ఫూర్తిగా, ఆనందంగా దానిని అంగీకరించండి. ఇది మన విశ్వం. మనం అందులో భాగం. మనం ద్వీపాలం కాదు, మొత్తం ఖండంలో భాగం.

మీ స్వేచ్ఛ్భావన మీ అహంభావం మూలాలలో ఎక్కడో నాటుకుని ఉంది. మనం అహాలం కాదు. అహానిది అవాస్తవ అస్తిత్వం. ఎందుకంటే, మనం విడిగా లేము. అప్పుడు మనకు అహాలు ఎలా ఉంటాయి?

‘‘నేను’’ అనేది కేవలం భాషకు ఉపయోగపడే పదం మాత్రమే. అంతేకానీ, దానికి ఎలాంటి సారంలేదు, వాస్తవికత లేదు. అది కేవలం ఏమీలేని నీడ మాత్రమే.

మీరు మీ ఎరుక లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అంతర్గత స్వేచ్ఛ మీకు తప్పక లభిస్తుంది. మీరు మీ శరీరాన్ని, ఆలోచనా పద్ధతులను నిశితంగా పరిశీలిస్తూ సాక్షిగా ఉండండి.

అప్పుడు మెల్లమెల్లగా మీరు హిందు, మహమ్మదీయ, క్రైస్తవ, సామ్యవాదులు కాదని, అసలు మీరు ఎలాంటి ఆలోచన కాదని, చివరికి మీరు మనసు, కోపము, దురాశలు కూడా కాదని మీకు తెలుస్తుంది.

నిర్మల సాక్షీతత్వానుభవమే సంపూర్ణ స్వేచ్చానుభవం. కానీ, అది అంతర్గతానికి సంబంధించిన విషయం. అంతర్గతంలో పూర్తి స్వేచ్ఛతో ఉన్న వ్యక్తి బాహ్య స్వేచ్ఛను ఆశించడు. అలాంటి వ్యక్తికి ప్రకృతిని యథాతథంగా స్వీకరించగల సామర్థ్యముంటుంది.

సాక్షిగా ఉండడం ద్వారా అంతర్గత స్వేచ్ఛను సృష్టించి అందులో జీవించండి. అప్పుడు మీరు బాహ్య పరస్పరాధీనతను తెలుసుకో గలుగుతారు. అది ఒక అందమైన ఆశీర్వాదం. దానికి తల వొంచి అందులో విశ్రాంతి పొందండి. అంతేకానీ, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యవలసిన అవసరంలేదు. గుర్తుంచుకోండి: అసలైన స్వేచ్ఛాపరుడు మాత్రమే తల వొంచగలడు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

15 Mar 2021

No comments:

Post a Comment