శ్రీ శివ మహా పురాణము - 493


🌹 . శ్రీ శివ మహా పురాణము - 493 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 39

🌻. శివుని యాత్ర - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! శివునకు ప్రియుడవగు నీవు శివుని ఆ యాజ్ఞను స్వీకరించి అందరి వద్దకు వ్యక్తిగతముగా వెళ్లి శీఘ్రమే ఆహ్వానించితివి (24). నారదా! నీవు శివుని దూతవై ఆయన ఆజ్ఞను నిర్వర్తించి వెనువెంటనే శివుని వద్దకు వచ్చి నిలబడితివి (25). శివుడు కూడా ముహూర్తము యొక్క రాకను ఉత్కంఠతో ఎదురుచూచుండెను. శివగణములన్నియూ అన్ని దిక్కులయందు నాట్యము చేయుచూ ఉత్సవమును చేసుకొనెను (26). అదే కాలములో విష్ణువు తన వేషమును ధరించి గణములతో గూడి శీఘ్రముగా కైలాసమునకు వచ్చెను (27).

ఆయన భార్యతో గణములతో గూడి శివునకు ఆనందముతో పూర్ణ భక్తితో నమస్కరించి, ఆయన ఆజ్ఞను పొంది, చక్కని స్థానమునందు హర్షము నిండిన మనస్సు గలవాడై నివసించెను (28). అదేవిధముగా నేను కూడా నా గణములతో గూడి ఆనందముతో వెంటనే కైలాసమునకు వెళ్లి గణములతో సహా శివునకు నమస్కరించి ఆనందముగా మకాము చేసితిని (29). ఇంద్రుడు మొదలగు లోకపాలు రందరు చక్కగా అలంకరించుకొని తమ భార్యలతో, పరివారముతో గూడి ఉత్సాహముతో విచ్చేసిరి (30). అదే విధముగా ఆహ్వానించబడిన మునులు, నాగులు, సిద్ధులు, ఉపదేవతలు, మరియు ఇతరులందరు ఉత్సాహముతో కైలాసమునకు విచ్చేసిరి (31).

అపుడు మహేశ్వరుడు అచటకు వచ్చిన దేవతలు మొదలగు వారందరికీ వ్యక్తిగతముగా సత్కారమును ఆనందముతో చేసెను (32). తరువాత కైలాసములో అత్యద్భుతమగు మహోత్సవము జరిగెను. అపుడు దేవతాస్త్రీలు యథోచితముగా నాట్యము మొదలగు వాటిని చేసిరి (33).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

21 Dec 2021

No comments:

Post a Comment