నిర్మల ధ్యానాలు - ఓషో - 135


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 135 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మేలుకోవడానికి నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించు. నువ్వు ఎప్పుడయితే పూర్తిగా మేలుకుంటావో, ఇరవై నాలుగు గంటలూ మెలకువతో వుంటావో, అంటే నిద్రపోతున్న సమయంలోనూ స్పృహతో వుంటావో, చైతన్యంతో వుంటావో శరీరం నిద్రపోతున్నా ఆత్మ మేల్కొని వుంటుందో అది నిజమైన మెలకువ. అప్పుడు వ్యక్తి సంతృప్తి చెందుతాడు. 🍀


మన కోరికలు మన కలలు. మన ఆలోచనలన్నీ మన కలలు. మనం నిద్రపోతూ వుంటాం కాబట్టి మనం కలలో జీవిస్తూ వుంటాం. కలలన్నవి మన నిద్రలో మాత్రమే వునికిలో వుంటాయి. మనం మేలుకున్న వెంటనే కలలు మాయమవుతాయి. కలల్ని దాటి వెళ్ళడమంటే మేలుకోవడమే. ఇదే సరయిన సమయం. నువ్వు కావలసినంత నిద్రపోయావు. ఎన్నెన్నో జీవితాల పాటు నిద్రపోయావు. మేలుకోవడానికి కలిగిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. యిది అరుదయిన అవకాశం. దీన్ని సులభంగా చేజార్చుకోవచ్చు. కాబట్టి మేలుకోవడానికి నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించు.

ఆరంభంలో దాదాపు అది అసాధ్యమనిపిస్తుంది. ఎట్లా చెయ్యాలి? వ్యక్తి ప్రయత్నించే కొద్దీ వీలవుతుంది. ఒక క్షణం ఒక మెరుపు చాలు. నీ అస్తిత్వాన్ని మేలుకొలుపుతుంది. అట్లా క్రమక్రమంగా క్షణాలు కొనసాగుతాయి. నువ్వు ఎప్పుడయితే పూర్తిగా మేలుకుంటావో, ఇరవై నాలుగు గంటలూ మెలకువతో వుంటావో, అంటే నిద్రపోతున్న సమయంలోనూ స్పృహతో వుంటావో, చైతన్యంతో వుంటావో శరీరం నిద్రపోతున్నా ఆత్మ మేల్కొని వుంటుందో అది నిజమైన మెలకువ. అప్పుడు వ్యక్తి సంతృప్తి చెందుతాడు. తన చోటికి చేరతాడు. దానికి పూర్వం నీకు చేతనయినంతగా ప్రయత్నించు. మెలకువకు ప్రయత్నించు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2022

No comments:

Post a Comment