గీతోపనిషత్తు -323


🌹. గీతోపనిషత్తు -323 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-3 📚


🍀 24-3. తత్త్వదర్శనము - సమస్త సృష్టియందు నటించుచు నర్తించుచునున్న దైవమును చూచుట నిత్యము సాధనగ సాగవలెను. లేనిచో కనిపించినను చూడలేరు. వినిపించినను వినలేరు. ఇది నిజమగు పతన స్థితి. తాము నమ్ముకొన్న నామమే దైవ నామమని, తాము నమ్ముకొన్న రూపమే దైవ రూపమని సంకుచితమగు భావములలో బంధింపబడి భేదములు సృష్టించు కొనుచు, కలహించు కొనుచు, దేవుని పేరున అధోగతి చెందుచున్నారు. అన్ని ప్రార్ధనలు ఒకే దైవమును చేరునను భావన ప్రధానము. 🍀


అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే || 24

తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.

వివరణము : ఎన్ని రకముల వేషములు వేసినను అట్టి వేషములను ధరించిన నటుని గుర్తించినట్లు సమస్త సృష్టియందు నటించుచు నర్తించుచునున్న దైవమును చూచుట నిత్యము సాధనగ సాగవలెను. లేనిచో కనిపించినను చూడలేరు. వినిపించినను వినలేరు. ఇది నిజమగు పతన స్థితి. పై విధముగ దైవమును దర్శించ లేకుండుటకు, విన లేకుండుటకు, స్పృశించ లేకుండుటకు ముఖ్యకారణ మొక్కటియే. అదియే తత్త్వజ్ఞాన లేమి. సంప్రదాయబద్ధులై ఏదో ఒక భగవద్రూపమునకు, ఒక భగవన్నామమునకు కట్టుబడి యుండువారు తద్భిన్నమగు కోటాను కోట్ల సృష్టి రూపములను దర్శించినపుడు, అవి దైవ రూపములే అని గుర్తించలేరు. కనుక గ్రుడ్డివారు, చెవిటివారు దైవమునందే జీవించుచు దైవమును తెలియలేక అజ్ఞానులై పడి యున్నారు. ఇది మానవజాతి దుస్థితి.

తాము నమ్ముకొన్న నామమే దైవ నామమని, తాము నమ్ముకొన్న రూపమే దైవ రూపమని సంకుచితమగు భావములలో బంధింపబడి భేదములు సృష్టించు కొనుచు, కలహించుకొనుచు, రక్తపాతములు సృష్టించుచు దేవుని పేరున అధోగతి చెందుచున్నారు. చ్యవనము చెందు చున్నారని దైవము పలికినాడు. అన్ని ప్రార్ధనలు ఒకే దైవమును చేరునను భావన ప్రధానము. యజ్ఞములు, క్రతువులు, కీర్తనలు, భజనములు, జపములు, ధ్యానములు అన్నిటి గమ్యము నేనే. అన్నిటికిని ప్రభువు నేనే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Feb 2022

No comments:

Post a Comment