మైత్రేయ మహర్షి బోధనలు - 31


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 31 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 20. కోపము 🌻

మా బృందమున తీరిక సమయములలో ఒక ఆట ఆడు చుందురు. అది యేమనగా ఒకరి నొకరు కవ్వించుట. కవ్వింపబడిన వారిలో ఎవరికి ముందు కోపము వచ్చునో వారు ఓడిపోయినట్లు. యోగికి కోపము తెప్పించు కొనుట యుండును గాని కోపమునకు లోబడుట యుండదు. కోపమునకు లోబడుట అలసత్వము. అవసరమునకు కోపించుట, అవసరమునకొక ఆయుధమును వాడినట్లే. కోపమును తాను వాడవలెను గాని తనను కోపము వాడరాదు. కోపమునకు లోబడకుండుటెట్లు? అను విచికిత్స వలన దాని నధిగమించుట యుండదు. కోపము తనంతట తానే వచ్చుట యనగా తన యందలి శక్తి ప్రభావమునకు నియమము లేకుండుటయే!

దైనందిన జీవితమున నియమములను దీక్షతో పాటించిన వారికి క్రమశః కోపము ఉపశిమించును. శక్తిప్రవాహము యొక్క ఆకస్మిక అవతరణమే కోపము. నియమపూరితమైన జీవితమున శక్తి ప్రవాహమునకు అనువైన గమనముండును గనుక అకస్మాత్తుగ ఛేదించుకొని వెలువడవలసిన అవసరముండదు. రక్తనాళములందు ప్రవహించు రక్తము నిరోధింపబడినచో ఏమగును? నాళము చిట్లును. అటులనే శక్తిప్రసారమును నిరోధించునపుడు చిమ్ముకొనుచు కోపము వచ్చును. వినిమయము నియమముగా గల జీవితములలో కోపమునకు తావుండదు. అందులకే అపుడపుడు కోపముతో ఆడుకొనుటకు మేము సాహసింతుము. కోపముతో ఆడుకొనుట, విద్యుత్తుతో ఆడుకొనుట వంటిది. మా బృందమున ఇట్టి అపాయకరమగు ఆటలు గలవు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2021

No comments:

Post a Comment