మైత్రేయ మహర్షి బోధనలు - 67


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 67 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 53. నిరసించుట - ప్రేమించుట 🌻


మనుష్యులను ద్వేషించువారు మహత్తర కార్యములు చేయ లేరు. ఎల్లప్పుడును మానవజాతిని నిరసించుచు మాటాడు వక్తలు, ప్రవక్తలు చాలామంది కలరు. నిరసించుట వలన ఈ వక్తలు, ప్రవక్తలు ఏ మహత్కార్యమును సాధింపలేరు. కేవలము సిద్ధాంతవాదులుగ చరిత్రపుటలలో మిగిలిపోయినారు. జీవులను నిరసించుట సిగ్గుచేటు. తమలోని ద్వేషభావమునే, వక్తలందరును జీవులపై నిరసన భావముగ ప్రకటింతురు. నిరసించుటకన్న ప్రేమించుట మిన్న. జీవులను ప్రేమించు వారు జీవుల సమస్యలకు పరిష్కారము చూపుదురు. సహకారము నందింతురు. జీవుల పురోగతికి తోడ్పడుదురు. వీరు పరస్పరత్వమును నేర్పుదురు.

పరస్పరత్వము పునాదిగ ఏకత్వపు వైభవమును ఆవిష్కరింతురు. ఏకత్వము, పరస్పరత్వము, ఒకరిపై నొకరికి విశ్వాసము కారణముగ సహాయ సహకారముల నందించు కొనుచు మహత్తర కార్యములు చేయుదురు. కేవలము ప్రేమ, పరస్పరత్వము ఆధారముగనే కోతులు సముద్రముపై వంతెనను నిర్మాణము చేసినవి. ప్రగాఢమైన విశ్వాసము, పరస్పర ప్రేమ, సహాయ సహకారములు, రాముని యందు ఏకత్వము వంతెనకు పునాదిరాళ్ళుగ నిలచినవి. దుర్ఘట కార్యములు కూడ పై పునాదుల వలన సాధింపబడినవి.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 Feb 2022

No comments:

Post a Comment