గీతోపనిషత్తు -294


🌹. గీతోపనిషత్తు -294🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 17-5

🍀 17-5. ప్రణవ స్వరూపుడు - ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమన్వయమున సృష్టి ఏర్పడుచు యున్నది. మనయందు కూడ ఇచ్ఛా జ్ఞాన క్రియల సమన్వయమే జీవన సిద్ధినిచ్చును. ఈ మూడు వేదములు గ్రంథము లనుకొనుట కన్న మూడు సజీవ ప్రవాహములుగ గుర్తించుట శ్రేష్ఠము. ఈ మూడింటికిని మూలము ఓంకారము. క్రతువు నేనే, యజ్ఞము నేనే, స్వాహాకారము నేనే, హోమ ద్రవ్యమును నేనే, మంత్రము నేనే, అగ్నిని నేనే, అగ్ని యందు సమర్పింపబడు ఓషధులు నేనే, పవిత్ర వస్తువులుగ గోచరించునది నేనే, ఓంకారము నేనే, వేదమును నేనే అని ఉదాహరణ పూర్వకముగ తెలిపినాడు. 🍀

పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17

తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.

వివరణము : సంకల్పము ఇచ్ఛాశక్తి స్వరూపము. ప్రాణము జ్ఞానశక్తి స్వరూపము. బుద్ధి క్రియాశక్తి స్వరూపము. ఓంకారము రూపమున ఈ మూడింటికిని బలము కూర్చి ఈశ్వరుడు సృష్టి నిర్వహణము చేయుచున్నాడు. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమన్వయమున సృష్టి ఏర్పడుచు యున్నది. మనయందు కూడ ఇచ్ఛా జ్ఞాన క్రియల సమన్వయమే జీవన సిద్ధినిచ్చును. ఈ మూడు వేదములు గ్రంథము లనుకొనుట కన్న మూడు సజీవ ప్రవాహములుగ గుర్తించుట శ్రేష్ఠము. ఈ మూడింటికిని మూలము ఓంకారము.

ఇట్లు ఈశ్వరుడు ఈ శ్లోకమున తన అస్థిత్వమును గూర్చి మరికొన్ని ఉదాహరణలు పేర్కొని యున్నాడు. “క్రతువు నేనే, యజ్ఞము నేనే, స్వాహాకారము నేనే, హోమ ద్రవ్యమును నేనే, మంత్రము నేనే, అగ్నిని నేనే, అగ్ని యందు సమర్పింపబడు ఓషధులు నేనే, నేయి నేనే, సమస్తమును హుతము గావించు వాడను నేనే యనియు, తండ్రిని నేనే, తల్లిని నేనే, తాతను నేనే, సమస్తము నందు తెలియబడు వాడను నేనే, పవిత్ర వస్తువులుగ గోచరించునది నేనే, ఓంకారము నేనే, వేదమును నేనే అని ఉదాహరణ పూర్వకముగ తెలిపినాడు. అట్లే తరువాతి శ్లోకములలో కూడ మరికొన్ని ఉదాహరణలు తెలుపబూనినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2021

No comments:

Post a Comment