గీతోపనిషత్తు -354


🌹. గీతోపనిషత్తు -354 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚

🍀 33-4. కూడి యుండుట - సంబంధ బాంధవ్యములు అసుఖమే గాక అనిత్యము గూడ. అయినను మాయాబద్ధుడగు జీవుడు వీనితో పెనుగులాడుచు నుండును. అట్లుకాక అందరి యందుగల పరమాత్మను గుర్తించి, దర్శించి, సేవించుచు నున్నచో అతడు నిత్యమున్నాడు గనుక అతనితో సంబంధము నిత్యమై యుండును. మనముండుట యనగ ఈశ్వరుడుండుటయే గనుక ఈశ్వరునితో కూడి యుండుట వలన శాశ్వత సుఖ మేర్పడును. అతని ప్రేమ కూడ నిత్యము, శాశ్వతము. అహర్నిశలు మనను అంటిపెట్టుకొని యున్న ఈశ్వరుని చింత మాని, ఇతర చింత యందుండువారు సుఖపడలేరు. 🍀

కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33

తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.

వివరణము : కనుక సంబంధ బాంధవ్యములు అసుఖమే గాక అనిత్యము గూడ. అయినను మాయాబద్ధుడగు జీవుడు వీనితో పెనుగులాడుచు నుండును. అట్లుకాక అందరి యందుగల పరమాత్మను గుర్తించి, దర్శించి, సేవించుచు నున్నచో అతడు నిత్యమున్నాడు గనుక అతనితో సంబంధము నిత్యమై యుండును. సుఖమై యుండును కూడ. పరిసరముల యందలి జీవుల యందున్నటువంటి ఈశ్వరునితో అనుబంధ మేర్పడినచో జీవులు మారినను ఈశ్వరుడు మారడు. ఈశ్వరుడు నిత్యబంధువై శాశ్వతమగు మిత్రుడై తోడుగ ఎల్లప్పుడును యుండును.

మనముండుట యనగ ఈశ్వరుడుండుటయే గనుక ఈశ్వరునితో కూడి యుండుట వలన శాశ్వత సుఖ మేర్పడును. అతని ప్రేమ కూడ నిత్యము, శాశ్వతము. అహర్నిశలు మనను అంటిపెట్టుకొని యున్న ఈశ్వరుని చింత మాని, ఇతర చింత యందుండువారు సుఖపడలేరు. కనుక తనతో కూడి యుండుమని దైవము అమిత వాత్సల్యముతో పలికినాడు. ఇతరములతో కూడినచో సుఖమంతంత మాత్రమే అని హెచ్చరించినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Apr 2022

No comments:

Post a Comment