గీతోపనిషత్తు -240
🌹. గీతోపనిషత్తు -240 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 20
🍀 19. సనాతనము - కాలమునకు ప్రకృతికి కూడ పుట్టుక స్థానమైనది సత్యము. అదే పరము. అది సనాతనము. అందుండియే ప్రకృతి, కాలము వ్యక్తమగును. అట్టి ప్రకృతినుండి సర్వప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, మరల ప్రకృతిలో లయమగుట కాలానుసారము సాగుచుండును. కాలానుసారమే ప్రకృతి కూడ సత్యమందు లయ మగుట జరుగును. కాలము గూడ సత్యమందు లయమై, మరల వ్యక్త మగుచుండును. కనుక అవ్యక్తమగు ప్రకృతికి కూడ అవ్యక్తమై యుండునది సత్యము గనుక, సనాతన మందురు. 🍀
పరస్తస్మాత్తు భావో2_న్యో వ్యక్తో వ్యక్తా త్సనాతనః |
యస్ససర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 20
తాత్పర్యము : పరమగు సత్యము అవ్యక్తమగు ప్రకృతి కన్నను అన్యమై యున్నది. అది సనాతనము. అది వ్యక్తము కానిది. సమస్త ప్రాణికోట్లు నశించినను, నశింపక యుండునది.
వివరణము : పరమే సత్యము. అది సృష్టి యున్నను, లేకుండినను యుండును. దానియందే సమస్తము ఇమిడి యుండును. సృష్టి లయించునది పరమగు సత్యములోనికే. మూలప్రకృతి సహితము సత్యములోనికే ఇమిడిపోవును. లయమున సత్య మొక్కటియే యుండును. కాలమునకు ప్రకృతికి కూడ పుట్టుక స్థానమైనది సత్యము. అదే పరము. దానిని దర్శించుటకు ఇంకొక వస్తు వుండదు. కనుక దానిని గూర్చి వివరించుట అసాధ్యము. విశ్లేషించుట అవివేకము. చేతస్వరూపమగు ప్రకృతి కూడ అందిమిడిపోయి యుండుటచే ఉండుటయే యుండును గాని ఎరుక కూడ యుండదు.
అందుండి ఎరుక ఏర్పడినపుడు కాలము, ప్రకృతి వ్యక్తమగును. అట్టి సత్యము నందిమిడి పోవుటయే గాని, దానిని తెలియుట యుండదు. అది సనాతనము. అందుండియే ప్రకృతి, కాలము వ్యక్తమగును. అట్టి ప్రకృతినుండి సర్వప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, మరల ప్రకృతిలో లయమగుట కాలానుసారము సాగుచుండును. కాలానుసారమే ప్రకృతి కూడ సత్యమందు లయ మగుట జరుగును. అపుడు శేషించునది కాల మొక్కటియే. మరల సృష్టి ప్రారంభము వరకు కాలము శయ్యగ, సత్యము వశించి యుండును.
కాలము గూడ సత్యమందు లయమై, మరల వ్యక్త మగుచుండును. కనుక అవ్యక్తమగు ప్రకృతికి కూడ అవ్యక్తమై యుండునది సత్యము గనుక, సనాతన మందురు. ఈ సనాతన సత్యమాధారముగనే నవావరణ సృష్టి ఏర్పడును. వృద్ధి చెందును. మరల సత్యములోనికి తిరోధానము చెందును. అట్టి సత్యమునకు నాశము లేదు. అందుండి వ్యక్తమైన ప్రకృతికి, భూతములకు ఉండుట లేకుండుట యుండును. అట్టి సత్యమును తెలియుట, సమీపమునకు చేరుట, అటు పైన సారూప్యము చెందుట సంభవము. అట్టి పరమాత్మ సమస్తమునకు అన్యమని ఈ శ్లోకము ఉద్బోధించు చున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment